- అలీబాబా హోల్డింగ్స్, టెన్షంట్ హోల్డింగ్స్
- కంపెనీల్లా తీర్చిదిద్దడమే టార్గెట్
- ఈ నెల 28 న ఏజీఎం..
- మరో ఐదేళ్లకు చైర్మన్, ఎండీగా ముకేశ్ అంబానీనే
- రిలయన్స్ యాన్యువల్ రిపోర్ట్ వెల్లడి
న్యూఢిల్లీ: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు త్వరలో మార్కెట్‌లో లిస్ట్ అవుతాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. డిజిటల్, రిటైల్ సెగ్మెంట్‌లలో తనకున్న ఆధిపత్యంతో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సెగ్మెంట్‌లో విస్తరించాలని ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాకుండా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్‌గా మరో 5 ఏళ్ల పాటు ముకేశ్ అంబానీనే కొనసాగేందుకు షేర్ హోల్డర్ల అనుమతి కోరింది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌తో షేర్ హోల్డర్ల సంపద మరింత పెరుగుతుందని, కొత్త సంస్థలో భాగం పంచుకునే అవకాశం కలుగుతుందని షేర్ హోల్డర్లకు రాసిన యాన్యువల్ రిపోర్ట్‌లో ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. ఈ నెల 28 న షేరుహోల్డర్ల యాన్యువల్ జనరల్ మీటింగ్‌ను (ఏజీఎం) రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్వహించనుంది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్ల లిస్టింగ్‌కు, ఫ్యూచర్ ప్లాన్స్‌కు సంబంధించి మరిన్ని విషయాలను ఏజీఎంలో బయటకురానున్నాయి.
కాగా, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి కిందటి నెల డీమెర్జ్ అయిన విషయం తెలిసిందే. ఈ సపరేట్ కంపెనీ వాల్యూయేషన్‌ను 20 బిలియన్ డాలర్లుగా లెక్కించారు. కంపెనీ షేర్లు రూ.261.85 దగ్గర మార్కెట్‌లో లిస్టింగ్ కానున్నాయి. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కన్జూమర్లు, మర్చంట్లకు వివిధ ఫైనాన్షియల్ ప్రొడక్ట్‌లను ఆఫర్ చేస్తుంది. టెక్నాలజీ సాయంతో కస్టమర్లకు చేరుకోనుంది. ప్రస్తుతానికి రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు వస్తున్న రెవెన్యూలో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాటా తక్కువగా ఉంది.
కంపెనీ ఫ్యూచర్ ప్లాన్స్‌పై ఎనలిస్టులు చాలా ఆసక్తిగా ఉన్నారు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇప్పటికే అతిపెద్ద అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ బ్లాక్‌రాక్‌తో పార్టనర్‌షిప్ కుదుర్చుకుంది. ఇరు కంపెనీలు 150 మిలియన్ డాలర్ల చొప్పున జాయింట్ వెంచర్ కోసం ఇన్వెస్ట్ చేయనున్నాయి. మ్యూచువల్ ఫండ్‌తో సహా వివిధ ఫైనాన్షియల్ ప్రొడక్ట్‌లను ఆఫర్ చేయనున్నాయి. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అఫోర్డబుల్ ధరలో సులభమైన, ఇన్నోవేటివ్ డిజిటల్ ప్రొడక్ట్‌లను తీసుకొస్తుందని ముకేశ్ అంబానీ యాన్యువల్ రిపోర్ట్‌లో వెల్లడించారు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను అతిపెద్ద ఎన్‌బీఎఫ్‌సీగా మార్చాలని, అలీబాబా గ్రూప్ హోల్డింగ్, టెన్సెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్ వంటి కంపెనీల్లా తీర్చిదిద్దాలని రిలయన్స్ చూస్తోంది.
యాన్యువల్ రిపోర్ట్‌లో ముకేశ్ అంబానీ పేర్కొన్న మరిన్ని అంశాలు..
1. రిస్క్ మేనేజ్‌మెంట్‌ను, ఆర్థిక క్రమశిక్షణను ఫాలో అవుతూనే సరియైన టైమ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫండ్స్ సేకరిస్తుంది. గ్రోత్ ప్లాన్స్‌కు, కొత్త బిజినెస్‌లకు సపోర్ట్‌గా ఈ ఫండ్స్ వాడుతాం.
2. ఈ–కామర్స్, ప్యాకేజింగ్, డ్యూరబుల్స్, ఆటోమొబైల్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్లలో
పాలిమర్‌కు మంచి డిమాండ్ ఉంది. ఆయిల్ టూ కెమికల్ బిజినెస్ నుంచి ఈ ప్రొడక్ట్‌ను తయారు చేస్తున్నాం.
3. గ్లోబల్‌గా ఆర్థిక వ్యవస్థ రికవరీ అవుతుండడంతో ఆయిల్‌కు డిమాండ్ కొనసాగుతుంది. మిడిల్ ఈస్ట్, చైనా, ఆఫ్రికా దేశాల్లో కొత్తగా అందుబాటులోకి వచ్చే రిఫైనర్ల వలన మార్కెట్ బ్యాలెన్స్ అవుతుంది.
4. కంపెనీ తన మొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్‌ను ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేసింది. 20 గిగా వాట్ల సోలార్ కెపాసిటీ చేరుకోవడానికి ప్లాన్స్ ఇప్పటికే ప్రకటించింది.
5. గ్యాస్ రిజర్వ్‌లను పెంచుకోవడానికి రిలయన్స్ ఎక్స్‌ప్లోరేషన్ చేపడుతోంది. డీప్ వాటర్ ఫీల్డ్‌లోని రిజర్వ్‌ల గరిష్ట స్థాయి ప్రొడక్షన్ మొత్తం ఇండియాలో ప్రొడ్యూస్ అవుతున్న గ్యాస్‌లో 30 శాతానికి సమానంగా
ఉంది.
జీతం లేకుండానే..
కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా 2029 వరకు ముకేశ్ అంబానీనే కొనసాగేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ హోల్డర్ల అనుమతి కోరింది. కంపెనీ రూల్స్ ప్రకారం,70 ఏళ్లు దాటిన వారు ఎండీగా పనిచేయాలంటే షేర్ హోల్డర్ల నుంచి స్పెషల్ రిజల్యూషన్ అవసరం. ముకేశ్ అంబానీ వయసు ప్రస్తుతం 66 ఏళ్లు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆయన జీతం ఏం తీసుకోలేదు. వచ్చే ఐదేళ్లకు గానూ శాలరీ ఏం తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు.
కరోనా ముందు వరకు జీతానికి బదులుగా ప్రాఫిట్‌లో కమిషన్ తీసుకుంటూ వచ్చారు.2008-2009 నుంచి 2019-20 వరకు ఆయన రెమ్యూనరేషన్ ఏడాదికి రూ.15 కోట్లకు పరిమితమయ్యింది. కరోనా సంక్షోభం రావడంతో 2020-21 నుంచి శాలరీ, రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదు. బిజినెస్‌లన్నీ తిరిగి సాధారణ స్థాయికి చేరుకునేంత వరకు జీతం తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. అంబానీని మళ్లీ కంపెనీ ఎండీగా ఐదేళ్ల కాలానికి గాను నియమిస్తూ కిందటి నెల 21 న ప్రకటన వచ్చింది.ఆయన ప్రస్తుత కాల పరిమితి 2024 ఏప్రిల్19 తో ముగుస్తుంది.
