రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 2026 ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్ ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. కంపెనీ నికర లాభం (కన్సాలిడేటెడ్) రూ.18,645 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే లాభంలో పెద్దగా మార్పు లేదు. గ్యాస్ ఉత్పత్తి తగ్గడం, రిటైల్ వ్యాపారంలో మందగమనం లాభాలపై ప్రభావం చూపాయి. అయితే ఎనర్జీ, డిజిటల్ వ్యాపారాల్లో మంచి మార్జిన్లు రావడంతో ఆ నష్టాన్ని పూడ్చుకోగలిగింది. రిలయన్స్ ఆపరేషన్స్ ద్వారా వచ్చిన ఆదాయం రూ.2.69 లక్షల కోట్లకు చేరింది. గత ఏడాది అక్టోబర్ డిసెంబర్ మధ్య ఇది రూ.2.43 లక్షల కోట్లుగా ఉండేది. పన్నుకు ముందు లాభం 6.1 శాతం పెరిగి రూ.48,003 కోట్లకు చేరింది.
రిటైల్ లాభం రూ.3,551 కోట్లు
రిటైల్ విభాగం పనితీరు మిశ్రమంగా ఉంది. జీఎస్టీ రేట్ల తగ్గుదల, పండుగ సీజన్ అమ్మకాలు రెండు క్వార్టర్ల మధ్య చీలిపోవడం వంటి కారణాల వల్ల ఆదాయం ఆశించినంతగా పెరగలేదు. ఈ విభాగం ఎబిటా స్వల్పంగా పెరిగింది. లాభం రూ.3,551 కోట్లుగా నమోదైంది. ఈ క్వార్టర్లో కొత్తగా 431 స్టోర్లను ప్రారంభించారు. క్విక్ కామర్స్ విభాగంలో రోజుకు 16 లక్షల ఆర్డర్లు వస్తున్నాయి. ఆయిల్ టు కెమికల్స్ (ఓ2సీ) వ్యాపారంలో ఆదాయం 8.4 శాతం పెరిగింది. ఇంధన మార్జిన్లు బలంగా ఉండటం, ఉత్పత్తి పెరగడం దీనికి కలిసి వచ్చింది. కేజీ బేసిన్ నుంచి ఉత్పత్తి తగ్గడంతో ఆయిల్, గ్యాస్ బిజినెస్ ఎబిటా సుమారు 13 శాతం తగ్గి రూ.4,857 కోట్లకు పడిపోయింది. అక్కడ ఉత్పత్తి దాదాపు 10 శాతం తగ్గింది.
ఓటీటీ దూకుడు
జియోస్టార్, జియోహాట్స్టార్ కూడా మంచి ఫలితాలు సాధించాయి. జియోహాట్స్టార్లో నెలకు సగటున 45 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. కంపెనీ ఫలితాలపై రిలయన్స్ చైర్మన్, ఎండీ అండ్ సీఈఓ ముఖేశ్ అంబానీ స్పందించారు. 2026 ఆర్థిక సంవత్సరం అంతటా వ్యాపారాలు నిలకడగా రాణిస్తున్నాయని తెలిపారు. జియో కస్టమర్ బేస్ విస్తరించిందని, రిటైల్ విభాగం కొత్త బ్రాండ్లను చేర్చుకుందని చెప్పారు. ఏఐ, న్యూ ఎనర్జీ రంగాల్లో రిలయన్స్ కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టబోతోందని, ప్రపంచానికి అవసరమైన పరిష్కారాలను అందిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ నాటికి కంపెనీ నికర అప్పు రూ.1.17 లక్షల కోట్లుగా ఉంది. భవిష్యత్తు అవసరాల కోసం ఈ క్వార్టర్లో రిలయన్స్ రూ.33,826 కోట్ల పెట్టుబడి పెట్టింది.
జియో ఆదాయం 13 శాతం జంప్
డిజిటల్, టెలికాం సేవలు అందించే జియో ప్లాట్ఫామ్స్ ఆదాయం దాదాపు 13 శాతం పెరిగింది. కొత్త వినియోగదారులు చేరడం, ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే ఆదాయం (ఏఆర్పీయూ) పెరగడం ఇందుకు కారణం. జియో లాభం 11.2 శాతం పెరిగి రూ.7,629 కోట్లకు చేరింది. వినియోగదారుల సంఖ్య 51.53 కోట్లకు పెరిగింది. ఏఆర్పీయూ రూ.213.7 కు చేరింది. డేటా వినియోగం కూడా భారీగా పెరిగింది. ఒక్కో యూజర్నెలకు సగటున 40 జీబీ వాడుతున్నాడు.
