ప్రాజెక్టుల రిపేర్లు  గడువులోగా కంప్లీట్ ​అయ్యేనా?

ప్రాజెక్టుల రిపేర్లు  గడువులోగా కంప్లీట్ ​అయ్యేనా?
  • పూర్తి చేయడానికి  నెల రోజులే డెడ్​లైన్​ 
  • ఇంకా కొనసాగుతున్న కడెం ప్రాజెక్ట్ రిపేర్లు
  • సదర్మాట్ బ్యారేజ్ పనులు వెరీ స్లో.. 
  • ప్రపోజల్స్​కే పరిమితమైన గడ్డన్న ప్రాజెక్ట్ పనులు

నిర్మల్, వెలుగు:  మొన్నటి వరదల వల్ల దెబ్బతిన్న కడెం ప్రాజెక్టుకు సంబంధించిన రిపేర్లు ఇంకా పూర్తి కాలేదు. జూన్ 10 వరకు డెడ్​లైన్​ ఉన్నా అప్పటికీ పూర్తయ్యేలా కనిపించడం లేదు. అలాగే జిల్లాలోనే సదర్మాట్​, గడ్డెన్న ప్రాజెక్ట్​ల పరిస్థితి కూడా అలానే ఉంది. దెబ్బతిన్న గడ్డన్న ప్రాజెక్టులో రిపేర్లకు ప్రపోజల్స్​ పంపినా ఇప్పటికీ అప్రూవల్​ రాలేదు. 

 కిందటి ఏడాది తీవ్రమైన వరదతో దెబ్బతిన్న  కడెం ప్రాజెక్ట్​లో మూడు నెలల నుంచి రిపేర్లు   కొనసాగుతున్నాయి. గ్రీజింగ్, ఆయిలింగ్   పనులు నడుస్తున్నాయి. దీంతోపాటు 2,3  గేట్ల వద్ద కౌంటర్ వెయిటర్ లను కొత్తగా బిగిస్తున్నారు.   వరద ఉధృతికి ఈ కౌంటర్ వెయిటర్లు కొట్టుకుపోయాయి. వరదల సమయం లో ప్రాజెక్టులోకి ఆరు లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు రావడంతో ప్రాజెక్టు చాలా చోట్ల దెబ్బతిన్నది. వరద ఉధృతికి  ప్రాజెక్టు  కొట్టుకుపోతుందేమోనన్న అనుమానాలు వ్యక్తంమయ్యాయి.  సుమారు నెలరోజుల దాకా ప్రాజెక్టుపైకి అధికారులు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో వదర ప్రభావం తగ్గే వరకు వేచి చూసి, ఆ తర్వాత ప్రాజెక్ట్​ రిపేర్లను చేపట్టారు. 

ముంచుకొస్తున్న డెడ్​ లైన్​.. 

జూన్ నెలాఖరులోగా పనులు పూర్తి చేయకపోతే.. మళ్లీ ప్రాజెక్టుకు   కష్టాలు తప్పవంటున్నారు అధికారులు. మరమ్మతు పనులతో పాటు స్కాడా(సూపర్వైజర్ కంట్రోల్ అండ్ డాటా ఆక్విజేషన్ ) కింద కూడా ఇక్కడ పనులు చేస్తున్నారు. అయితే ఈ పనులన్నీ ఆధునీకరణలో భాగంగా చేపట్టబోతున్నారు. వచ్చే ఏడాది వరకు ఈ పనులు పూర్తవుతాయని ఇంజనీరింగ్ అధికారులు అంటున్నారు. ప్రస్తుతం అవసరమైన మరమ్మతు పనులు మరింత వేగవంతం చేసేందుకు కలెక్టర్ స్వయంగా అక్కడికి వెళ్లి పర్యవేక్షించారు. 

సాగుతున్న పాత సదర్ మాట్ పనులు...

 కాగా ఖానాపూర్ పరిధిలోని పాత సదర్ మాట్ బ్యారేజీ రిపేర్లు పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. వరదల వల్ల అండర్ టన్నెల్ కొట్టుకుపోయింది. దానికి తాత్కాలికంగా రిపేర్లు చేసి సాగునీరు అందించారు. రిపేర్​ కోసం రూ. ఐదు కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే జూన్ చివరి వారంలోగా పనులు పూర్తి చేయాల్సి ఉంది. కానీ, ఆశించిన మేర వేగం కనిపించడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. 

ప్రతిపాదనల్లోనే గడ్డన్న ప్రాజెక్టు పనులు...

 బైంసా లోని గడ్డన్న వాగు ప్రాజెక్టు పనులతో పాటు ప్రాజెక్టు పై కొత్త కేబుల్స్ ఏర్పాటు కోసం సంబంధిత అధికారులు రూ. 20 లక్షలతో ప్రపోజల్స్​ పంపారు. నెలలు గడుస్తున్నా వాటికి మోక్షం లభించడం లేదు. ఇప్పటివరకూ నిధులు మంజూరు కాకపోవడంతో కొత్త కేబుల్స్ ఏర్పాటు తో పాటు ఇతర పనులు చేపట్ట లేకపోతున్నారు. 

 గడువులోగా పూర్తి చేసేందుకు ప్రయత్నాలు... 

జూన్ 10లోగా కడెం ప్రాజెక్టుకు సంబంధించిన రిపేర్లు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కలెక్టర్ ఆదేశాల మేరకు పనులలో మరింత వేగం పెంచుతున్నాం. ప్రాజెక్టు గేట్లకు సంబంధించిన గ్రీజింగ్, ఆయిలింగ్, కాడియం కాంపౌండ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అలాగే గేట్ల రూప్స్ కూడా శుభ్రం చేస్తున్నాం. రెండు గేట్లకు   కౌంటర్ వెయిట్ ల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ఇతర  రిపేర్లు కూడా  స్పీడ్​గానే సాగుతున్నాయి.
- రవి కుమార్,ఏఈ, కడెం ప్రాజెక్టు.