ఎన్​సీఏఎం సెంటర్ ఓపెనింగ్​ ఇయ్యాల్నే

ఎన్​సీఏఎం సెంటర్ ఓపెనింగ్​ ఇయ్యాల్నే
  • ప్రారంభించనున్న కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సెక్రటరీ అల్కేష్ కుమార్
  • ఇక త్రీడీ ప్రింటింగ్​టెక్నాలజీలో మరిన్ని పరిశోధనలు
  • మెడికల్ ఇంప్లాంట్స్​తయారీతో మెరుగైన వైద్య సేవలు

 సికింద్రాబాద్, వెలుగు: త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో మెడికల్ ఇంప్లాంట్స్​(వైద్య పరికరాలు) తయారీలో మరిన్ని పరిశోధనలకు వీలుగా ఉస్మానియా వర్సిటీలో రీసెర్చ్​సెంటర్ అందుబాటులోకి రానుంది. ఓయూ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటైన నేషనల్ సెంటర్ ఫర్ ఆడిటివ్​మ్యానుఫ్యాక్చరింగ్(ఎన్ సీఏఎం)ను గురువారం కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సెక్రటరీ అల్కేష్​కుమార్, రాష్ట్ర ఐటీ శాఖ సెక్రటరీ జయేశ్​రంజన్, ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్​ ప్రారంభించనున్నారు. ఈ సెంటర్ అందుబాటులోకి వస్తే ఇంజనీరింగ్ స్టూడెంట్లు మరిన్ని రీసెర్చ్​లు చేసేందుకు ఉపయోగకరంగా ఉంటుందని వర్సిటీ అధికారులు చెబుతున్నారు.

గతేడాది అవగాహన ఒప్పందం 

ఉస్మానియా వర్సిటీలో ఎన్​సీఏఎం సెంటర్​ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీశాఖతో 2022 మే నెలలో అవగాహన ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం కేంద్ర ప్రభుత్వ రూసా(రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్) నిధులతో ఈ సెంటర్​ను డెవలప్ చేశారు. దీనిని ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న త్రీడీ సెంటర్​కు లింక్​ చేసి త్రీడీ టెక్నాలజీ వాడకంపై మరిన్ని రీసెర్చ్​లు చేయనున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు.

ఎన్నో ప్రయోజనాలు

వైద్యరంగంలో మెడికల్ ఇంప్లాంట్స్​లో త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ  కీలకపాత్ర పోషిస్తోంది. ఈ టెక్నాలజీతో తయారు చేసిన వైద్య పరికరాలతో పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించవచ్చు. ఓ వ్యక్తి ప్రమాదానికి గురైనప్పుడు లేదా ఇతర వ్యాధుల వల్ల అతడి శరీరంలోని ఎముకలను కోల్పోయే పరిస్థితి ఎదురైతే త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో  తయారు చేసిన ఎముకలను ఆయా భాగాల్లో డాక్టర్లు అమర్చేందుకు వీలుంటుంది. దీంతోపాటు గుండెకు సంబంధించిన సర్జరీలు, ఇతర ట్రీట్​మెంట్లకు సైతం త్రీడీ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతోంది. ఎన్​సీఏఎంతో కలిసి త్రీ-డీ ప్రింటింగ్​టెక్నాలజీ సెంటర్​తో రీసెర్చ్​ చేయడంతో పేదలకు  అతి తక్కువ ధరకు వైద్య సేవలు అందించేందుకు వీలుంటుందని వర్సిటీ అధికారులు చెబుతున్నారు. ఆటో మొబైల్, స్పేస్ రంగంతోపాటు ఇతర ఇండస్ట్రీల్లోనూ ఈ టెక్నాలజీ సాయంతో ఉత్పత్తుల తయారీ  టైమ్​ను తగ్గించవచ్చన్నారు.  

స్టార్టప్​ల ఏర్పాటుకు అవకాశం

ఎన్​సీఏఎం సెంటర్ అందుబాటులోకి వస్తే  ఉస్మానియా వర్సిటీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కుతుందని వర్సిటీ అధికారులు భావిస్తున్నారు. త్రీడీ ప్రింటింగ్ పరికరాలపై అవగాహన కార్యక్రమాలు, ఇంటర్నేషనల్ సెమినార్లు, ట్రైనింగ్ ప్రోగ్రామ్​లు నిర్వహించేందుకు,  ఇంటర్న్ షిప్, స్టార్టప్​ల ఏర్పాటుకు మెరుగైన అవకాశాలుంటాయని అధికారులు చెబుతున్నారు.

ఇంజనీరింగ్ స్టూడెంట్లకు మంచి చాన్స్

త్రీ-డీ ప్రింటింగ్​టెక్నాలజీపై 14 ఏండ్లుగా రీసెర్చ్​లు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. రెండేండ్ల కిందట ఉస్మానియాలో త్రీడీ ప్రింటింగ్ ల్యాబ్ ప్రారంభమైంది. అందుబాటులోకి రానున్న ఎన్​సీఏఎంతో ఇంజనీరింగ్ స్టూడెంట్లకు వివిధ అంశాలలో రీసెర్చ్​లు చేసేందుకు మంచి అవకాశం ఉంది. – ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్, ఓయూ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్, త్రీడీ ప్రింటింగ్ సెంటర్​ డైరెక్టర్