రిజిస్ట్రేషన్ రేట్లు ఇక ఫిక్స్​డ్

రిజిస్ట్రేషన్ రేట్లు ఇక ఫిక్స్​డ్
  • ముఖ్యమైన సేవలు ఔట్​సోర్సింగ్​కు అప్పగించే యోచన
  • రైటర్ల అవసరం లేకుండా డాక్యుమెంట్ల మోడల్స్
  • ఒకట్రెండు రోజుల్లో ఆర్డినెన్స్ ఇవ్వనున్న సర్కారు

హైదరాబాద్, వెలుగుఇటీవలే వీఆర్వోల వ్యవస్థను రద్దు చేసిన సర్కారు.. ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్లపై నజర్​ పెట్టింది. వారికి ఉన్న విచక్షణాధికారాలను తగ్గించాలని నిర్ణయించింది. ఇందుకోసం రిజిస్ట్రేషన్ యాక్టును సవరిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. రిజిస్ట్రేషన్ యాక్ట్​ సెక్షన్ 47A ప్రకారం రిజిస్ట్రేషన్ల సమయంలో భూముల ధరల్లో మార్పులు, చేర్పులు చేసేందుకు సబ్ రిజిస్ట్రార్లకు అధికారాలు ఉన్నాయి.ఇప్పుడీ పవర్​ను తొలగించనున్నారు. ఇక ముందు సర్కారు నిర్ణయించిన రేట్ల మేరకే సబ్ రిజిస్ట్రార్లు భూములు, స్థలాలను రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది.

కరప్షన్ కట్టడి పేరుతో..

కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం వ్యవసాయ భూములను తహసీల్దార్లు.. వ్యవసాయేతర భూములను సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేస్తారు. అయితే రిజిస్ట్రేషన్లు చేసేప్పుడు భూముల రిజిస్ట్రేషన్​ వ్యాల్యూలో మార్పులు, చేర్పులు చేసి.. దాని ప్రకారం ఫీజును నిర్ణయించే అధికారం సబ్ రిజిస్ట్రార్లకు ఉంది. ఈ విచక్షణాధికారంతోనే సబ్ రిజిస్ట్రార్లు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నట్టు సర్కారు భావిస్తోంది. ఈ పవర్స్​ను కట్ చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని, అందుకే త్వరలో సర్కారు రిజిస్ట్రేషన్ యాక్టుకు సవరణ చేయనుందని ఆ శాఖలోని సీనియర్​ ఆఫీసర్​ ఒకరు వివరించారు.

పలు సేవలు ప్రైవేటుకు..

సబ్ రిజిస్ట్రార్​ ఆఫీసుల్లో ముఖ్యమైన పలు సేవలను ఔట్ సోర్సింగ్ కు ఇవ్వాలని సర్కారు ఆలోచిస్తున్నట్టు సమాచారం. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత డాక్యుమెంట్లను ఇంటర్నల్ స్టోర్ లో భద్రపరిచేందుకు వాటిని స్కానింగ్ చేస్తుంటారు. ఈ స్కానింగ్ ప్రక్రియను ప్రస్తుతం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు స్టాఫ్​ చేస్తున్నారు. అయితే ఈ స్కానింగ్ ను ఆలస్యం చేస్తూ కొందరు అవినీతికి పాల్పడుతున్నట్టు ఆరోపణలున్నాయి. దీంతో స్కానింగ్ ప్రక్రియను ప్రైవేటుకు అప్పజెప్తే ఎలాంటి అవినీతికి ఆస్కారం ఉండదని సర్కారు నిర్ణయానికి వచ్చిందని.. డాక్యుమెంట్ ను స్కాన్ చేసి వెంటనే సంబంధిత వ్యక్తులకు ఇచ్చేలా ప్రైవేటు కంపెనీలతో ఒప్పందం చేసుకోవాలని భావిస్తోందని అధికారవర్గాలు చెప్తున్నాయి.

కొత్తగా డాక్యుమెంట్ మోడల్స్

ప్రస్తుతం రిజిస్ట్రేషన్​ ఆఫీసుల వద్ద డాక్యుమెంట్ రైటర్ల ప్రమేయం ఎక్కువగా ఉంది. జనం సొంతంగా డాక్యుమెంట్ తయారు చేసుకునేలా ప్రభుత్వం నమూనాలను తయారు చేస్తోంది. ఇందుకోసం వివిధ రాష్ట్రాల్లో ఉన్న డాక్యుమెంట్ పేపర్ల మోడల్స్ ను
పరిశీలిస్తోంది.

త్వరలో రిజిస్ట్రేషన్​ వాల్యూ పెంపు

రాష్ట్రవ్యాప్తంగా త్వరలో భూముల రిజిస్ట్రేషన్​ వ్యాల్యూను పెంచాలని సర్కారు భావిస్తోంది. ఆ రేట్ల ఆధారంగానే సబ్ రిజిస్ట్రార్లు భూములను రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. తెలంగాణ ఏర్పాటుకు ముందు 2013 ఆగస్టులో రిజిస్ట్రేషన్​ వ్యాల్యూను పెంచారు. అప్పట్నించి అవే రేట్లు కొనసాగుతున్నాయి. అయితే ఆ ధరలకు, ప్రస్తుతమున్న అసలు ధరలకు మధ్య చాలా తేడా ఉంది. భూముల రేట్లు బాగా పెరిగిపోయాయి. దీంతో వాస్తవ ధరలకు దగ్గరగా ఉండేలా రిజిస్ట్రేషన్​ రేట్లను నిర్ణయించాలని సర్కారు యోచిస్తోంది. ఇందుకోసం జిల్లాల వారీగా ప్రస్తుత మార్కెట్​ ధరలను సేకరిస్తోంది. ఈ లెక్కన కొన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్​ రేట్లు పెరిగే చాన్స్ ఉంది. ఈ పెంపుతో సర్కారుకు ఏటా రూ.10వేల కోట్ల మేర అదనపు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా
వేస్తున్నారు.