
- 42% బీసీ కోటా కోసం నేడు జంతర్ మంతర్ వద్ద రాష్ట్ర సర్కార్ ధర్నా
- పెండింగ్‌లో ఉన్న బిల్లులను కేంద్రం ఆమోదించాలని డిమాండ్
- సీఎం రేవంత్ ఆధ్వర్యంలో హస్తినకు చేరుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
- 2 వేల మందికిపైగా తరలిన కాంగ్రెస్ ప్రతినిధులు, బీసీ సంఘాల లీడర్లు
- హాజరుకానున్న ఏఐసీసీ చీఫ్ ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్
- మద్దతుగా పాల్గొననున్న ఇండియా కూటమి ఎంపీలు, ఆయా పార్టీల ముఖ్య నేతలు
- దేశవ్యాప్తంగా ఓబీసీ రిజర్వేషన్లపై చర్చకు దారితీసే అవకాశం
- ఈ ఏడాది చివర్లో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలపైనా ఎఫెక్ట్?
- బీజేపీ, ఎన్డీయే కూటమి నేతల్లో కలవరం.. కేంద్ర సర్కారు నిర్ణయంపై ఉత్కంఠ
హైదరాబాద్/ న్యూఢిల్లీ, వెలుగు: దేశ రాజధాని ఢిల్లీకి బీసీ రిజర్వేషన్ల సెగ తాకింది. ‘‘జిత్నీ ఆబాదీ.. ఇత్నీ హిస్సేదారి (ఎంత జనాభాకు అంత వాటా)’’ అన్న రాహుల్‌గాంధీ నినాదాన్ని ఆచరణలో పెట్టే దిశగా కేంద్రంపై ఒత్తిడికి రాష్ట్ర సర్కార్ సిద్ధమైంది. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను కేంద్రం ఆమోదించాలనే డిమాండ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో బుధవారం జంతర్‌మంతర్ దగ్గర చేపట్టనున్న ధర్నాకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్మహేశ్కుమార్ గౌడ్‌తో పాటు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీలోని బీసీ నేతలు, బీసీ సంఘాల నాయకులంతా ఢిల్లీ చేరుకున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు జంతర్‌మంతర్‌వద్ద సుమారు 2వేల మంది ప్రతినిధులతో తెలంగాణ సర్కారు చేపట్టనున్న ఈ ధర్నాకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమిలోని కీలక నాయకులు హాజరై తమ సంఘీభావం తెలుపనున్నారు. దీంతో తెలంగాణ చేపట్టిన బీసీ రిజర్వేషన్ల సాధన పోరాటం దేశవ్యాప్తంగా ఇదే తరహా ఉద్యమాలకు ఊతమివ్వనుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు బిహార్ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తున్న బీజేపీకి తెలంగాణ బీసీ రిజర్వేషన్ల పోరాటం కొరకరాని కొయ్యగా మారిందనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు సీఎం రేవంత్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో వ్యవహరించింది.
న్యాయపరమైన చిక్కులు రాకుండా, హైకోర్టు ఉత్తర్వులను పాటిస్తూ బీసీ డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటుచేసింది. రాష్ట్ర ప్రణాళికా విభాగం ఆధ్వర్యంలో శాస్త్రీయంగా కులగణన చేపట్టింది. ఈ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీలు 56.33 శాతం ఉన్నట్లు తేల్చింది. దీంతోపాటు బీసీల ఆర్థిక, సామాజిక స్థితిగతులను, రాజకీయ ప్రాతినిధ్యాన్ని లెక్కతీసింది. ఈ ఎంపిరికల్డాటా ఆధారంగా విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు బిల్లులను మార్చి17న ఉభయసభలు ఆమోదించాయి. ఈ రెండు బిల్లులు ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని పార్లమెంట్లో ఆమోదించి, 9వ షెడ్యూల్లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విజ్ఞప్తికి కేంద్రం నుంచి స్పందన రావడం లేదు. మరోవైపు రాష్ట్రంలో స్థానిక సంస్థల పాలక వర్గాల పదవీకాలం ముగిసి దాదాపు ఏడాదిన్నర కావస్తున్నది.
ఇప్పటికే సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు లేక గ్రామాల్లో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయి. పాలకవర్గాలు లేవనే కారణంతో కేంద్రం నుంచి రూ.1,600 కోట్లకు పైగా ఫండ్స్ నిలిచిపోయాయి. దీనికితోడు సెప్టెంబర్ 30లోగా లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశించింది. రిజర్వేషన్ల ఖరారు కోసం కోర్టు విధించిన నెల రోజుల గడువు కూడా పూర్తయింది. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం-2018లో రిజర్వేషన్లపై 50శాతం క్యాపింగ్ఉన్న సెక్షన్ 285 ఏను సవరిస్తూ సర్కారు ఆర్డినెన్స్చేసి, గత నెల 14న గవర్నర్‌కు కూడా పంపింది. ఆ బిల్లును సైతం రాష్ట్రపతికి గవర్నర్ పంపడంతో అటు బీసీ బిల్లులు, ఇటు ఆర్డినెన్స్ పెండింగ్‌లో పడ్డాయి. దీంతో బిల్లుల ఆమోదానికి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్ర సర్కార్ అమీతుమీకి సిద్ధమైంది. అందులో భాగంగానే మంగళవారం నుంచి మూడురోజుల ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమం చేపట్టింది.
భారీగా తరలిన కాంగ్రెస్ శ్రేణులు.. తోడుగా బీసీ సంఘాలు..
జంతర్ మంతర్ వద్ద ధర్నాకు రాష్ట్రం నుంచి ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు, బీసీ నాయకులు సుమారు 2 వేల మంది వరకు తరలివెళ్లారు. సోమవారం చర్లపల్లి నుంచి ప్రత్యేక రైలులో సుమారు 1,500 మంది తరలివెళ్లగా.. వీరిలో కాంగ్రెస్ నేతలతో పాటు బీసీ సంక్షేమ సంఘం, బీసీ కుల సంఘాల జేఏసీ, మహత్మా జ్యోతి బా పూలే కమిటీ, బీసీ రాజ్యాధికార సమితి, అల్ ఇండియా ఓబీసీ విద్యార్థి సంఘం నాయకులు, టీఎన్జీవో, టీజీవో, పలు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలకు చెందిన ముఖ్యనేతలు ఉన్నారు.
మంగళవారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లారు. మూడు రోజుల కార్యాచరణలో భాగంగా మంగళవారం కాంగ్రెస్ఎంపీలు బీసీ రిజర్వేషన్లపై పార్లమెంట్లో వాయిదా తీర్మానం ఇచ్చారు. అనంతరం పార్లమెంట్ ఆవరణలో ఆందోళన నిర్వహించి.. తెలంగాణ అసెంబ్లీ పంపిన బీసీ బిల్లులను ఆమోదించాలని డిమాండ్‌చేశారు. బుధవారం జంతర్ మంతర్ వద్ద చేపట్టే ధర్నాలో సంఘీభావంగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ , ఇండియా కూటమి ఎంపీలు, ఆయా పార్టీల ముఖ్యనేతలు పాల్గొననున్నారు. దీంతో ఈ అంశం దేశవ్యాప్తంగా ఓబీసీ రిజర్వేషన్లపై చర్చకు దారి తీసే అవకాశముందని బీసీ లీడర్లు భావిస్తున్నారు.
బిహార్ ఎన్నికలపై ఎఫెక్ట్?
ఈ ఏడాది చివర్లో జరగబోయే బిహార్ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తున్న బీజేపీకి తెలంగాణ సర్కారు చేస్తున్న బీసీ రిజర్వేషన్ల పోరాటం ఇరకాటంలో పడేసింది. ఈ ఎన్నికల్లో బీజేపీ, జనతాదళ్(యు), లోక్‌జనశక్తి (రామ్‌విలాస్) పార్టీలు ఎన్డీఏ కూటమి తరఫున పోటీపడ్తుండగా.. మహాఘట్ బంధన్ నుంచి కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలు రంగంలో దిగుతున్నాయి. బిహార్‌లో 50 నుంచి 60 శాతంగా ఉన్న ఓబీసీ ఓటర్లు గెలుపోటములను పూర్తిగా ప్రభావితం చేయనున్నారు. ఇప్పటికే కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు తెచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై బిహార్ ఓబీసీల్లో వ్యతిరేకత ఉంది. ఈ టైమ్ కాంగ్రెస్‌నేత రాహుల్‌గాంధీ నినాదం ‘జిత్నీ ఆబాదీ.. ఇత్నీ హిస్సేదారి (ఎంత జనాభాకు అంత వాటా)’ ఓబీసీలను ఆకట్టు కుంటున్నది. దీనికితోడు బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టనున్న ధర్నా, దానికి ఇండియా కూటమి నేతలు మద్దతు పలుకుతుండడంతో ఆ ప్రభావం ఎక్కడ బిహార్ ఓటర్లపై పడ్తుందోనని ఎన్డీయే కూటమి నేతల్లో టెన్షన్ మొదలైంది. ఈ నేపథ్యంలో.. తెలంగాణ బీసీ రిజర్వేషన్బిల్లులపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తి నెలకొన్నది.