
న్యూఢిల్లీ: భారీ కంపెనీల ఐపీఓలపై సెబీ కొత్త ప్రతిపాదనలు చేసింది. ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం, పెద్ద కంపెనీలు ఐపీఓ సమయంలో ఎక్కువ వాటాను పబ్లిక్‌కు కేటాయించాల్సి వచ్చేది. దీంతో సప్లయ్ పెరిగి, షేర్ల ధరలపై ఒత్తిడి పెరుగుతోంది. తాజాగా ఐపీఓ పరిమాణాన్ని తగ్గిస్తూ, పబ్లిక్ షేర్ హోల్డింగ్ రూల్స్‌ను ఫాలో అయ్యేలా ప్రతిపాదనలు చేసింది.
రూ.50 వేల కోట్లు–రూ.1 లక్ష కోట్ల మార్కెట్ విలువ ఉన్న కంపెనీలు కనీసం రూ.1,000 కోట్ల ఐపీఓతో 8శాతం వాటాను పబ్లిక్‌కు అమ్మాలి. 5 సంవత్సరాల్లో మినిమమ్ పబ్లిక్ షేర్‌హోల్డింగ్ (ఎంపీఎస్) 25శాతానికి చేరాలి. రూ.1 లక్ష కోట్లు–రూ.5 లక్ష కోట్ల విలువ ఉన్న కంపెనీలు కనీసం రూ.6,250 కోట్ల ఐపీఓతో 2.75శాతం వాటాను పబ్లిక్‌కు అమ్మాలి.
10 సంవత్సరాల్లో 25శాతం ఎంపీఎస్‌కి చేరాలి. రూ.5 లక్ష కోట్లకు పైగా విలువ ఉన్న కంపెనీలు రూ.15 వేల కోట్ల ఐపీఓతో 1శాతం వాటా పబ్లిక్‌కు అమ్మాలి. ఈ విధానం వల్ల మార్కెట్‌లో షేర్ల అధిక సరఫరా తగ్గి, ధరలపై ఒత్తిడి తగ్గుతుంది. సెబీ సెప్టెంబర్ 8 వరకు ప్రజాభిప్రాయాలను కోరుతోంది.