
ముంబై: మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల కారణంగా విదర్భ ప్రాంతంలో వరదలు సంభవించాయి. దాంతో నాగపూర్, అమరావతి డివిజన్లలో ఎనిమిది మంది మరణించారు. ఇళ్లు, పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
నాగపూర్, వార్ధా, గోండియా, భండారా, గడ్చిరోలి, చంద్రపూర్ జిల్లాలు వరదలకు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. దీనిపై మహారాష్ట్ర డిజాస్టర్ మేనేజ్ మెంట్ మినిస్టర్ గిరీశ్ మహాజన్ సోమవారం అసెంబ్లీలో మాట్లాడారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక, పునరావాస చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయని వెల్లడించారు.
బాధితులకు తక్షణ సాయం చేరేలా అన్ని పరిపాలనా యంత్రాంగాలు పనిచేస్తున్నాయని చెప్పారు. ఇండ్లు కూలిపోయిన వారికి ఆర్థిక సహాయం ఇప్పటికే పంపిణీ చేశామని వెల్లడించారు. విపత్తు సహాయానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేందుకు కలెక్టర్లకు పూర్తి అధికారాలు ఇచ్చామన్నారు.