సన్‌రైజర్స్ కీలక నిర్ణయం.. రూ.13 కోట్ల ఆటగాడికి, జమ్మూ ఎక్స్‌ప్రెస్‌కు గుడ్ బై!

సన్‌రైజర్స్ కీలక నిర్ణయం.. రూ.13 కోట్ల ఆటగాడికి, జమ్మూ ఎక్స్‌ప్రెస్‌కు గుడ్ బై!

'సన్‌రైజర్స్ హైదరాబాద్..' మెగాస్టార్ హీరోగా నటించిన శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో 'గుడ్ మార్నింగ్ హైదరాబాద్..' డైలాగ్ వలే భలే ఉంది కదా! కానీ జట్టు బయోగ్రఫీ చెండాలం. ఇది నేను చెప్తున్న మాట కాదు. సోషల్ మీడియాలో అభిమానుల గోల ఇది. అన్ని జట్లు అగ్రస్థానికి పోటీపడితే.. మన రెండు తెలుగు రాష్ట్రాల అభిమాన జట్టు సన్‌రైజర్స్(Sunrisers Hyderabad) మాత్రం పాయింట్ల పట్టికలో చివరి స్థానం కోసం పోటీపడుతోందంటూ నెటిజన్స్ సోషల్ మీడియాలో కోడై కూస్తున్నారు.

తట్టుకోలేకపోయిన రజినీ కాంత్

రెండ్రోజుల క్రితం తమిళ తలైవా రజినీ కాంత్(Rajinikanth).. సన్‌రైజర్స్ జట్టును ఉద్దేశిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ జట్టు మ్యాచులు ఓడిపోతుంటే.. కావ్య మారన్(Kavya Maran) బాధపడుతున్న దృశ్యాలు తనను కలిచివేశాయని ఆయన చెప్పుకొచ్చారు. ఈ బాధపైకి చెప్పినా వారు రజినీ ఒక్కరు మాత్రమే.. కానీ రెండు తెలుగు రాష్ట్రాల అభిమానుల బాధ కూడా అదే. తమ అభిమాన జట్టు ఓడిపోతుండటం చూడలేక.. మరోజట్టుకు మద్దతు ఇవ్వలేక టీవీలనే కట్టిపడేసేవారు. 

ఐపీఎల్ 2024 నాటికి ప్రక్షాళన

అభిమానుల విమర్శలు, బాధలు మొత్తానికి జట్టు యాజమాన్యానికి చేరినట్టే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో వచ్చే ఐపీఎల్(IPL 2024) నాటికి జట్టు ప్రక్షాళనకు పూనుకుందని సమాచారం. అందులో భాగంగా మొదట హెడ్ కోచ్ బ్రియాన్ లారా(Brian Lara)పై వేటు వేయనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా గత సీజన్‌లో నిరాశపరిచిన కొంతమంది ఆటగాళ్లపై కూడా వేయనుందట. ఈ జాబితాలో ముందుగా రూ.13 కోట్ల ఆటగాడు ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్(Harry Brook) ఉన్నట్టు వార్తలొస్తున్నాయి.

గత సీజన్‌లో బ్రూక్ కోసం.. సన్‌రైజర్స్ రూ.13.25 కోట్లు ఖర్చు పెట్టగా.. అతను 11 మ్యాచ్‌ల్లో 190 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యాడు. ఈ ప్రదర్శన రూ.13 కోట్లకు సరితూగకపోవడంతో.. అతనికి గుడ్‌బై చెప్పాలని యాజమాన్యం నిర్ణయించుకుందని సమాచారం. అలాగే, రూ.8 కోట్ల భారీ ధరకు అంటి పెట్టుకున్న యువ పేసర్‌, జమ్మూ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్‌ మాలిక్‌(Umran Malik)ను వదులుకునేందుకు సిద్దమైందట. ఈ జాబితాలో మరికొందరు ఆటగాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది.