- రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్లకు పెరిగిన అంచనా వ్యయం
- ఇప్పటికే రూ.20 కోట్ల విరాళాలు సేకరణ
- మరో రూ.10 కోట్లు సేకరించేందుకు టీటీడీ నిర్ణయం
- టెండర్లు ఖరారైతే పనులు ప్రారంభించే అవకాశం
కరీంనగర్, వెలుగు: రెండున్నరేళ్లుగా పెండింగ్ లో ఉన్న కరీంనగర్ టీటీడీ టెంపుల్ నిర్మాణంలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. నగరంలోని పద్మనగర్ లో రూ.3 కోట్లతో మినీ తిరుమలగా ప్రసిద్ధి చెందేలా శ్రీపద్మావతి, శ్రీఆండాళ్ సహిత శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని జమ్మూ, కన్యాకుమారి, వైజాగ్ టీటీడీ ఆలయాల నమూనాలో నిర్మించాలని టీటీడీ పాలకవర్గం ఇటీవల నిర్ణయించింది. ఇందుకోసం గతంలోనే రూ.20 కోట్ల విరాళాలు సేకరించినప్పటికీ..
పెరిగిన నిర్మాణ ధరలు, అదనపు హంగుల కోసం మరో రూ.10 కోట్లు అవసరమవుతుందని తాజాగా అంచనా వేసింది. ఈ మొత్తాన్ని దాతల నుంచి సేకరించాలని, లేదంటే శ్రీవాణి ట్రస్ట్ ఫండ్స్ నుంచి ఖర్చు చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. టెండర్లు ఖరారైతే పనులు ప్రారంభించే అవకాశం ఉంది.
మూడున్నరేళ్ల క్రితమే నిర్ణయం..
తిరుమల, తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యంలో కరీంనగర్ లో శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని 2022 ఏప్రిల్ 30న తొలిసారిగా బోర్డు తీర్మానం చేసింది. దీంతో అప్పటి ప్రభుత్వం కొత్తపల్లి రెవెన్యూ పరిధిలోని చింతకుంట(పద్మనగర్ )లో ఆలయ నిర్మాణానికి 10 ఎకరాలు కేటాయించింది. ఆ తర్వాత 2022 నవంబర్ 30న సమావేశమైన బోర్డు వైజాగ్, జమ్మూ, కన్యాకుమారి వంటి టీటీడీ ఆలయాల నమూనాలో ఉండాలని, నిర్మాణానికి అవసరమైన నిధులను శ్రీవాణి ట్రస్ట్ నుంచి ఖర్చు చేయాలని, అలాగే హైదరాబాద్ లోకల్ అడ్వైజరీ కమిటీ(ఎల్ఏసీ) అధ్యక్షుడు జీవీ.భాస్కర్రావు, బోర్డు మాజీ సభ్యుడు డి.దామోదర్ రావు ద్వారా స్వచ్ఛంద విరాళాలు కూడా స్వీకరించాలని నిర్ణయించింది.
2023 ఫిబ్రవరిలో మొదట రూ.20 కోట్ల అంచనాతో ఆలయ నిర్మాణ ప్రణాళిక సిద్ధం చేశారు. అదే ఏడాది మే 30న అప్పటి మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, అప్పటి టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో భూమిపూజ చేశారు. నవంబర్ లో ఆలయ నిర్మాణ పనులను నటరాజన్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థకు అప్పగించినప్పటికీ పనులు ప్రారంభించలేదు. దాతల నుంచి సరైన స్పందన లేకపోవడం తదితర కారణాలతో ఆ సంస్థ తన కాంట్రాక్ట్ ను రద్దు చేసుకోవడంతో ఆలయ నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆలయ పనులను చేపట్టాలని కోరుతూ ఏప్రిల్ 5న టీటీడీ చైర్మన్ బీఆర్.నాయుడుకు లేఖ రాశారు.
రెండు దశల్లో పనులు..
పెరిగిన ధరలకు అనుగుణంగా ఆలయ నిర్మాణ వ్యయం రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్లకు పెరిగింది. మొదటి దశలో రూ.20 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇందులో రూ.17 కోట్లతో ప్రధాన ఆలయంలో భాగంగా గర్భగుడి, అర్ధ మండపం, మహామండపం, ముఖ మండపం, గరుడాలయం, ధ్వజస్తంభం, బలిపీఠం, రెండు ఉప ఆలయాలు(శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ ఆండాళ్ అమ్మవారు), శ్రీవారి పోటు, స్టోర్, కార్యాలయం, ప్రాకారం, ఐదంతస్తుల రాజగోపురం నిర్మించనున్నారు.
రూ.2 కోట్లతో విద్యుత్ పనులు, యార్డ్ లైటింగ్, ట్రాన్స్ ఫార్మర్, రూ.50 లక్షలతో టాయిలెట్ బ్లాక్, రూ.50 లక్షలతో వాటర్ సప్లై, డ్రైనేజీ, క్యూలైన్, ప్రసాదం కౌంటర్ తదితర పనులు చేపట్టనున్నారు. రెండో దశలో రూ.3 కోట్లతో నాలుగు మాడవీధులు, రోడ్లు, రూ.3 కోట్లతో అర్చకులు, సిబ్బంది రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లు, మరో రూ.3 కోట్లతో కాంపౌండ్ వాల్, ఎత్తు, వంపులను మట్టితో నింపడం, రూ.60 లక్షలతో ఆర్చ్ నిర్మాణం, రూ.40 లక్షలతో ఎల్ఈడీ శంకు, చక్రం, నామాలు ఏర్పాటు చేయనున్నారు.
