ఊరంతా కోడికూరే!.. పంట పొలాల్లో వెయ్యికి పైగా.. నాటుకోళ్లను వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తులు

ఊరంతా కోడికూరే!.. పంట పొలాల్లో వెయ్యికి పైగా.. నాటుకోళ్లను వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తులు
  • పట్టుకునేందుకు ఎగబడిన జనం
  • ఒక్కొక్కరు 2–10 కోళ్లను పట్టుకెళ్లిన్రు
  • హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఘటన

ఎల్కతుర్తి, వెలుగు: హనుమకొండ జిల్లాలో ఆసక్తికర ఘటన జరిగింది. ఎల్కతుర్తి మండల కేంద్రంలో గుర్తు తెలియని వ్యక్తులు వెయ్యికి పైగా నాటుకోళ్లను వదిలేసి వెళ్లగా..  వాటిని దక్కించుకునేందుకు జనాలు పరుగులు తీశారు.  శనివారం తెల్లవారుజామున ఎల్కతుర్తి-సిద్దిపేట నేషనల్ హైవే పక్కన అల్లి సతీశ్‌‌ అనే రైతు పొలం వద్ద  సుమారు వెయ్యికి పైగా నాటుకోళ్లను (ఫాంలో పెంచేవి) వదిలేసి వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న వివిధ గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కోళ్లను పట్టుకునేందుకు ఎగబడ్డారు.

 కొందరు సంచుల్లో నింపుకొని వెళ్లారు. మరికొందరు చేతులతో పట్టుకెళ్లారు. ఒక్కొక్కరు 2–10 కోళ్లను  ఇండ్లకు తీసుకెళ్లారు.  ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు అక్కడ జాతర వాతావరణం కనిపించింది.  ఎవరు వదిలి వెళ్లారో అంతుచిక్కడం లేదు..

విషయం తెలుసుకున్న తహసీల్దార్ ప్రసాదరావు, ఎల్కతుర్తి సీఐ పులి రమేశ్‌‌, ఎస్‌‌ఐ ప్రవీణ్ కుమార్ అక్కడికి చేరుకొని, పరిశీలించారు . కోళ్లకు ఏదైనా ఇన్ఫెక్షన్  సోకడంతో  ఫామ్ నిర్వాహకులు ఇలా రోడ్డు పక్కన వదిలేసి వెళ్లారా..?  మరేదైనా కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కోళ్లను పశు వైద్యాధికారి దీపిక పరిశీలించారు. శాంపిల్స్ సేకరించి పరీక్షల కోసం వరంగల్‌‌లోని ల్యాబ్‌‌కు పంపారు. కోళ్లకు ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని దీపిక తెలిపారు. 

ఒక్కో కోడి బరువు సుమారు కేజీ వరకు ఉండగా, బహిరంగ మార్కెట్ లో దాని ధర రూ.400 పలుకుతున్నది. కోళ్ల విలువ రూ.4 లక్షల  వరకు ఉంటుందని, అంత విలువైన కోళ్లను ఎందుకు వదిలేయాల్సి వచ్చిందనేది అంతుచిక్కడం లేదని స్థానికులు తెలిపారు.  ఇదిలా ఉండగా.. ఈ ఘటన సోషల్​ మీడియాలో వైరల్​ కాగా.. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.