Babar Azam: పాక్ క్రికెటా! మజాకా!.. బాబర్ ఆజంకు తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు

Babar Azam: పాక్ క్రికెటా! మజాకా!.. బాబర్ ఆజంకు తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు

వన్డే ప్రపంచ కప్ 2023లో పేలవ ప్రదర్శన అనంతరం పాకిస్తాన్ క్రికెట్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.  ఓటములకు నైతిక బాధ్యత వహిస్తూ ఆ జట్టు సారథి బాబర్ ఆజామ్ కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. విదేశీ కోచ్‌లను తప్పిస్తూ పీసీబీ నిర్ణయం తీసుకుంది. ఇది జరిగిపోయిన కథ. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చైర్మన్‌గా జకా అష్రఫ్ పదవిలో ఉన్నప్పుడు చోటుచేసుకున్న సంఘటనలు. 

జకా అష్రఫ్ పీసీబీ చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకోగా.. అతని స్థానంలో కొత్తగా మొహ్సిన్ నఖ్వీ ఎన్నికయ్యారు. మూడేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ క్రమంలో బాబర్ ఆజంకు తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కెప్టెన్‌‌గా బాబర్ ఆజం వైదొలిగిన తర్వాత షాన్ మసూద్‌ను టెస్ట్ కెప్టెన్‌గా, షాహీన్ అఫ్రిదీకి టీ20 బాధ్యతలు అప్పగించగా.. వన్డే కెప్టెన్‌ను ప్రకటించలేదు. 

ALSO READ :- Sachin Dhas: భారత క్రికెట్‌లో సచిన్ దాస్ నామస్మరణ.. ఎవరీ యువ క్రికెటర్..?

మసూద్‌ నాయకత్వంలో పాక్.. ఆస్ట్రేలియా చేతిలో వైట్‌వాష్‌(3 టెస్టులు)  అవ్వగా, ఆఫ్రిది కెప్టెన్సీలో న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-4 తేడాతో కోల్పోయింది. దీంతో వీరిని తప్పించి మళ్లీ బాబర్ ఆజంకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 17 నుంచి పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్ ) ప్రారంభం కానుంది. ఈ టోర్నీ ముగిసేనాటికి బాబర్ ఆజంకు తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని బోర్డు పెద్దలకు కొత్త చైర్మన్ చెప్పినట్లు కథనాలు వస్తున్నాయి. అలా చేస్తేనే పాక్ క్రికెట్‌ని తిరిగి గాడిలో పెట్టొచ్చని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. 

బాబర్ టాప్ స్కోరర్..

ఇదిలావుంటే, బాబర్ ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2024లో ఆడుతున్నాడు. ఇప్పటివరకూ 6 ఇన్నింగ్స్‌లలో 50.20 సగటుతో 251 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అంతకుముందు న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లోనూ అతను మంచి ప్రదర్శన చేశాడు. 5 ఇన్నింగ్స్‌లలో 42.60 సగటుతో 213 పరుగులు చేశాడు.ఇందులో మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి.