స్మృతి ఇరానీ పరువు నష్టం దావా..కాంగ్రెస్ నేతలకు కోర్టు సమన్లు

స్మృతి ఇరానీ పరువు నష్టం దావా..కాంగ్రెస్ నేతలకు కోర్టు సమన్లు

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై కాంగ్రెస్​ నేతలు జైరాం రమేశ్, పవన్​ ఖేరా, నెట్టా డిసౌజాలకు ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. మంత్రి, ఆమె కూతురుపై సోషల్​ మీడియాలో చేసిన ట్వీట్లను తొలగించాలని కాంగ్రెస్​ నేతలను హైకోర్టు ఆదేశించింది. కాంగ్రెస్​ నేతలు 24 గంటల్లోపు తొలగించకపోతే, ట్విటర్, ఫేస్​బుక్, యూట్యూబ్​ చొరవ తీసుకుని వాటిని తొలగించాలని హైకోర్టు పేర్కొంది. స్మృతి కూతురు జోయిష్​ఇరానీ(18) గోవాలో ఇల్లీగల్​గా బార్​ నడుపుతున్నారని కాంగ్రెస్ ​నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో స్మృతిని మంత్రి పదవి నుంచి తొలగించాలని ప్రధానిని వారు డిమాండ్​ చేశారు. దీంతో కాంగ్రెస్​ నేతలపై మంత్రి తీవ్రంగా మండిపడ్డారు.

తనపై, తన కూతురుపై నిరాధార ఆరోపణలు చేశారంటూ వారిపై స్మృతి రూ.2 కోట్లకుపైగా పరువునష్టం దావా వేశారు. వాస్తవాలను ధ్రువీకరించుకోకుండా మంత్రిపైనా, ఆమె కూతురుపైనా కాంగ్రెస్​ నేతలు నిరాధార ​ఆరోపణలు చేశారని హైకోర్టు కూడా పేర్కొంది. ఆ నేతల ఆరోపణలతో మంత్రి పేరు ప్రతిష్టలకు డ్యామేజీ కలిగిందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో తల్లీకూతురుపై చేసిన ఆరోపణలను, మార్ఫింగ్​చేసిన ఫొటోలను అన్ని సోషల్ ​మీడియా ప్లాట్​ఫాంల నుంచి తొలగించాలని కాంగ్రెస్​ నేతలకు హైకోర్టు సూచించింది. కేసు విచారణను వచ్చే నెల 18కు వాయిదా వేసింది.