జియోకి ఝలక్​ డిసెంబర్​లో కస్టమర్లు తగ్గారు

జియోకి ఝలక్​ డిసెంబర్​లో కస్టమర్లు తగ్గారు

టెలికం మార్కెట్లో దూసుకెళ్తున్న రిలయన్స్​ జియో దూకుడుకి బ్రేక్​ పడింది. కిందటేడాది డిసెంబర్‌‌లో 1.28 కోట్ల మంది సబ్​స్క్రయిబర్లను ఈ కంపెనీ పోగొట్టుకుంది. వీ కూడా కస్టమర్లను పోగొట్టుకోగా, భారతి ఎయిర్​టెల్​మాత్రం కొత్త కస్టమర్లను పోగేసుకుంది. డిసెంబర్​ 2021 డేటాను గురువారం నాడు ట్రాయ్​(టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్​ ఇండియా) రిలీజ్​ చేసింది. డిసెంబర్లో కస్టమర్లు తగ్గిపోవడంతో రిలయన్స్​ జియో మొత్తం కస్టమర్ల సంఖ్య 41.57 కోట్లకు పరిమితమయ్యారు. కిందటేడాది డిసెంబర్లో మరో టెలికం ఆపరేటర్​ వీ కూడా 16.14 లక్షల మంది కస్టమర్లను పోగొట్టుకుంది. దీంతో ఆ కంపెనీ సబ్​స్క్రయిబర్ల సంఖ్య 26.55 కోట్లకు పడిపోయింది. ఇదే నెలలో ఎయిర్​టెల్​ మాత్రం తన కస్టమర్ల సంఖ్యను మరో 4.75 లక్షలు పెంచుకుంది. దీంతో ఆ కంపెనీ మొత్తం కస్టమర్లు 35.57 కోట్లకు పెరిగారు. 

మార్కెట్​వాటాలో ఇంకా టాపే...

ఓవరాల్​ మార్కెట్​ వాటాలో మాత్రం రిలయన్స్​ జియోనే ఇంకా టాప్​లో ఉంది. 2021 డిసెంబర్​ నాటికి ఈ కంపెనీ మార్కెట్​ వాటా 36 శాతం. 30.83 శాతం మార్కెట్​ వాటాతో ఎయిర్​టెల్​ రెండో ప్లేస్​లో ఉండగా, 23 శాతంతో వీ మూడో ప్లేస్​లో నిలిచింది.  డిసెంబర్​ 2021లో రూరల్​ ఏరియాలలో  జియో కస్టమర్లు 17.99 కోట్ల మందికి తగ్గిపోయారు. ఎయిర్​టెల్​ రూరల్​ కస్టమర్ల సంఖ్య 17.01 కోట్లకు, వీ రూరల్​ కస్టమర్ల సంఖ్య 13.43 కోట్లకు పడిపోయింది. ఆసక్తికరమైన పరిణామమేమంటే తక్కువ ఖర్చు పెట్టే కస్టమర్లను రిలయన్స్​ జియో వదిలించుకుంటోందనేది. ఏవరేజ్​ రెవెన్యూ పర్​ యూజర్​ (ఏఆర్​పీయూ) పెంచుకునే దిశలో ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న టెలికం కంపెనీలు అందుకోసం టారిఫ్​లను పెంచుతున్నాయి. దీంతో అంత ఖర్చు పెట్టలేని కస్టమర్లు ఆయా నెట్​వర్క్​లను వీడుతున్నారు.