- రూ.10 వేలు ఫైన్, జైలు
- పక్షం రోజుల్లో 362 మందిపై కేసులు
- రూ.27.81 లక్షల జరిమానా 28 మంది జైలుకు
- సిద్దిపేట జిల్లాలో కొత్త నిబంధనలు అమలు
సిద్దిపేట, వెలుగు: మద్యం తాగి బండి నడుపుతూ పట్టుబడినవారిపై సిద్దిపేట పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. పోలీస్ కమిషనర్‌గా విజయ కుమార్ బాధ్యతలు స్వీకరించగానే డ్రంకన్‌డ్రైవ్‌లో దొరికినవారిపై కఠిన చర్యలు ప్రారంభించారు. అక్టోబరు 27 నుంచి కొత్త నిబంధనలను అమలుచేస్తున్నారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 362 మందిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. వారి నుంచి రూ.27.81 లక్షల జరిమానాతో పాటు 28 మందికి జైలు శిక్ష విధించారు.
డ్రంకన్ డ్రైవ్ టెస్టుల్లో వచ్చిన పాయింట్లను బట్టి కొందరికి జరిమానాతో పాటు 2 నుంచి 5 రోజుల వరకు జైలు శిక్షను విధిస్తున్నారు. గతంలో డ్రంకన్ డ్రైవ్ టెస్టుల్లో పట్టుబడితే కోర్టులో రూ.వెయ్యి జరిమానా చెల్లించి బయటపడేవారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
మందుబాబులపై కొరడా
మోటార్ యాక్ట్ ప్రకారం డ్రంకన్ డ్రైవ్‌లో మొదటిసారి పట్టుబడి, ఆల్కహాల్ లిమిట్ 30 ఎంజీ కంటే ఎక్కువగా ఉంటే రూ.10 వేల జరిమానా, 6 నెలల జైలు శిక్ష, లైసెన్స్ సస్పెన్షన్ ఉంటుంది. రెండోసారి దొరికితే రూ.15 వేల జరిమానా, రెండేళ్లు జైలు, శాశ్వతంగా లైసెన్స్ రద్దుతో పాటు వాహనం సీజ్ చేస్తారు. మోతాదుకు మించి తాగి డ్రంకన్ డ్రైవ్ లో దొరికితే కోర్టుకు పంపి నిబంధనల ప్రకారం జరిమానా, జైలు శిక్ష రెండింటినీ విధిస్తున్నారు. డ్రంకన్ డ్రైవ్ టెస్టులో పాయింట్లను బట్టి శిక్షలు విధిస్తున్నారు.
ఓ వైపు అవగాహన.. మరోవైపు కఠిన నిబంధనలు..
మీ భద్రత -మా బాధ్యత, ఎల్లవేళలా మీ సేవలో అనే నినాదంతో సిద్దిపేట పోలీసులు కఠిన నిబంధనలను అమలుచేస్తున్నారు. తాగి వాహనాలు నడపొద్దని ప్రజలకు అవగాహన కల్పిస్తూనే మరోవైపు చట్టం ప్రకారం కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. తాగి వాహనాలు నడిపి భారీ జరిమానాలు చెల్లించకుండా చూసుకోవాలని ముందస్తుగా హెచ్చరిస్తున్నారు. ట్రాఫిక్, సివిల్ పోలీసులు మందుబాబులకు ఆయా పీఎస్‌లలో అవగాహన కల్పించి, రోడ్డు ప్రమాదాలకు కారణం కావద్దని చెబుతున్నారు.
పగలు, రాత్రి డ్రంకన్ డ్రైవ్ టెస్టులు
జిల్లాలోని వివిధ రోడ్లపై పోలీసులు రాత్రి పగలు తేడా లేకుండా డ్రంకన్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. గతంలో సాయంత్రం 4 గంటల నుంచి అర్థరాత్రి వరకు ఈ టెస్టులను నిర్వహించే వారు. బార్లు, వైన్స్ సమీపంలో, ముఖ్య కూడళ్లలో మాత్రమే డ్రంకన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించేవారు. ప్రస్తుతం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ప్రధాన మార్గాలతో పాటు, మండల కేంద్రాలకు వెళ్లే రోడ్లపై సైతం తనిఖీలు నిర్వహిస్తున్నారు. సిద్దిపేట జిల్లా మీదుగా దాదాపు 85 కిలో మీటర్లు సాగే రాజీవ్ రహదారిపై ప్రధానంగా దృష్టి పెట్టారు. వారాంతాల్లో సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో విస్తృతంగా డ్రంకన్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు.
ప్రమాదాల నివారణ కోసమే..
రోడ్డు ప్రమాదాల నివారణ కోసం నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నాం. తాగి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలకు గురై అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. వాహనదారులందరూ ఈ నిబంధనలను పాటించి తమ బాధ్యతను గుర్తించాలి. ట్రాఫిక్ పోలీసులు రోజువారీగా, స్పెషల్ డ్రైవ్‌ల ద్వారా డ్రంకన్‌డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎవరైనా ఈ నియమాలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. - సీపీ విజయ కుమార్, సిద్దిపేట
