ఆర్టీఏ చెక్​ పోస్టుల ఎత్తివేత?

ఆర్టీఏ చెక్​ పోస్టుల ఎత్తివేత?
  •   అవినీతి, వసూళ్ల దందా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యోచన
  • ప్రత్యేక టీమ్ లేదా పోలీసులతో తనిఖీలకు అధికారుల ప్రతిపాదనలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సరిహద్దుల్లోని ఆర్టీఏ చెక్​పోస్టుల వద్ద వసూళ్ల దందా జరుగుతున్నట్లు వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో వాటిని ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తున్నది. ఈ విషయంపై కొంత కాలంగా ఉన్నతస్థాయిలో చర్చలు జరుగుతున్నట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే వాహనాలు, రవాణా అవుతున్న సరుకుకు సంబంధించిన వేబిల్స్, ఇతర రసీదులను ఆర్టీఏ చెక్​పోస్టుల్లో తనిఖీ చేస్తారు. 

వాహనాల్లో ఏం తరలిస్తున్నారు? వాటికి సరైన బిల్లులు ఉన్నాయా? నిషేధిత పదార్థాలు ఏమైనా రవాణా చేస్తున్నారా? అని ప్రతి వాహనాన్నీ క్షుణ్ణంగా చెక్ చేయాలి. నిబంధనలకు విరుద్ధంగా సరుకు రవాణా చేసే వాహనాలను సీజ్ చేయాలి.

కానీ, చాలాకాలంగా ఆయా చెక్ పోస్టుల్లో పనిచేస్తున్న సిబ్బంది ముడుపులు తీసుకొని తూతూ మంత్రంగా తనిఖీలు చేసి వాహనాలను అనుమతిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న చెక్​పోస్టులను తొలగించాలన్న ప్రతిపాదనపై ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. ఆయా చెక్‌‌పోస్టుల నుంచి వచ్చే మామూళ్లకు అలవాటు పడిన పలువురు ఉద్యోగులు చెక్‌‌పోస్టుల వద్దే తమకు పోస్టింగ్‌‌లు వచ్చేలా లాబీయింగ్ చేస్తున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రాష్ట్రంలో సుమారు 15 చెక్‌‌ పోస్టులు

తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో 15 చెక్​ పోస్టులున్నాయి. నిత్యం ఆయా చెక్‌‌ పోస్టుల ద్వారా వసూళ్ల దందా యథేచ్ఛగా జరుగుతున్నట్టు ఫిర్యాదులు ఉన్నాయి. ఇటీవల ఏసీబీ అధికారులు సైతం పలు చెక్ పోస్టుల్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు చెక్​పోస్టుల వద్ద ఏసీబీ అధికారులే మారువేషంలో వెళ్లి పలువురు అధికారులు, సిబ్బందిని రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

 దీంతో ఈ తనిఖీలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. చెక్​ పోస్టుల వద్ద పనిచేసే ఉద్యోగుల నుంచి అవినీతి సొమ్మును సైతం స్వాధీనం చేసుకున్నారు. ఇలా పలుమార్లు ఏసీబీ అధికారులు పలు చెక్‌‌ పోస్టుల వద్ద దాడులు చేసినా అక్కడ అవినీతి మాత్రం ఆగకపోవడం విమర్శలకు తావిస్తున్నది. అక్కడ వచ్చే అవినీతి సొమ్ముకు అలవాటు పడ్డ కొందరు అధికారులు ఓడీల పేరుతో చెక్‌‌పోస్టుల వద్ద విధులను నిర్వర్తించడానికి ఆసక్తి చూపుతుంటారు. 

రోజు రూ.5 నుంచి రూ.10 లక్షల వసూళ్లు

కొన్ని చెక్​ పోస్టుల్లో ప్రతిరోజు సుమారు రూ.5 నుంచి రూ.10 లక్షల వరకు వసూళ్లు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అందుకే పలువురు ఉద్యోగులు ఆయా చెక్‌‌ పోస్టులను వదిలిపెట్టడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదని తెలుస్తున్నది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే కొందరు తాము కోరుకున్న విధంగా చెక్‌‌ పోస్టుల వద్ద ఓడీ కింద పనిచేయడానికి పైరవీలు చేస్తున్నట్టు సమాచారం. ఇలాంటి అవినీతి దందాను అరికట్టడానికి త్వరలోనే చెక్ ​పోస్టులను ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. దీనిపై ఉన్నతస్థాయిలో చర్చలు కూడా జరుగుతున్నట్టు సమాచారం. చెక్​ పోస్టులను ఎత్తివేసి ఈ తనిఖీలకు ప్ర్యతేకంగా ఒక టీమ్​ను ఏర్పాటు చేయడంతో పాటు, స్థానిక పోలీసలుతో తనిఖీలు నిర్వహించాలన్న ప్రతిపాదన ఉన్నట్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.