
- తుఫాన్ బలహీనపడడంతో కుంభవృష్టి
- రాష్ట్రంలో 25 మంది మృతి.. మిజోరంలో క్వారీ కూలి 14 మంది దుర్మరణం
- క్వారీ రాళ్ల కిందే మరో 67 మంది.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
- స్కూల్ బస్సుపై చెట్టుపడి 12 మంది స్టూడెంట్స్‌కు గాయాలు
- జనజీవనం అతలాకుతలం.. స్తంభించిన రాకపోకలు
న్యూఢిల్లీ: రెమాల్ తుఫాన్ ఈశాన్య రాష్ట్రాలపై తీవ్ర ప్రతాపం చూపుతున్నది. మిజోరం, అస్సాం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనంగా మారి బలహీనపడడంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ ధాటికి మిజోరంలో ఒక్కరోజే 25 మంది చనిపోయారు. ఐజ్వాల్ జిల్లాలో ఓ క్వారీ కుప్పకూలింది. ఈ ఘటనలో 14 మంది మృతిచెందగా, 67 మంది ఆ రాళ్లకిందే చిక్కుకుపోయారు.మృతుల్లో నాలుగేండ్ల బాలుడు, ఆరేండ్ల చిన్నారి ఉన్నారు.
అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, భారీ వర్షాల వల్ల రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకం కలుగుతోదంని డీజీపీ అనిల్ శుక్లా తెలిపారు. అస్సాంలోని మోరిగావ్ జిల్లాలోని దిఘల్‌బోరి వద్ద ఆటో రిక్షాపై చెట్టు పడిపోవడంతో కాలేజీ స్టూడెంట్ మృతి చెందాడు. లఖీంపూర్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి పుతుల్ గొగోయ్ అనే వ్యక్తి మరణించాడు. సోనిపట్ జిల్లాలో స్కూల్ బస్సుపై చెట్టు విరిగిపడడంతో 12 మంది విద్యార్థులు,వేర్వేరు ఘటనల్లో మరో ఐదుగురు గాయపడ్డారు.
అస్సాంలో దంచికొడుతున్న వానలు
అస్సాంలోని గువహటితోపాటు పలుచోట్ల వానలు దంచి కొడుతున్నాయి. ఈదురుగాలులకు కరెంట్ స్తంభాలు పడిపోయి, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పురాతన ఇండ్లల్లో ఉండొద్దని, నీరు నిలిచిన చోటికి వెళ్లొద్దని, అత్యవసర వస్తువులను ఇంట్లో ఉంచుకోవాలని అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్అథారిటీ ప్రజలకు సూచించింది. అత్యవసర పరిస్థితి ఏర్పడితే అధికారులను సంప్రదించాలని పేర్కొంది.
అత్యవసరమైతే తప్ప ఇండ్లలోనుంచి బయటకు రావొద్దని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ ప్రజలను కోరారు. రెమాల్ తుఫాన్ ఆదివారం రాత్రి బంగ్లాదేశ్, బెంగాల్ సరిహద్దుల్లో తీరం దాటగా, ఆ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. అస్సాం, మిజోరంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.
స్తంభించిన జనజీవనం
భారీ వర్షాలతో రెండు రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించింది. రహదారులపై కొండచరియలు విరిగిపడడంతో రాకపోకలు నిలిచిపోయాయి. హంటర్ వద్ద నేషనల్ హైవే 6 పై రాళ్లుపడడంతో ఐజ్వాల్‌కు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. రెండు రాష్ట్రాల్లో స్కూళ్లు మూసేసి, ఉద్యోగుల కు వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చారు. మిజోరం సీఎం లాల్ దుహోమా అధికారుల తో అత్యవసర భేటీ ఏర్పాటు చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలన్నారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. రెస్క్యూ ఆపరేషన్‌కు రూ.15 కోట్లు కేటాయించారు.