ప్రభుత్వ భూముల్లో ఇండ్లున్న పేదలకు రెగ్యులరైజేషన్: 'సీఎస్ శాంతి కుమారి

ప్రభుత్వ భూముల్లో ఇండ్లున్న పేదలకు రెగ్యులరైజేషన్:  'సీఎస్ శాంతి కుమారి

హైదరాబాద్, వెలుగు: కంటి వెలుగు కార్యక్రమం మే నెలాఖరు వరకు ఉంటుందని చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి తెలిపారు. కార్యక్రమంలో లబ్ధిదారులకు డాక్టర్లు రాసిచ్చే ప్రిస్క్రిప్షన్ ఆధారంగా కంటి అద్దాల పంపిణీలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. కంటి వెలుగు, పోడు భూములకు పట్టాలు, ప్రభుత్వ భూముల్లో ఇండ్లు కట్టుకున్న పేదలకు రెగ్యులరైజేషన్, హరితహారం, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ గురువారం బీఆర్కే భవన్​నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎండలు తీవ్రం అవుతున్ననందున కంటి వెలుగు పరీక్ష శిబిరాల వద్ద మంచినీళ్లు, టెంట్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. సర్కార్ భూముల్లో ఇండ్లు కట్టుకున్నవాళ్లలో 58, 59, 76, 118 జీవోల కింద ఎంపికైన లబ్ధిదారులందరికీ రిజిస్ట్రేషన్ లను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంకా అర్బన్ ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న వారి వివరాలను అసెంబ్లీ నియోజక వర్గాలవారీగా సేకరించి వెంటనే ప్రభుత్వానికి పంపాలని సూచించారు. పోడు భూముల పట్టాలకు సంబంధించి జిల్లా స్థాయి కమిటీలో ఆమోదం పొందిన వాటికి పాస్ బుక్ ల తయారీని చేపట్టాలని చెప్పారు. అలాగే హరితహారంలో భాగంగా 2023–24లో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. జిల్లాల్లో పూర్తయిన సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లోకి అన్ని ప్రభుత్వ ఆఫీసులను తరలించే ప్రక్రియను 
కూడా పూర్తి చేయాలన్నారు.