ఖమ్మం నగరంలోని పురాతన జాఫర్ బావి పునరుద్ధరణ పనులు ముందుకు సాగట్లేదు. గతేడాది ఫిబ్రవరిలో జాఫర్ బావి పునరుద్ధరణ పనులకు ఖమ్మం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో రూ.61.80 లక్షలతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభోత్సవం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న కలెక్టర్లు గౌతమ్, ముజామ్మిల్ ఖాన్ బదిలీపై వెళ్లడం, కాంట్రాక్టర్లు పదేపదే మారడంతో బావి పనులు ముందుకు సాగడం లేదు.
ఇప్పటి వరకు కాంట్రాక్టర్లు బావి పూడిక మాత్రమే తీశారు. ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో మళ్లీ యథావిధిగా పచ్చటి పాకురు చేరి బావి అందహీనంగా కనిపిస్తోంది. పూరాతన బావిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యం నీరుగారిపోతోంది. ఇక్కడ ఏర్పాటు చేసిన 5 సీసీ కెమెరాల్లో నాలుగు పని చేయడం లేదు. దీంతో ఇది స్థానిక మందు బాబులకు అడ్డాగా మారింది. ఇప్పటికైనా అధికారులు పనుల పునరుద్ధరణపై దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. - వెలుగు ఫొటోగ్రాఫర్, ఖమ్మం
