రిలయన్స్​ లాభం రూ.19,641కోట్లు.. వార్షికంగా 11 శాతం పెరుగుదల

రిలయన్స్​ లాభం రూ.19,641కోట్లు.. వార్షికంగా 11 శాతం పెరుగుదల
  • ఆదాయం రూ.2,48,160 కోట్లు

ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌‌ఐఎల్)  డిసెంబర్​తో ముగిసిన మూడో క్వార్టర్​లో  నికర లాభం ఏడాది ప్రాతిపదికన 11 శాతం పెరిగి రూ.19,641 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది మూడో క్వార్టర్​లో రూ. 17,706 కోట్ల లాభం వచ్చింది. స్థూల ఆదాయం 3.2 శాతం పెరిగి రూ.2,40,532 కోట్ల నుంచి రూ.2,48,160 కోట్లకు చేరుకుంది.   ఇబిటా 16.7 శాతం వృద్ధితో రూ. 44,678 కోట్లకు చేరుకుంది. ఇబిటా మార్జిన్ 18 శాతంతో 210 బేసిస్ పాయింట్లు పెరిగింది. మెయింటనెన్స్​, ఇన్​స్పెక్షన్​షట్‌‌డౌన్ కారణంగా ఓటూసీ ఇబిటా బలహీనంగా ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. జియో ప్లాట్​ఫారమ్స్​ లిమిటెడ్​ ( జేపీఎల్) ఆదాయం వార్షికంగా 11.4 శాతం పెరిగింది. మొబిలిటీ,  హోమ్‌‌ సెగ్మెంట్​ కస్టమర్లు బాగా పెరగడం, ఏఆర్​పీయూ అధికమవడం ఇందుకు కారణం. రిలయన్స్ రిటైల్ ఆదాయం వార్షికంగా 22.8 శాతం పెరిగింది.  ఆయిల్ టూ కెమికల్స్​(ఓటూసీ) ఆదాయం 2.4 శాతం క్షీణించింది.  ప్రధానంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలలో 5.3 శాతం తగ్గుదల కారణంగా ఇలా జరిగింది. ఆయిల్, గ్యాస్ సెగ్మెంట్ నుంచి వచ్చే ఆదాయం గణనీయంగా పెరిగింది. ప్రధానంగా కేజీ డి6 ఫీల్డ్ నుంచి తక్కువ గ్యాస్ ధర రియలైజేషన్, ఎక్కువ వాల్యూమ్‌‌ల కారణంగా ఇది అధికమయింది. అధిక రాబడి,  మార్జిన్‌‌ల పెరుగుదలతో జేపీఎల్​ ఇబిటా వార్షికంగా 11.5 శాతం ఎగిసింది.  రిలయన్స్ రిటైల్ పండుగ సీజన్ మధ్య రికార్డు స్థాయిలో ఎబిటాలో 31.1 శాతం పెరుగుదల సాధించింది. ఇబిటా మార్జిన్ 50 బేసిస్ పాయింట్లు మెరుగుపడి 8.4 శాతానికి చేరుకుంది.  జియో భారతదేశంలో 5జీ సేవలను అత్యంత వేగంగా పూర్తి చేయడంతో విజయం సాధించిందని కంపెనీ సీఎండీ ముఖేష్ అంబానీ తెలిపారు. జియో భారత్​ ఫోన్​, జియో ఎయిర్​ ఫైబర్ ​విస్తరణ వల్ల కస్టమర్ల సంఖ్య బాగా పెరిగిందని అన్నారు.  ఆయిల్, గ్యాస్ సెగ్మెంట్ అత్యధిక క్వార్టర్లీ ఇబిటాను పోస్ట్ చేసింది. కేజీ డీ6 ఇప్పుడు భారతదేశ గ్యాస్ ఉత్పత్తిలో 30 శాతం అందిస్తోంది.  న్యూ ఎనర్జీ గిగా కాంప్లెక్స్ 2024 జూన్​ తరువాత ప్రారంభమవుతుందని అంబానీ వెల్లడించారు. బీఎస్​ఈలో ఆర్‌‌ఐఎల్ స్క్రిప్ శుక్రవారం దాదాపు ఫ్లాట్‌‌గా రూ.2,736.45 వద్ద ట్రేడింగ్ ముగిసింది.

జియోకు పెరిగిన కస్టమర్లు

రిలయన్స్ జియో యావరేజ్​ రెవెన్యూ పర్ ​యూజర్​ (ఏఆర్​పీయూ) రూ. 181.70లకు చేరింది. రెండో క్వార్టర్​లో దీనికి 45.97 కోట్ల మంది కస్టమర్లు ఉండగా, తాజా క్వార్టర్​లో ఈ సంఖ్య 47.09 కోట్లకు పెరిగింది. ఇదిలా ఉండగా, ప్రధానంగా అమెరికా,  ఆసియా దేశాల నుంచి అధిక డిమాండ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు డిమాండ్ 1.7 మిలియన్ బ్యారెల్స్ పెరిగి రోజుకు 102 మిలియన్ బ్యారెళ్లకు చేరుకుందని రిలయన్స్​ తెలిపింది. జెట్/కీరో  గ్యాసోలిన్ డిమాండ్ వృద్ధిని సంవత్సరానికి మిలియన్ బ్యారెల్స్​కు చేరింది.  డీజిల్ డిమాండ్ రోజుకు 0.2 మిలియన్ బ్యారెల్స్ తగ్గింది.