- మెటాతో కలిసి ఎంటర్ ప్రైజ్ ఏఐ విస్తరణ
- 2025–26 లోనూ ముకేశ్ అంబానీ శాలరీ జీరో
- డివిడెండ్ ఆదాయం మాత్రం రూ.3,996 కోట్లు
- క్లీన్ ఎనర్జీలో పెరిగిన వేగం: రిలయన్స్ యాన్యువల్ రిపోర్ట్
న్యూఢిల్లీ: ఇండియాలో టెలికం సెక్టార్ రూపురేఖలు మార్చిన రిలయన్స్ జియో, గ్లోబల్ బాట పట్టింది. తన 5జీ, వైర్‌లెస్ టెక్నాలజీని, యాప్‌లను ఎగుమతి చేయనుంది. అంతేకాకుండా మెటాతో కలిసి ఎంటర్‌ప్రైజ్ ఏఐలో వేగం పెంచనుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ విడుదల చేసిన 2025–-26 యాన్యువల్ రిపోర్ట్ వివరాలు ఇలా ఉన్నాయి.
1) గ్లోబల్ మార్కెట్లోకి జియో టెక్నాలజీ
ఇండియా టెలికం అవసరాలను తీర్చేందుకు అభివృద్ధి చేసిన టెక్నాలజీని విదేశాలకు ఎగుమతి చేయాలని జియో నిర్ణయించింది. అంతర్జాతీయ మార్కెట్లలోని స్థానిక టెలికం ఆపరేటర్లతో భాగస్వామ్యం కుదుర్చుకుని, తన సొంత 5జీ, ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ (ఎఫ్‌డబ్ల్యూఏ) టెక్నాలజీ స్టాక్‌ను అందించేందుకు సిద్ధమవుతోంది.
ఇందులో భాగంగా క్లౌడ్-నేటివ్ రేడియో యాక్సెస్ నెట్‌వర్క్ (ఆర్‌ఏఎన్) సిస్టమ్స్, 5జీ కోర్ ప్లాట్‌ఫారమ్‌లు, ఆపరేషన్స్ సపోర్ట్ సిస్టమ్ (ఓఎస్‌ఎస్) , జియో భారత్ పరికరాలు, జియోటీవీ+ వంటి డిజిటల్ అప్లికేషన్లను 'మేనేజ్డ్ సర్వీసెస్ ప్రొవైడర్'గా ఎగుమతి చేయనుంది.
2) చిన్న పరిశ్రమల కోసం ఏఐ
ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీ 'మెటా'తో కలిసి ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ "రిలయన్స్ ఎంటర్‌ప్రైజ్ ఇంటెలిజెన్స్ లిమిటెడ్" (ఆర్‌ఈఐఎల్) ద్వారా ఏఐ రంగంలో రిలయన్స్ విస్తరిస్తోంది. మెటా ఓపెన్- సోర్స్ 'లామా' ఏఐ మోడల్స్, రిలయన్స్ బిజినెస్ ఎకోసిస్టమ్‌ను ఉపయోగించి భారతీయ కంపెనీలు, చిన్న-, మధ్యతరహా పరిశ్రమల కోసం ప్రత్యేకమైన వర్టికల్ ఏఐ అప్లికేషన్లను ఈ వెంచర్ అభివృద్ధి చేయనుంది.
3) డేటా సెంటర్ల కోసం రూ.10 లక్షల కోట్లు
భారతదేశంలో ఏఐ సేవల మౌలిక సదుపాయాల కోసం మల్టీ- గిగావాట్ సామర్థ్యం గల ఏఐ- రెడీ డేటా సెంటర్లను నిర్మించడానికి రిలయన్స్ రూ.10 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. దీనివల్ల ఏఐ అడాప్షన్ ఖర్చులు తగ్గి వ్యవసాయం, విద్య, వినియోగదారుల సేవల్లో ఏఐ వినియోగం పెరుగుతుందని కంపెనీ తెలిపింది.
"భారతదేశంలోనే డిజైన్ చేసిన ఏఐ సేవలు ప్రతి భారతీయుడికి అందుబాటులోకి రావడమే 'రిలయన్స్ ఇంటెలిజెన్స్ ముఖ్య లక్ష్యం" అని చైర్మన్ ముకేశ్ అంబానీ వాటాదారులకు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 52.4 కోట్లకు (524 మిలియన్లకు) పైగా సబ్‌స్క్రయిబర్ బేస్ ఈ ఏఐ విస్తరణకు ఎంతగానో తోడ్పడనుందని అన్నారు.
4) తండ్రి జీతం నిల్.. కొడుకు జీతం రూ.12 కోట్లు
ముకేశ్ అంబానీ వరుసగా ఆరో ఏడాది (2020–21 నుంచి -2025–26 వరకు) కంపెనీ నుంచి ఎలాంటి జీతం, అలవెన్సులు లేదా కమీషన్లు తీసుకోలేదు. కరోనా సంక్షోభం కారణంగా 2020 జూన్ నుంచి ఆయన తన వేతనాన్ని పూర్తిగా వదులుకున్నారు. కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.95,754 కోట్ల రికార్డు లాభాన్ని సాధించినప్పటికీ ఆయన ఈ నిర్ణయానికే కట్టుబడ్డారు. ప్రస్తుతం డివిడెండ్ ఆదాయమే ఆయన ప్రధాన వనరు. కాగా, 2025–26 కి గాను షేరుకి రూ.6 ఫైనల్ డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది.
దీనికి జూన్5 రికార్డ్ డేట్. దీంతో సొంతంగా, ప్రమోటర్ గ్రూప్ షేర్ల ద్వారా ముకేశ్ అంబానీకి దాదాపు రూ.3,996 కోట్ల డివిడెండ్ లభించనుంది. ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఈ ఏడాది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా రూ.12.17 కోట్ల జీతం అందుకున్నారు. రిలయన్స్ యాన్యువల్ జనరల్ మీటింగ్ (ఏజీఎం) జూన్ 19న జరుగుతుంది.
5) రిలయన్స్ న్యూ ఎనర్జీ ప్రాజెక్ట్
రిలయన్స్ గుజరాత్‌లోని జామ్‌నగర్ గ్రీన్ ఎనర్జీ కాంప్లెక్స్ నుంచి 200 మెగావాట్-పీక్ (ఎండబ్ల్యూపీ) సామర్థ్యం గల తొలి సోలార్ మాడ్యూళ్ల బ్యాచ్‌ను డెలివరీ చేసింది. దీనిని ఏటా 10 గిగావాట్లకు (జీడబ్ల్యూపీ) పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (ఎల్‌ఎఫ్‌పీ) ఆధారిత బ్యాటరీ ఫ్యాక్టరీ కమిషనింగ్ పనులు ముగింపు దశకు వచ్చాయి.
గ్రీన్ హైడ్రోజన్ కోసం 'నెల్ ఏఎస్ఏ' సంస్థతో సాంకేతిక ఒప్పందం కుదుర్చుకుంది. ఎలక్ట్రోలైజర్ గిగా ఫ్యాక్టరీపై పనిచేస్తోంది. బయో-ఎనర్జీ విభాగంలో రిలయన్స్ రోజుకు 270 టన్నుల కంప్రెస్డ్ బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేస్తూ, దేశీయ ఔట్‌పుట్‌లో 30శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉంది. ఈ క్లీన్ ఎనర్జీ బిజినెస్ కోసం సంస్థ సుమారు రూ.75 వేల కోట్లు కేటాయించింది.
