జగిత్యాల కోర్టు ఆవరణ నుంచి రిమాండ్ ఖైదీ పరారు

 జగిత్యాల కోర్టు ఆవరణ నుంచి రిమాండ్ ఖైదీ పరారు

రిమాండ్ ఖైదీ కోర్టు ఆవరణ నుంచి పరారైన ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. జగిత్యాల సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పెగడపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన జున్ను ప్రసాద్ పై కొడిమ్యాల పీఎస్ లో మరో కేసు నమోదయ్యింది. ఈ కేసు విషయంలో పిటీ వారెంట్ తో జున్ను ప్రసాద్ ను జగిత్యాల కోర్టులో హాజరు పరిచిన తర్వాత పోలీసుల కళ్లు గప్పి పరారయ్యాడు.

జడ్జి ముందు నిందితుడిని ప్రవేశపెట్టిన తర్వాత.. కేసు డీటెయిల్స్ ను పరిశీలించిన మెజిస్ట్రేట్ నిందితుడు జున్ను ప్రసాద్ కు రిమాండ్ విధించారు. నిందితుడు ప్రసాద్ కుటుంబ సభ్యులతో కోర్టు ఆవరణలో మాట్లాడుతుండగా కోర్టు కానిస్టేబుల్ సాగర్ రిమాండ్ వారెంట్ తీసుకోవడానికి కోర్టు లోపలికి వెళ్ళాడు. ఇదే అదునుగా భావించిన నిందితుడు కోర్టు కానిస్టేబుల్ సాగర్ కళ్ళుగప్పి పారిపోయాడు. 

పరారీలో ఉన్న నిందితుడు కోసం  పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కస్టడీ నుంచి ఖైదీ తప్పించుకోవడం జిల్లా వ్యాప్తంగా  చర్చనీయాంశంగా మారింది.