వానకాలంలోపు సాగర్ కు రిపేర్లు చేయండి: ఎన్​డీఎస్ఏ నివేదిక

వానకాలంలోపు సాగర్ కు రిపేర్లు చేయండి: ఎన్​డీఎస్ఏ నివేదిక

హైదరాబాద్, వెలుగు: నాగార్జునసాగర్ ప్రాజెక్టులోని ఒకటి, రెండో స్పిల్ వే గేట్ల వద్ద గర్డర్ బ్రిడ్జి కవర్ పాడైందని, దానికి వీలైనంత త్వరగా రీఇన్​ఫోర్స్​మెంట్ చేయాలని అధికారులకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్​డీఎస్ఏ) సూచించింది. ఈ మేరకు శుక్రవారం నాగార్జునసాగర్ సేఫ్టీపై ఎన్​డీఎస్ఏ రిపోర్ట్ విడుదల చేసింది. ప్రాజెక్టులోని పలు  పియర్లలోని కౌంటర్ వెయిట్ల వద్ద క్రాక్స్ వచ్చాయని ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని పియర్లలోని క్రాక్స్​ను మ్యాప్ చేసి, విశ్లేషించి చర్యలు తీసుకోవాలని చెప్పింది. ప్రాజెక్టు నిండి స్పిల్ వే మీద నుంచి వరద వెళ్లేంత స్థాయిలో ఉంటే ఓసారి జెడ్ సీల్స్​ను చెక్ చేయాలని పేర్కొంది. కొన్ని స్పిల్ వేల్లోని గ్లేసిస్​ల వద్ద బ్లాక్ అవుట్స్ ఉన్నాయని, వాటిని మంచి గ్రేడ్ కాంక్రీట్​తో పూడ్చాలని సూచించింది.

చాలా వరకు స్పిల్ వేల్లోని రంధ్రాలను పూడ్చివేశారని, మరికొన్ని స్పిల్ వేల్లోనూ సమస్యలున్నాయని, వాటి పనులనూ వర్షాకాలంలోపే పూర్తి చేయాలని స్పష్టం చేసింది. స్పిల్ వే కింది భాగంలోని ఫ్లిప్ బకెట్​ల వద్ద కాంక్రీట్ కొట్టుకుపోయిందని, వాటికి రిపేర్లు చేయాలని సూచించింది. 250 అడుగులు, 420 అడుగుల వద్ద ఇన్​స్పెక్షన్ గ్యాలరీల్లోని వీ నాచ్ ల ద్వారా సీపేజీ వస్తున్నదని.. ఆ రెండు సీపేజీలు ఎంత మేర ఉన్నాయో విడివిడిగా లెక్కించాలని ఎన్​డీఎస్ఏ టీమ్​సూచించింది. గ్యాలరీలోని రెసిస్టెన్స్ థర్మో మీటర్, ప్లంబ్ లైన్, స్ట్రెస్ మీటర్, అప్​లిఫ్ట్ ప్రెజర్ సెల్స్ అసలు పనిచేయడం లేదని వెల్లడించింది. ఇంత పెద్ద డ్యామ్​ను మానిటరింగ్ చేయడంలో ఈ పరికరాలు కీలకమని, వాటిని వీలైనంత త్వరగా ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని సూచించింది. అలాగే ప్రాజెక్ట్ భద్రతపై ఓ సారి సమగ్రంగా విశ్లేషించాల్సిన అవసరం ఉందని ఎన్​డీఎస్ఏ రిపోర్ట్​లో పేర్కొంది.

అడ్డుకుంటున్నరని ఫిర్యాదులు

పనులను పర్యవేక్షించేందుకు వెళ్తున్న అధికారులను కేఆర్ఎంబీ, సెక్యూరిటీ ఏజెన్సీలు అడ్డుకుంటున్నాయంటూ డ్యామ్ ఇన్​స్పెక్షన్ సందర్భంగా తమకు ఫిర్యాదులు వచ్చాయని ఎన్​డీఎస్ఏ తెలిపింది. ఇలా అడ్డుకోవడం వల్ల ప్రాజెక్టు పనులకు ఆటంకం కలగడంతో పాటు ప్రాజెక్ట్ ఆపరేషన్స్ అండ్ మానిటరింగ్​కు తీవ్ర ఇబ్బంది అవుతుందని రిపోర్ట్​లో పేర్కొంది. అధికారులకు ప్రాజెక్ట్​పైకి వెళ్లి పనులను పరిశీలించేలా అనుమతులివ్వాలని పేర్కొంది. ప్రాజెక్ట్​కు వచ్చే ప్రాబబుల్ మ్యాగ్జిమమ్ ఫ్లడ్ (పీఎంఎఫ్)పై ఐఐటీ ఖరగ్​పూర్ రిపోర్ట్​మేరకు చర్యలు తీసుకోవాలని సూచించింది.