నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ డ్రామా చిత్రం ‘అఖండ 2: తాండవం’ విడుదలకు ముందే కోర్టు వివాదాలతో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన టికెట్ ధరల పెంపు ప్రీమియర్ షోల నిర్వహణపై న్యాయస్థానంలో తీవ్ర పోరాటం నడుస్తోంది. లేటెస్ట్ గా ఈ విషయంలో చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ కు తెలంగాణ హైకోర్టులో తాత్కాలికంగా ఊరట లభించింది.
న్యాయ పోరాటం..
‘అఖండ 2: తాండవం’ సినిమా విడుదల సందర్భంగా.. తెలంగాణ రాష్ట్రంలో టికెట్ ధరలను పెంచుకునేందుకు, అలాగే ముందస్తు ప్రీమియర్ షోలను నిర్వహించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ గురువారం హైకోర్టు సింగిల్ బెంచ్‌లో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించిన సింగిల్ బెంచ్ జడ్జి... సినిమాకు పెంచిన టికెట్ ధరలను వెంటనే రద్దు చేయాలని, అలాగే అదనంగా వేయాలనుకున్న ప్రీమియర్ షోలను కూడా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేయడం సినీ వర్గాలను, అభిమానులను ఒక్కసారిగా నిరాశకు గురి చేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఈ ఉత్తర్వులు ‘అఖండ 2’ టీమ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
డివిజన్ బెంచ్‌లో ఊరట..
దీంతో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ వెంటనే హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ అప్పీల్ దాఖలు చేసింది. నిర్మాత పక్షం వాదనలు విన్న డివిజన్ బెంచ్, సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై కీలక నిర్ణయం తీసుకుంది.
డివిజన్ బెంచ్, సింగిల్ బెంచ్ ఆదేశాలపై తాత్కాలిక స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్టే ఈ నెల 14వ తేదీ వరకూ అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. డివిజన్ బెంచ్ ఇచ్చిన ఈ తీర్పుతో బాలకృష్ణ ఫ్యాన్స్ కు, ‘అఖండ 2’ టీమ్ తాత్కాలికంగా ఉపశమనం లభించినట్లైంది. ఈ స్టే కారణంగా, చిత్ర బృందం టికెట్ ధరల పెంపుతో పాటు, ప్రీమియర్ షోల నిర్వహణ విషయంలో ప్రస్తుతానికి వెసులుబాటు లభించినట్లయింది. తుది తీర్పు 15వ తేదీన వెలువడనుంది.

