ఆబాది ఇండ్ల జాగలకు త్వరలో రెగ్యులరైజేషన్

ఆబాది ఇండ్ల జాగలకు త్వరలో రెగ్యులరైజేషన్
  • కేంద్రం తెచ్చిన ‘స్వామిత్వ’ను మరో పేరుతో అమలు చేయాలని రాష్ట్ర సర్కార్​ యోచన
  • ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ నియామకం 
  • పంచాయతీల నుంచి వివరాల సేకరణ
  • స్కీం అమలైతే ఇంటి పేపర్లు పెట్టి బ్యాంక్​ లోన్​ తీసుకోవడం ఈజీ

హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీల్లో ఆబాది/ గ్రామ కంఠం పరిధిలో ఉన్న ఇండ్ల స్థలాలను రెగ్యులరైజ్​ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్​ ప్లాన్​ రూపొందిస్తున్నది. బ్యాంకు లోన్లు రాని ఈ స్థలాలకు బ్యాంక్ లోన్ వచ్చేలా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘స్వామిత్వ’ ప్రాపర్టీ కార్డులను జారీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ స్కీం ఆరు రాష్ట్రాల్లో నడుస్తున్నది. 2025 వరకు దేశంలోని అన్ని ఆబాది స్థలాలకు ప్రాపర్టీ కార్డులు జారీ చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. మన రాష్ట్రంలోనూ ఇలా ప్రాపర్టీ కార్డులు అందజేయాల్సి ఉండడంతో  స్వామిత్వ స్కీమ్ నే మరో రూపంలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆబాది స్థలాలు, నాన్ లే ఔట్ ప్లాట్ల పై మంత్రి కేటీఆర్ అధ్యక్షతన నియమించిన కేబినెట్ సబ్ కమిటీ కూడా ఇందులో భాగమేనని సమాచారం. ఇప్పటికే ఈ అంశంపై రెండు సార్లు చర్చించిన సబ్ కమిటీ.. ఇండ్ల స్థలాల రెగ్యులరైజేషన్​పై ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు తెలిసింది. ఇది అమలులోకి వస్తే దాదాపు  30 లక్షల ఇండ్ల రిజిస్ట్రేషన్​కు అవకాశం లభిస్తుంది. 

ఆబాది భూముల వివరాల సేకరణ
ఆబాది లేదా గ్రామకంఠం భూములకు సర్వే నంబర్ అంటూ ఉండదు. ఇది గ్రామానికి చెందిన ఉమ్మడి స్థలమే అయినప్పటికీ.. వీటిపై ప్రభుత్వానికిగానీ, స్థానిక పంచాయతీకి గానీ ఎలాంటి హక్కులు ఉండవు. ఆబాది స్థలంలో ఎవరు ఇల్లు నిర్మించుకుని, ఇంటి పన్నులు చెల్లిస్తుంటారో వారికే ఆ స్థలం చెందుతుందని, వాటిని అమ్ముకోవచ్చని, కొనుక్కోవచ్చని 2015లో ఉమ్మడి హైకోర్టు ఓ కేసు విచారణ సందర్భంగా తీర్పునిచ్చింది. పాత ఇండ్లకు పంచాయతీలు, మున్సిపాలిటీలు ఇచ్చిన ఓనర్ షిప్ సర్టిఫికెట్ల ఆధారంగా అడపాదడపా ఆబాది భూములను రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ.. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రభుత్వం ఆ సర్టిఫికెట్ల జారీని నిలిపివేసింది. దీంతో ఆబాదిలో ఉన్న ఇండ్లను కొత్తగా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కుదరడం లేదు. దీంతో గ్రామాల్లో ఇండ్ల అమ్మకాలు, కొనుగోళ్లకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆబాది(గ్రామకంఠం) భూములను సర్వే ద్వారా పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఇటీవల గుర్తించారు. ఆబాదిలో ఎంత విస్తీర్ణం ప్రజల ఆధీనంలో ఉంది.. ఎంత స్థలం ఉమ్మడి స్థలంగా వినియోగంలో ఉంది.. ప్రస్తుతం ఉన్న ఖాళీ జాగ ఎంత అనే వివరాలను అధికారులు సేకరించి కేబినెట్ సబ్ కమిటీకి రిపోర్ట్ చేశారు. 

లోన్లు తీసుకోవడం ఈజీ
గ్రామీణ ప్రాంతాల్లో మెజార్టీ ఇండ్ల యజమానులకు ఇంటి పన్ను చెల్లించిన రశీదులు తప్ప మరే రకమైన హక్కు పత్రాలు అందుబాటులో లేవు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఇల్లు నిర్మించుకోవాలన్నా.. లేదా ఇంకా ఏదైనా అవసరాలకు ఆ ఇంటి కాగితాలను పెట్టి లోన్​ తీసుకోవాలన్నా వీలు కావడం లేదు. కేవలం పట్టణాల్లోని రిజిస్టర్డ్ డాక్యుమెంట్లకే బ్యాంకులు లోన్లు ఇస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల ప్రజలకూ ఈ ప్రయోజనం చేకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం స్వామిత్వ కార్డులను జారీ చేస్తున్నది.

30 లక్షల ఇండ్ల రిజిస్ట్రేషన్​కు చాన్స్
రాష్ట్ర ప్రభుత్వం నిరుడు అక్టోబర్ లో రాష్ట్రవ్యాప్తంగా ఆస్తుల నమోదు కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా 12,751 గ్రామ పంచాయతీల్లో  65 లక్షల ఇండ్లు ఉన్నట్లు గుర్తించింది. ఈ వివరాలను ఈ–పంచాయతీ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో నమోదు చేశారు. ఇందులో సుమారు 30 లక్షల ఇండ్లు ఆబాది ఏరియాలోనే ఉన్నట్లు అంచనా. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం వీటికి రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించి, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు వసూలు చేస్తే ఆ స్థాయిలో సర్కార్ కు ఆదాయం కూడా సమకూరనుంది.