రాయికోడ్, వెలుగు: అర్ధాంతరంగా నిలిచిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని ఆందోల్ హౌసింగ్ డీఈ మల్లేశం తెలిపారు. గురువారం రాయికోడ్ ఎంపీడీవో ఆఫీస్ ఆవరణలో నిర్మాణంలో ఉన్న మోడల్ హౌస్ పనులతో పాటు చిమ్నాపూర్ గ్రామ శివారులో అర్ధాంతరంగా నిలిచిపోయిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆందోల్ నియోజకవర్గంలో 2,281 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, 1,217 ఇండ్ల పనులు చేపట్టినట్లు చెప్పారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు ఇప్పటివరకు రూ.15.13 కోట్ల బిల్లులు చెల్లించామన్నారు.
గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పనులు బేస్‌మెంట్ లెవల్లోనే నిలిచిపోయాయని, వాటికి సంబంధించిన పూర్తి నివేదికను తయారు చేసి ఉన్నతాధికారులకు అందజేస్తామని చెప్పారు. ఎంపీడీవో మహ్మద్ షరీఫ్, ఆందోల్, రాయికోడ్ హౌసింగ్ ఏఈలు అంకుశ్, శ్రీనివాస్, సెక్రటరీ శివశంకర్ పాల్గొన్నారు.
