ఎన్​సీఈఆర్​టీ 12వ క్లాస్ బుక్ లో.. బాబ్రీ మసీదు పదం తొలగింపు

ఎన్​సీఈఆర్​టీ 12వ క్లాస్ బుక్ లో..  బాబ్రీ మసీదు పదం తొలగింపు
  • అయోధ్య వివాదంపై పాఠంలో పలు మార్పులు
  • 4 పేజీల పాఠం 2 పేజీలకు కుదింపు  

న్యూఢిల్లీ: పన్నెండో తరగతి పొలిటికల్ సైన్స్ కొత్త పాఠ్యపుస్తకంలో అయోధ్య వివాదానికి సంబంధించిన పాఠంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రెయినింగ్(ఎన్​సీఈఆర్​టీ) పలు మార్పులు చేసింది. బాబ్రీ మసీదు పదానికి బదులుగా ‘మూడు డోమ్​ల నిర్మాణం(త్రీ డోమ్డ్ స్ట్రక్చర్)’ అనే పదాన్ని చేర్చింది. అలాగే పాత టెక్స్ట్ బుక్​లో అయోధ్య అంశంపై నాలుగు పేజీల పాఠం ఉండగా.. కొత్త బుక్​లో దానిని రెండు పేజీలకు కుదించింది. ఎల్ కే అద్వానీ చేపట్టిన రథయాత్ర, కరసేవకుల ఉద్యమం, బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత జరిగిన అల్లర్లు, యూపీలో రాష్ట్రపతి పాలన వంటి అంశాలపై వివరణలను కూడా తొలగించింది.

అయోధ్యలో రామ జన్మభూమిగా పేర్కొనే స్థలంలో బాబ్రీ మసీదును 16వ శతాబ్దంలో మీర్ బకీ నిర్మించాడని పాత బుక్ లో పేర్కొన్నారు. అయితే, కొత్త బుక్​లో దీనితోపాటు న్యాయ పోరాటం, మత ఘర్షణలకు సంబంధించిన అంశాల్లో కూడా మార్పులు చేశారు. సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత సుప్రీంకోర్టు 2019లో అన్ని వర్గాల మధ్య రాజీ కుదురుస్తూ సమస్యను పరిష్కరించిందని వివరించారు. అలాగే పాత బుక్​లో బాబ్రీ మసీదు తర్వాత దేశంలో అనేక చోట్ల మత ఘర్షణలు జరిగాయని ఆ ఘటనలను ప్రస్తావించగా.. కొత్త బుక్​లో వాటిని తొలగించారు. 

మత ఘర్షణల నేపథ్యంలో అప్పటి యూపీ సీఎం కల్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన పెట్టిన అంశానికి సంబంధించిన న్యూస్ పేపర్ కటింగ్స్ ఫొటోలను కూడా తీసేశారు. అదేవిధంగా పాత బుక్​లో డెమోక్రటిక్ రైట్స్ అనే చాప్టర్ లో గుజరాత్ అల్లర్ల గురించి ప్రస్తావన ఉండగా.. కొత్త బుక్​లో తొలగించారు. కాగా, ఎన్​సీఈఆర్​టీ పొలిటికల్ సైన్స్ బుక్​ను రివైజ్ చేయడం 2014 నుంచి ఇది నాలుగోసారి. సమకాలీన రాజకీయ పరిణమాలకు అనుగుణంగా పాఠాల్లోని అంశాలను అప్డేట్ చేస్తున్నామని సంస్థ తెలిపింది.  

అల్లర్లపై పాఠాలక్కర్లేదు: డైరెక్టర్​

పన్నెండో క్లాస్ పొలిటికల్ సైన్స్ టెక్స్ట్ బుక్​లో చేసిన మార్పులను ఎన్​సీఈఆర్​టీ డైరెక్టర్ దినేశ్ ప్రసాద్ సక్లానీ సమర్థించుకున్నారు. పిల్లలకు అల్లర్ల గురించి పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఈ మార్పులపై ఆయన పీటీఐ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. కరికులమ్​ను కాషాయీకరణ చేస్తున్నారన్న ఆరోపణలను ఖండించారు. యాన్యువల్ రివిజన్​లో భాగంగానే పాఠ్యాంశాల్లో మార్పులు చేశామన్నారు. ‘‘విద్యార్థులకు అల్లర్ల గురించి ఎందుకు నేర్పించాలి? మనం పాజిటివ్ సిటిజన్స్​ను తయారు చేయాలి కానీ, హింసా ధోరణి పెంచుకునే, డిప్రెషన్​లోకి జారుకునే పౌరులను కాదు” అని ఆయన స్పష్టం చేశారు. పిల్లల్లో ద్వేషం నింపి, వారిని నేరస్తులుగా మార్చడం విద్య ఉద్దేశం కాదన్నారు. వారు  పెద్దయిన తర్వాత వారంతట వారే పూర్తి స్థాయిలో తెలుసుకుంటారని అన్నారు.