10 గంటలు లేట్ గా రెస్క్యూ

10 గంటలు లేట్ గా రెస్క్యూ

సీఐఎస్ఎఫ్ కు ఆలస్యంగా సమాచారం ఇచ్చిన ఆఫీసర్లు

వెంటనే స్పందిస్తే ప్రాణనష్టం తప్పేదంటున్న ఉద్యోగులు

హైదరాబాద్, వెలుగు: భద్రతా లోపాలు, నిర్లక్ష్యం 9 నిండు ప్రాణాలను బలితీసుకుంది. శ్రీశైలం పవర్ ప్లాంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించలేదనే వాదనలున్నాయి. సంఘటన జరిగిన వెంటనే రెస్క్యూ టీమ్ ను రంగంలోకి దింపాలనే విషయాన్ని సర్కారు మరిచిపోయింది. దీంతో ప్రాణ నష్టం జరిగిందని విద్యుత్ విభాగంలో చర్చ జరుగుతోంది. గురువారం రాత్రి 10.30 గంటలకు మంటలు చెలరేగాయి. దీంతో లోపలి నుంచి పరుగున బయటికి వచ్చిన కొందరు ఎంప్లాయిస్ హెడ్ క్వార్టర్ కు సమాచారం ఇచ్చారు. 9 మంది ప్లాంట్ లోనే చిక్కుకున్నట్టు చెప్పారు. వెంటనే రెస్క్యూ టీంను దింపాల్సిన ప్రభుత్వం నిదానంగా వ్యవహరించింది.

విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, జెన్ కో సీఎండీ ప్రభాకర్​రావుతో పాటు పలువురు ఆఫీసర్లు రాత్రే శ్రీశైలం చేరుకున్నారు. కానీ శుక్రవారం ఉదయం 8 గంటలకు ఫైర్ డీజీ.. సీఐఎస్ఎఫ్ సాయం కోరారు. అప్పటికే ఫైర్ యాక్సిడెంట్ జరిగి దాదాపు తొమ్మిదిన్నర గంటలు దాటింది. ఫైర్​ డీజీ అభ్యర్థన మేరకు ఉదయం 8.35 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరిన సీఐఎస్ ఎఫ్ టీమ్ మధ్యాహ్నం ఒంటి గంటకు సైట్ కు చేరుకుంది. రాత్రికి రాత్రే సీఐఎస్ఎఫ్ ను రప్పిస్తే కొందరైనా బతికి ఉండేవారనే విద్యుత్ ఉద్యోగులు అంటున్నారు.