కరోనా ప్రభావం కారణంగా దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్ర ప్రజలకు వ్యక్తిగత శుభ్రత పాటించాలని, వైరస్ లక్షణాలున్న వారికి దూరంగా ఉండాలని, మాస్క్ లు వాడాలని … ఇలా ఎన్నో ఆదేశాలు జారీ చేసింది. మరో వైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్ జనరల్ కూడా వైరస్ ను నియంత్రించేందుకు చేతులు శుభ్రపరుచుకోవాలని సేఫ్ హ్యాండ్స్ అనే సోషల్ మీడియా చాలెంజ్ ను ప్రారంభించాడు.
ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ వైరస్ పై నటి రేణుదేశాయ్ కాస్త భిన్నంగా స్పందించారు. తన ఇన్ స్టాగ్రామ్ లో రీసెంట్ గా ఓ పోస్ట్ పెడుతూ… ఈ 2020 లో ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహయంతో మనుషుల ప్రాణాలను కాపాడొచ్చని, బాక్టీరియా మరియు వైరస్ ని నివారించేందుకు సైన్స్ మెడిసిన్ సృష్టిస్తుందని ఊహించాను, కానీ ఈ పరిణామంలో మనుషులు ఇంకా వెనకబడి పోతున్నారని అభిప్రాయ పడింది.
“మనుషులుగా ఎదిగిన తర్వాత.. చేతులు కడుక్కోవడం మరియు శుభ్రత పాటించడం అనే అంశాలపై సోషల్ మీడియా ద్వారా నేర్పుతున్నప్పుడు నవ్వాలో, ఏడవాలో తెలియడం లేదు. జీవన పరిణామ క్రమంలో మనమంతా వెనకబడిపోతున్నాం. 2020 సంవత్సరం నేను ఊహించిన దానికి భిన్నంగా ఉంది. మనమంతా చిన్నపిల్లల్లా.. చేతులు ఎలా కడుక్కోవాలి, ఎలా తుమ్మాలి, ఎలా దగ్గాలి అనే విషయాలని నేర్చుకుంటున్నాం ”అని ఆమె తన ఇన్‌స్టా లో పోస్ట్ చేశారు.

