మాయమైన కుంటలు..కబ్జాకు గురైన నాలాలు

 మాయమైన కుంటలు..కబ్జాకు గురైన నాలాలు
  • నాగర్​కర్నూల్​లో 3 సెంటీమీటర్ల వానకే ఆగమాగం

నాగర్​కర్నూల్, వెలుగు: కుంటలు, నాలాలు కబ్జాకు గురవడంతో చిన్నపాటి వర్షానికే నాగర్​కర్నూల్​ పట్టణం జలమయమైంది. రోడ్లు కాలువలుగా మారితే, మురికి కాల్వలు కనిపించకుండా పోయాయి. కుంటల్లో ఉండాల్సిన నీళ్లన్నీ రోడ్లపైకి చేరి వాహనాలు కొట్టుకుపోయాయి. ఈ నెల 3న మధ్నాహ్నం 3 సెంటీమీటర్లు, 4న 2 సెంటీమీటర్ల వర్షానికి పట్టణం  అతాలకుతలమైంది. నాగర్​కర్నూల్–-జడ్చర్ల మెయిన్​ రోడ్డుపై నాలుగు ఫీట్ల వరకు నీళ్లు నిలిచాయి. కాలనీలు జలమయమయ్యాయి. గంటల తరబడి ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

కబ్జాలతో ముంచేసిన్రు..

నాగర్​కర్నూల్​ జిల్లా కేంద్రానికి నాలుగు దిక్కులు చెరవులు, కుంటలు ఉన్నాయి. కేసరి సముద్రం, నాగనూలు చెరువు, పుట్నాల కుంటతో పాటు ఉయ్యాలవాడ ఊర చెరువు, మరో మూడు కుంటలు ఉన్నాయి. కేసరి సముద్రం చెరువు కబ్జాలపై ఐదేండ్ల విచారణ అనంతరం ఎన్జీటీ చెన్నై బెంచ్​ అక్రమ నిర్మాణాలను కూల్చేయాలని ఆదేశించింది. అయితే అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈక్రమంలోనే ఎండబెట్ల వైపు చెరువును కబ్జా ప్రయత్నాలు జోరందుకున్నాయి. 

పుట్నాలకుంటలో అడ్డంగా కట్ట వేసి శిఖం భూమిని కబ్జా చేశారు. దీనిపై పోలీస్​  కేసులు నమోదయ్యాయి. సర్వే నెంబర్ల ఓవర్​ ల్యాప్  సమస్యగా చూపించి..​ నాగనూలు చెరువు బఫర్​ జోన్​లో వెంచర్​ చేసి ప్లాట్లు అమ్ముకున్నారు. నల్లవెల్లి మార్కెట్​ యార్డ్​ వెనుక ఉన్న చెరువు కబ్జా చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. 

గొలుసుకట్టు కుంటలదీ అదే పరిస్థితి..

నాగర్​ కర్నూల్​ పైభాగంలో ఉయ్యాలవాడ వైపు ఉన్న మూడు కుంటలను గతంలో ధ్వంసం చేశారు. అందులో నీరు నిల్వ ఉండకుండా చూసుకున్నారు. గత ప్రభుత్వం హయాంలో అంతులేని స్వామిభక్తిని చూపించిన ఇరిగేషన్​ ఇంజనీర్లు చెరువులు కబ్జాకు గురైనా, కుంటలు ధ్వంసమైనా పట్టించుకోలేదు.ఉయ్యాలవాడ ఊరచెరువు కుంటను ధ్వంసం చేసి అందులో నీరు నిల్వ ఉండకుండా చేసి ఏడాది కావొస్తున్నా దానిని పూడ్చే ప్రయత్నాలు చేయకుండా ప్రతిపాదనలతో సరిపెడుతున్నారు. భారీ వర్షాలతో వస్తున్న వరద నీరు చెరువులో నిల్వ ఉండకుండా పంట పొలాల మీదుగా కేసరి సముద్రం చెరువులో కలుస్తోంది. 

రైతులు నష్టపోతున్నా పట్టించుకోకుండా తమ దందా నడిస్తే చాలనుకుంటున్న రియల్టర్లకురాజకీయ పార్టీల నేతలు సపోర్ట్​ చేస్తున్నారనే విమర్శలున్నాయి. నాగర్​కర్నూల్​ పట్టణం  పైభాగంలో ఉన్న మూడు కుంటలు నిండిన తర్వాత, ఆ నీరంతా కేసరి సముద్రంలోకి వస్తాయి. ఆ మూడు కుంటలను ధ్వంసం చేసి, బఫర్​ జోన్లను కబ్జా చేసి రియల్​ దందాకు తెరలేపారు. గొలుసు కట్టు కుంటలను ధ్వంసం చేయడంతో వరద నీరంతా ఇండ్ల మధ్య నుంచి రోడ్లపైకి వచ్చి చేరుతోంది. ఇలా పట్టణంలోని టీచర్స్ కాలనీ, రాఘవేంద్ర కాలనీ, రాంనగర్, నేషనల్  హైస్కూల్  వెనక ప్రాంతంతో పాటు పలు కాలనీలు జలమయం అవుతున్నాయి. ఇండ్లు,సెల్లార్లలోకి నీరు చేరి ఇబ్బంది పడుతున్నారు.

నాలాలను కబ్జా చేసిన్రు.. 

జిల్లా కేంద్రం చుట్టు ఉన్న చెరువులు, కుంటల నుంచి వచ్చే నీరు ప్రవహించేందుకు నిర్మించిన నాలాలను కబ్జా చేసి, వాటిని డ్రైనేజీల మాదిరిగా కుదించేశారు. వాటిపై నిర్మాణాలు చేపట్టడంతో పట్టణంలోని 9 జంక్షన్​ వద్ద నీటి ప్రవాహం వాగును తలపిస్తోంది. ఉయ్యాలవాడ నుంచి బస్టాండ్​ వరకు అన్ని నాలాలను కబ్జా చేశారు. 3 సెంటీమీటర్ల వర్షం పడితే పట్టణం అంతా అతలాకుతలమైంది. వర్షం వెలిసిన తర్వాత కొన్ని కాలనీల పరిస్థితి దయనీయంగా మారింది. ఉయ్యాలవాడ నుంచి వచ్చే మెయిన్​ రోడ్డు కోతలకు గురైంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు కుంటలు, నాలాలను పునరుద్ధరించడంపై దృష్టి పెట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.