
సంగారెడ్డి/నారాయణఖేడ్, వెలుగు : నారాయణఖేడ్ నియోజకవర్గంలోని సిర్గాపూర్ మండలం సుల్తానాబాద్‌లో ఉన్న నల్లవాగు ప్రాజెక్టును ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతమైన ఖేడ్‌కు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు రిపేర్లకు ఆరేళ్ల కిందనే నిధులు మంజూరయ్యాయి. ఏడాది తర్వాత 18 నెలల్లో పూర్తి చేస్తామని అగ్రిమెంట్ చేసుకున్న కాంట్రాక్టర్ కేవలం 30 శాతం పనులు పూర్తి చేసి చేతులెత్తేశారు. పైగా మొత్తం పనులు బిల్లులు తీసుకున్నారని స్థానిక ప్రజా ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. పనులు పెండింగ్‌లో ఉండడంతో రైతులకు సాగునీరు అందించలేకపోతున్నామని వాపోతున్నారు.
2017లో నిధులు మంజూరు
నల్లవాగు ప్రాజెక్టును సుల్తానాబాద్ వద్ద 1965లో నిర్మించారు. దీని కింద 6,500 ఎకరాల ఆయకట్టు ఉంది. దాదాపు ఐదు దశాబ్దాలు దాటడంతో ప్రాజెక్టు శిథిలావస్థకు చేరింది. చాలా చోట్ల షటర్లు తుప్పు పట్టిపోయి, పక్కన ఉన్న కట్టడాలు కూలిపోయాయి. కాలువల్లో జమ్ము పెరిగి అస్తవ్యస్తంగా తయారయ్యాయి. స్థానిక రైతుల డిమాండ్ మేరకు ప్రభుత్వం రిపేర్ల కోసం 2017లో రూ.24.54 కోట్లు మంజూరు చేసింది. హైదరాబాద్ కు చెందిన ఓ కాంట్రాక్టు సంస్థ పనులు టేకప్ చేసి 2018లో 18 నెలల్లో పనులు పూర్తిచేస్తామని అగ్రిమెంట్ చేసుకుంది. కానీ, ఐదేండ్లు కావొస్తున్నా.. 30 శాతం పనులు మాత్రమే చేసింది. మిగిలిన 70 శాతం పనులు మధ్యలోనే వదిలేసింది. ప్రస్తుతం కంప్లీట్ చేసిన 30 శాతం పనులు కూడా మళ్లీ రిపేర్‌కు వచ్చాయి.
అగ్రిమెంట్ డేట్ పొడిగింపు..
కాంట్రాక్ట్ సంస్థ ప్రాజెక్ట్ రిపేర్ వర్స్క్ కోసం చేసుకున్న ఒప్పందం మేరకు రైతులు 18 నెలల పాటు సాగుకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇంకా పనులు పూర్తి కాకపోవడంతో ఇప్పటికీ పంటలు వేసుకోలేక పోతున్నారు. ఇదిలాఉండగా సదరు సంస్థ అగ్రిమెంట్ డేట్ పొడిగించి రెన్యువల్ చేయాలని రెండేళ్ల కింద గవర్నమెంట్ కు విజ్ఞప్తి చేసుకుంది. ఈ విషయంపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి రాకపోవడంతో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
జడ్పీ మీటింగ్‌లో చర్చ
నల్లవాగు ప్రాజెక్టు రిపేర్ పనుల గురించి నాలుగు రోజుల కింద జరిగిన జడ్పీ జనరల్ బాడీ మీటింగ్ లో చర్చ జరిగింది. స్థానిక జడ్పీటీసీ రాఘవరెడ్డి ప్రాజెక్టు పనులు పెండింగ్‌లో ఉన్నాయని, సంబంధిత ఈఈ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు . రూ.24 కోట్ల పైచిలుకు పనులు చేయించాల్సి ఉండగా కేవలం 10 కోట్ల పనులు మాత్రమే చేసి మొత్తం బిల్లులు తీసుకున్నారని ఆరోపించారు. స్పందించిన ఇరిగేషన్ అధికారులు విచారించి చర్యలు తీసుకుంటామని చెప్పగా, నాలుగేళ్లుగా ఏం చేస్తున్నారని జడ్పీటీసీ మండపడ్డారు. మంత్రి హరీశ్ రావు కలగజేసుకొని అవసరమైతే కాంట్రాక్టర్‌ను మార్చి పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. వచ్చే మీటింగ్ వరకు పనులు స్టార్ట్ చేయకపోతే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణం
కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే రిపేర్ పనులు పెండింగ్ పడుతున్నాయి. ఇదివరకు ఇచ్చిన గడువు దాటిపోవడంతో పరిమితి పెంచాలని ప్రభుత్వాన్ని కాంట్రాక్టర్ కోరారు. ఆ ఫైల్ పెండింగ్‌లో ఉండడం వల్లే ఆలస్యమవుతోంది. చేసిన పనికి మాత్రమే బిల్లులు చెల్లించాం. ఎక్కువ బిల్లులు ఇచ్చారన్న ఆరోపణల్లో నిజం లేదు.
- పవన్, ఇరిగేషన్ డీఈ