- మనసైన్యమే మన బలం..
- ఏ సవాలునైనా ఎదుర్కోగలం: రాష్ట్రపతి ముర్ము
- ఆపరేషన్ సిందూర్.. భారత స్వయం సమృద్ధికి నిదర్శనం
- త్వరలో మూడో అతిపెద్ద
- ఆర్థిక వ్యవస్థగా నిలుస్తాం
- ఛబ్బీస్ జనవరిని పురస్కరించుకుని
- ప్రెసిడెంట్ సందేశం
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా అశాంతి నెలకొన్న ప్రస్తుత తరుణంలో, ఇండియా శాంతిని కోరుకునే దేశంగా తన బాధ్యత నెరవేరుస్తున్నదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మానవాళి భవిష్యత్తు సురక్షితంగా ఉండాలంటే ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొనడం అత్యవసరమని నొక్కి చెప్పారు. ఇండియా ఎప్పుడూ విశ్వశాంతిని కోరుకుంటుందని, శాంతి సందేశాన్ని ప్రపంచానికి పంచుతున్నదని చెప్పారు. 77వ గణతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆమె జాతినుద్దేశించి మాట్లాడారు. ముందుగా దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఛబ్బీస్ జనవరి శుభాకాంక్షలు తెలిపారు.
‘‘మనం శాంతిని కోరుకుంటున్నామంటే అది బలహీనత కాదు. మన సైన్యం ఎంతటి సవాల్ ను అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని అర్థం. ప్రజలంతా ప్రస్తుతం స్వాతంత్ర్య ఫలాలు అనుభవిస్తున్నారు. మన రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శం. మన ప్రజాస్వామ్యం ఎన్నో సవాళ్లను అధిగమించింది. అభివృద్ధి ఫలాలు దేశ ప్రజలకు అందుతున్నాయి. విద్య, వైద్య రంగాల్లో దేశం ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్నది. మన రైతులు దేశానికి అవసరమైన పోషకాహారాన్ని సమృద్ధిగా అందిస్తున్నారు’’అని రాష్ట్రపతి తెలిపారు.
సైనిక సామర్థ్యంపై ప్రజలకు పూర్తి విశ్వాసం
‘ఆపరేషన్ సిందూర్’ వంటి కచ్చితమైన దాడుల ద్వారా ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడం.. మన రక్షణ రంగం సాధించిన స్వయం సమృద్ధికి నిదర్శనమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. ‘‘దేశ సైనిక సామర్థ్యంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది. నేను సియాచెన్ బేస్ క్యాంప్ ను సందర్శించాను. సుఖోయ్, రఫెల్, ఐఎన్ఎస్ వాఘ్‌షీర్ సబ్‌మెరైన్‌లో ప్రయాణించాను. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ దళాలు దేశ ప్రజల రక్షణ కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాయి. ఇండియా వేగంగా అభివృద్ధి చెందుతున్నది. త్వరలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కలిగిన దేశంగా అవతరించబోతున్నం’’అని రాష్ట్రపతి ధీమా వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశ ఆర్థిక ఏకీకరణ కోసం తీసుకున్న అతిపెద్ద నిర్ణయం జీఎస్టీ అని ఆమె పేర్కొన్నారు. ఇది ‘ఒకే దేశం–ఒకే మార్కెట్’ఆశయాన్ని బలోపేతం చేసిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు.
చట్టసభల్లో మహిళలకు ప్రాధాన్యత
మహిళలు అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. ఇటీవల ఇండియా మహిళా జట్టు క్రికెట్ ప్రపంచకప్‌ను గెలవడం, చెస్ రంగంలో సాధించిన విజయాలను ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘‘నారీ శక్తి వందన్ అధినియం ద్వారా చట్టసభల్లో మహిళలకు లభించిన రిజర్వేషన్లు దేశ రాజకీయ భవిష్యత్తును మారుస్తాయి. 10 కోట్లకు పైగా మహిళలు.. స్వయం సహాయక బృందాల్లో సభ్యులుగా ఉన్నారు. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వ్యవసాయం నుంచి అంతరిక్షం, స్వయం ఉపాధి నుంచి సైన్యం వరకు అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు. బేటీ బచావో, బేటీ పఢావో కార్యక్రమం మహిళల విద్యను ప్రోత్సహిస్తున్నది’’అని రాష్ట్రపతి ముర్ము అన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద గణతంత్ర దేశం
బంకిం చంద్ర చటర్జీ రచించిన వందే మాతరం గీతం స్వాతంత్ర్య సమరంలో ఐక్యతా చిహ్నంగా మారిందని, తమిళంలో సుబ్రమణ్య భారతి రచించిన ‘వందే మాతరం యెన్బోమ్’ వంటి అనువాదాలు దాన్ని మరింత విస్తరించాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ‘‘దేశ సమగ్రత కోసం కృషి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలను, అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్ అందించిన స్ఫూర్తిని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి. జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ‘పరాక్రమ్ దివస్’గా జరుపుకోవడం ద్వారా యువతకు దేశభక్తి ప్రేరణనిస్తుంది.
ఇండియా.. ప్రపంచంలోనే అతిపెద్ద గణతంత్ర దేశమని, మన రాజ్యాంగంలో నిర్దేశించిన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం వంటి ఆదర్శాలు మన గణతంత్రాన్ని నిర్వచిస్తాయని తెలిపారు. దేశాభివృద్ధిలో సైనికులు, పోలీసులు, రైతులు, మహిళలు, డాక్టర్లు, శానిటేషన్ కార్మికులు, టీచర్లు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, యువత, పిల్లలు అందరి దోహదాన్ని ప్రశంసించారు. ప్రజా భాగస్వామ్యంతో జాతీయ లక్ష్యాలు సాధిస్తున్నామని తెలిపారు. డిజిటల్ చెల్లింపుల్లో ఇండియా.. ప్రపంచంలోనే అత్యధిక లావాదేవీలు నిర్వహిస్తున్నదని చెప్పారు.
ఓటు.. అత్యంత శక్తిమంతమైన ఆయుధం
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తిమంతమైన ఆయుధమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుర్తు చేశారు. ఓటర్లు తమ ఓటును వినియోగించుకునేటప్పుడు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకూడదని, కుల, మత, ప్రాంతీయ పక్షపాతాలకు తావివ్వకుండా కేవలం వివేకంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ముర్ము జాతినుద్దేశించి మాట్లాడారు. ‘‘ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కావాలంటే పౌరులు బాధ్యతాయుతంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించడం అవసరం. ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం అనేది కేవలం ఒక హక్కు మాత్రమే కాదు.. అది ప్రతి పౌరుడి పవిత్రమైన బాధ్యత. దేశ భవిష్యత్తును నిర్ణయించే శక్తి ఓటుకు ఉంది’’అని ఆమె గుర్తు చేశారు.
