IPL 2024: దుబాయ్‌లో సెకండ్ హాఫ్ ఐపీఎల్..కారణం అదేనా

IPL 2024: దుబాయ్‌లో సెకండ్ హాఫ్ ఐపీఎల్..కారణం అదేనా

ఐపీఎల్ 2024 సెకండ్ హాఫ్ షెడ్యూల్ ను బీసీసీఐ ఇంకా ఖరారు చేయని సంగతి తెలిసిందే. ఈ మెగా లీగ్ ను ఇండియాలోనే నిర్వహించాలా.. లేకపోతే దుబాయ్ కి మార్చాలా అనే సస్పెన్స్ కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం సెకండ్ హాఫ్ ఐపీఎల్ ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) రాజధాని దుబాయిలోనే జరపాలని బీసీసీఐ ప్రయత్నాలు చేస్తోందట. లోక్ సభ ఎన్నికల కారణంగా ఈ మెగా టోర్నీని భారత్ లో జరిపే అవకాశాలు లేనట్టే కనిపిస్తున్నాయి.    

భారత ఎన్నికల సంఘం శనివారం (మార్చి 16) మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తుంది. ఆ తర్వాత ఐపీఎల్ మ్యాచ్ లను దుబాయ్‌కి తరలించాలా వద్దా అనే దానిపై బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుందని.. ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న కొంతమంది బీసీసీఐ ఉన్నతాధికారులు చెబుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఐపీఎల్ టోర్నీని ఇండియా వెలుపల నిర్వహించడం ఇదే తొలిసారి కాదు. 2009 ఎలక్షన్స్ కారణంగా దక్షిణాఫ్రికాలో ఈ టోర్నీ జరిగింది. 

2014లో మరోసారి ఎలక్షన్స్ సమయంలో మొదటి అర్ధ భాగం UAEలో జరిగింది. 2020 కరోనా సమయంలో దుబాయ్ లో ఈ టోర్నీని నిర్వహించారు. ఇదిలా ఉండగా 2024 ఐపీఎల్ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం అవుతుంది. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. ఈ ఏడాది మార్చి- ఏప్రిల్ లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వాటిని దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ మొదటి 21 రోజుల షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ మ్యాచ్ లు మార్చి 22 నుంచి ఏప్రిల్ 7 వరకు జరుగుతాయి.