Shai Hope: సెంచరీతో వెస్టిండీస్ కెప్టెన్ రికార్డుల వర్షం.. వన్డేల్లో తొలి ప్లేయర్‌గా సరికొత్త చరిత్ర

Shai Hope: సెంచరీతో వెస్టిండీస్ కెప్టెన్ రికార్డుల వర్షం.. వన్డేల్లో తొలి ప్లేయర్‌గా సరికొత్త చరిత్ర

వెస్టిండీస్ బ్యాటర్ షాయ్ హోప్ వన్డేల్లో తన నిలకడను చూపిస్తున్నాడు. కెరీర్ ప్రారంభం నుంచి వన్డే ఫార్మాట్ లో అద్భుతంగా రాణిస్తున్న ఈ విండీస్ కెప్టెన్.. 50 ఓవర్ల ఫార్మాట్ లో 6000 పరుగుల క్లబ్ లో చేరాడు. బుధవారం (నవంబర్ 19) న్యూజిలాండ్ తో ముగిసిన రెండో వన్డేలో సెంచరీతో సత్తా చాటిన హోప్.. ఈ ఘనతను అందుకున్నాడు. కేవలం 142 ఇన్నింగ్స్ ల్లో 6000 పరుగులు చేసి వెస్టిండీస్ తరపున ఫాస్టెస్ట్ 6000 పరుగులు చేసిన రెండో ప్లేయర్ గా నిలిచాడు. వెస్టిండీస్ తరపున సర్ వివ్ రిచర్డ్స్ ఈ లిస్ట్ లో అగ్ర స్థానంలో ఉన్నాడు. 

ఓవరాల్ గా ఫాస్టెస్ట్ 6000 పరుగులు చేసిన ప్లేయర్ గా సౌతాఫ్రికా మాజీ బ్యాటర్ హషీమ్ ఆమ్లా అగ్రస్థానంలో ఉన్నాడు. 123 ఇన్నింగ్స్ ల్లోనే ఆమ్లా ఈ ఘనతను చేరుకోవడం చేరుకొని టాప్ లో ఉన్నాడు. హోప్ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. 19 సెంచరీలతో వెస్టిండీస్ తరపున అత్యధిక సెంచరీలు చేసిన రెండో  ప్లేయర్ గా లెజెండరీ బ్రియాన్ లారాతో సమంగా నిలిచాడు. తొలి స్థానంలో 25 సెంచరీలతో గేల్ ఉన్నాడు. అంతేకాదు ఐసీసీ సభ్యత్వంలో ఉన్న 12 దేశాలపైన సెంచరీ చేసిన తొలి ప్లేయర్ గా నిలిచి చరిత్ర సృష్టించాడు. 

నేపియర్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో హోప్ 69 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సర్లతో 109 పరుగులు చేశాడు. 160 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేయడం మ్యాచ్ కే హైలెట్ గా మారింది. ఈ మ్యాచ్ లో హోప్ సెంచరీ చేసినా వెస్టిండీస్ కు పరాజయం తప్పలేదు. ఆతిధ్య న్యూజి లాండ్ పై 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. వర్షం కారణంగా 34 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. హోప్ ఒక్కడే సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. మిగిలిన వారు విఫలమయ్యారు. లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ 33.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసి గెలిచింది.     

హోప్ వన్డే కెరీర్ విషయానికి వస్తే 147 వన్డేల్లో 142 ఇన్నింగ్స్‌లు ఆడాడు. 50.80 సగటుతో 6,097 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 79.79 గా ఉంది. హోప్ ఖాతాలో 19 సెంచరీలతో పాటు 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో 10 స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది హోప్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. 14 వన్డేల్లో 59.45 యావరేజ్.. 99.09 స్ట్రైక్ రేట్‌తో 659 పరుగులు చేశాడు. వీటిలో రెండు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.