ఆయిల్ కంపెనీలకు ఊరట.. పెట్రోల్, డీజిల్పై రూ.10 చొప్పున సుంకం తగ్గింపు

ఆయిల్ కంపెనీలకు ఊరట.. పెట్రోల్, డీజిల్పై రూ.10 చొప్పున సుంకం తగ్గింపు
  • భారీగా పెరిగిన క్రూడాయిల్‌‌ ధరలతో ఓఎంసీలకు నష్టాలు
  • ఏటీఎఫ్​, డీజిల్​ ఎగుమతులపై మళ్లీ విండ్‌‌ఫాల్ ట్యాక్స్ 
  • పెట్రోల్​ బంకుల్లో ధరలు మారవు


న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌‌పై  ఎక్సైజ్ డ్యూటీని లీటరుకు రూ.10 చొప్పున తగ్గించింది.  యుద్ధం కారణంగా బ్యారెల్ చమురు ధర  70 డాలర్ల నుంచి 110 డాలర్లకు చేరింది. దీంతో హిందుస్థాన్ ​పెట్రోలియం, ఇండియన్​ ఆయిల్​ కార్పొరేషన్​(ఐఓసీ) వంటి ఆయిల్​ మార్కెటింగ్‌‌ ​కంపెనీలకు (ఓఎంసీలు) భారీగా నష్టాలు వస్తున్నాయి. ఈ

 భారంతో పెరగాల్సిన రిటైల్ ధరలను అదుపు చేయడానికి ప్రభుత్వం సుంకాలకు కోత పెట్టింది. పెట్రోల్‌‌పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని రూ.13 నుంచి రూ.మూడుకు, డీజిల్ పై రూ.10 నుంచి సున్నాకు తగ్గించింది. ఈ తగ్గింపు వల్ల పెట్రోల్ ​బంకుల్లో  ధరలేమీ మారవు. కేంద్రం పెట్రోల్ పై  వేసే మొత్తం  సుంకం రూ.11.90 కాగా, డీజిల్‌‌పై రూ.7.80 గా ఉంది.  

ఏటీఎఫ్ పై రూ.29.50 చొప్పున పన్ను

దేశీయంగా ఇంధన సప్లైకి ఇబ్బంది కలగకుండా డీజిల్, ఏవియేషన్ ​టర్బైన్ ​ఫ్యూయల్​(ఏటీఎఫ్) ఎగుమతులపై ప్రభుత్వం మళ్లీ విండ్‌‌ఫాల్‌‌ ట్యాక్స్​ను వేసింది. రిఫైనరీలు అదనపు లాభాల కోసం విదేశాలకు ఇంధనాన్ని తరలించకుండా ఆపటానికి డీజిల్ ఎగుమతిపై లీటరుకు రూ.21.50, విమాన ఇంధనం ఏటీఎఫ్ పై రూ.29.50 చొప్పున పన్ను విధించింది.   ఓఎంసీలు పొరుగు దేశాలైన నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంకకు చేసే ఎగుమతులకు ఈ పన్ను వర్తించదు. ఈ సుంకాలపై ప్రతి పదిహేను రోజులకు ఒకసారి సమీక్ష జరుగుతుంది. 

  • 15 రోజుల్లో రూ.ఏడు వేల కోట్ల నష్టం

ఎక్సైజ్ సుంకం కోత వల్ల ప్రభుత్వానికి 15 రోజుల్లో రూ.ఏడు వేల కోట్ల ఆదాయం తగ్గుతుంది. ఎగుమతి పన్నుల ద్వారా రూ.1,500 కోట్లు సమకూరుతాయి.  పక్షం రోజుల్లో ప్రభుత్వ ఖజానాకు రూ.5,500 కోట్ల నికర నష్టం వాటిల్లుతుందని సీబీఐసీ తెలిపింది. చమురు మార్కెటింగ్ సంస్థలు ఓఎంసీలు ప్రస్తుతం లీటరు పెట్రోల్ పై రూ.26, డీజిల్ పై రూ.30 వరకు నష్టపోతున్నాయి. సుంకాల తగ్గింపు వల్ల ఏడాదికి కేంద్ర ఖజానాపై రూ.1.75 లక్షల కోట్ల ప్రభావం ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఓఎన్​జీసీ వంటి సంస్థలు ఉత్పత్తి చేసే దేశీయ ముడిచమురుపై అదనంగా పన్ను  వేయలేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.  

ఇతర దేశాల్లో ఇంధన ధరలు 20 నుంచి 50 శాతం వరకు పెరిగినా మనదేశంలో అదుపులో ఉంచు తున్నాం. ఎల్పీజీ ఉత్పత్తిని 40 శాతం పెంచి గృహ అవసరాలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. లాక్​డౌన్​ విధిస్తామనే వార్తలు అబద్ధం.  
-కేంద్ర చమురు శాఖ మంత్రి 
హర్దీప్ సింగ్ పూరి

అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరల నుంచి వినియోగదారులకు రక్షణ కల్పించడానికి ఎక్సైజ్ సుంకం తగ్గించాం.  నిత్యావసర వస్తువుల సరఫరాలో తలెత్తే ఇబ్బందుల నుంచి జనాన్ని కాపాడుతాం. డీజిల్​, ఏటీఎఫ్ ​ఎగుమతులపై సుంకాలు వేయడం వల్ల  దేశీయ వినియోగానికి సరిపడా ఇంధనం అందుబాటులో ఉంటుంది.
- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్