మిడ్ మానేరులో 30 లక్షల చేప పిల్లల విడుదల

మిడ్ మానేరులో 30 లక్షల చేప పిల్లల విడుదల

రాష్ట్ర వ్యాప్తంగా 80 కోట్ల చేప పిల్లలు విడుదలే లక్ష్యం: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

రాజన్న సిరిసిల్ల జిల్లా: బోయినపల్లి మండలం మానువాడ  శ్రీ రాజరాజేశ్వర(మిడ్ మానేరు)లో  మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ లు చేప పిల్లలను విడుదల చేశారు. వర్షాలకు వరద ప్రవాహం పెరగడంతో.. చేపల విడుదలకు ఇదే అదునుగా భావించి మత్స్యశాఖ ఆధీనంలో పెంచుతున్న లక్షలాది చేప పిల్లలను తెచ్చి మిడ్ మానేరులోకి విడుదల చేశారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ..  మిడ్ మానేరు నీటిని చూస్తుంటే  సంతోషంగా ఉందన్నారు. ఎవరు ఇన్ని నీళ్లు వస్తాయని ఊహించలేదని.. ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ తో మిడ్ మానేరు, లోయర్ మానేరుకి  నీళ్లు వచ్చాయన్నారు. మిడ్ మానేరు లో 30లక్షల చేప పిల్లలను వేయడం జరిగిందని.. . రాష్ట్ర వ్యాప్తంగా 80కోట్ల చేప పిల్లలు వేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. గతంలో ప్రభుత్వాలు  మత్స్యకారులు అంటే ఆంధ్ర వైపునే ఉన్నట్లు చూసారు..  సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత అణగారిన వర్గాలకు చేయూత ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారని కొనియాడారు. రైతులు.. మత్స్యకారులు అందరినీ ఆదుకునేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడానికి ప్లానింగ్ జరుగుతోందన్నారు. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు కు మంత్రి కేటీఆర్ సారథ్యం వహిస్తున్నారని. ఈనెల 12 న మీటింగ్ లో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు.  దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు తెలంగాణ రాష్ట్రంలో తీసుకువస్తున్నామని.. క్వాలిటీ పరంగా ఎక్కడ రాజీ పడడం లేదన్నారు. ఫ్రీ సీడ్ ఇచ్చేది దేశంలో ఎక్కడా లేదు. ఒక్క తెలంగాణ లోనే ఇస్తున్నామని మంత్రి తలసాని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తో నీళ్లు వచ్చాయి… మహబూబ్ నగర్.. నల్గొండ జిల్లాలకి ఇక్కడి నుండే నీళ్లు పోతున్నాయన్నారు.