వెంటనే బకాయిలను రిలీజ్ చేయండి

వెంటనే బకాయిలను రిలీజ్ చేయండి

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ శుక్రవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. తమ రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ పైసలు, కేంద్ర స్కీంల కింద ఇవ్వాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు.‘‘ఉపాధిహామీ, పీఎం ఆవాస్ యోజన, గ్రామ సడక్ యోజనకు సంబంధించి బెంగాల్​కు ఇవ్వాల్సిన రూ. 17,996 కోట్ల బకాయిలను వెంటనే రిలీజ్ చేయండి. వీటితో పాటు ఇతర అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు సంబంధించి రాష్ట్రానికి మొత్తం రూ. లక్షా 968 కోట్లు రావాల్సి ఉంది. ఇంతపెద్ద మొత్తంలో బకాయిలు ఉండటం వల్ల ప్రజా సంక్షేమం కష్టతరంగా మారింది” అని పేర్కొంటూ ఆమె ప్రధానికి లెటర్ అందజేశారు.

అయితే, అపొజిషన్ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు జీఎస్టీ బకాయిలను కేంద్రం త్వరగా విడుదల చేయడంలేదని, రాష్ట్రాలకు సుమారు రూ. 27 వేల కోట్ల జీఎస్టీ బకాయిలు ఉన్నాయని కొంతకాలంగా టీఎంసీ నేతలు విమర్శిస్తున్నారు. అలాగే ఇటీవల బెంగాల్ మాజీ మంత్రి పార్థ చటర్జీ ఈడీ కేసులో అరెస్ట్ అయిన నేపథ్యంలోనూ మోడీతో మమత భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. కాగా, మమత నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వచ్చారు. ఈ పర్యటనలో రాష్ట్రపతి ముర్మును కూడా ఆమె కలవనున్నారు. కాంగ్రెసేతర అపొజిషన్ పార్టీల నేతలతో కూడా దీదీ భేటీ కానున్నారు. ఆదివారం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ సమావేశానికీ ఆమె హాజరుకానున్నారు.