ఇట్ల అయితే..రిజర్వేషన్ల స్ఫూర్తికి భంగం!

ఇట్ల అయితే..రిజర్వేషన్ల స్ఫూర్తికి భంగం!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ప్రభుత్వం టీఎస్​పీఎస్సీ ద్వారా 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేసింది. అయితే ఈ కొలువుల భర్తీలో ప్రభుత్వం అమలు చేస్తున్న రిజర్వేషన్లు, రోస్టర్​విధానం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఉన్నాయి. దీని వల్ల ఆయా వర్గాల అభ్యర్థులకు నష్టం జరగడంతోపాటు న్యాయపరమైన చిక్కులతో నియామక ప్రక్రియ ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా మహిళా, స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్ మెన్, ఎన్​సీసీ కోటాల రిజర్వేషన్లను సమాంతరంగా అమలు చేయాలి. సుప్రీంకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకొని ఉద్యోగ నియామకాల్లో పోస్ట్ బేస్డ్​ రోస్టర్ విధానాన్ని ప్రవేశ పెట్టేలా ఉత్తర్వులు జారీ చేసి అమలు చేయాలి. 

రాష్ట్రంలో ప్రస్తుతం ఉద్యోగాల భర్తీకి అమలు చేస్తున్న100 పాయింట్ల రోస్టర్ విధానం పూర్తిగా అశాస్త్రీయమైనది. ఉదాహరణకు ప్రకటించిన 503 గ్రూప్-1 పోస్టులను గమనిస్తే10 శాతం రిజర్వేషన్లు కలిగిన ఈడబ్ల్యూఎస్ వారికి 43 పోస్టులను కేటాయించారు. అదే10 శాతం రిజర్వేషన్లు కలిగిన బీసీ ‘-బి’ అభ్యర్థులకు 31 పోస్టులు,7 శాతం రిజర్వేషన్లు ఉన్న బీసీ‘-డి’ అభ్యర్థులకు 21 పోస్టులను మాత్రమే కేటాయించారు. ఫలితంగా ఓవరాల్​గా బీసీ రిజర్వేషన్లు తగ్గాయి. అలా కాకుండా కేంద్ర ప్రభుత్వం1997 నుంచి అమలు చేస్తున్న పోస్ట్​ బేస్డ్ విధానం రాష్ట్రంలో అమలు చేస్తే ఎవరికీ అన్యాయం జరగడదు. ఉదాహరణకు ప్రభుత్వం 25 పోస్టులను భర్తీ చేయాలనుకుంటే పోస్ట్​ బేస్డ్​ విధానంలో జనరల్-అభ్యర్థులకు 12 పోస్టులు, బీసీ-‘ఎ’కు 2, బీసీ‘-బి’ 2, బీసీ‘-డి’ 1, ఎస్సీ ‘3’, ఎస్టీ ‘1’, ఈడబ్ల్యూఎస్ వారికి 2 పోస్టులు వస్తాయి. ఈవిధానంలో వందల సంఖ్యలో పోస్టులను భర్తీ చేసినా ఎవరికి దక్కాల్సిన పోస్టుల వాటా వారికే దక్కుతుంది. 

మహిళా అభ్యర్థుల సంఖ్య 33.33 శాతం దాటుతోందా?

వర్టికల్ రిజర్వేషన్లు ఆర్టికల్15(4), 15(5), 16(4) ద్వారా కల్పిస్తున్నవి కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు జనరల్ కేటగిరీ పోస్టులకు, వారికి కేటాయించిన రిజర్వేషన్ పోస్టులకు పోటీపడొచ్చు. ఫలితంగా వారికి కేటాయించిన రిజర్వేషన్ శాతానికి మించి ఎంపిక కావచ్చు. అదే సమాంతర రిజర్వేషన్లలో మహిళలకు 33.33 శాతం రిజర్వేషన్లు ఆర్టికల్15(3) ద్వారా కల్పిస్తున్నారు. కాబట్టి మహిళలు జనరల్ కేటగిరీ పోస్టుల్లో లేదా వారికి కేటాయించిన కోటాలో ఎంపికైనప్పటికీ, మొత్తం ఎంపికైన మహిళా అభ్యర్థుల సంఖ్య 33.33 శాతానికి మించకూడదు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టుతో పాటు, తెలంగాణ హైకోర్టు పలు కేసుల తీర్పుల సందర్భంగా స్పందిస్తూ.. మహిళా రిజర్వేషన్లను సమాంతరంగా అమలు చేయాలని పేర్కొన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1997లో 65 జీవో ద్వారా మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, వికలాంగులు, స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్ మెన్, ఎన్​సీసీ రిజర్వేషన్లను ఉద్యోగ నియామకాల్లో అమలుపై100 పాయింట్ల రోస్టరును నిర్ధారించింది. అన్ని రిజర్వేషన్లను కూడా నిలువుగా అమలు చేయాలనే భావం వచ్చేలా ప్రకటించింది. అప్పటి నుంచి నేటి వరకు తెలంగాణాలోనూ అదే విధానం కొనసాగుతోంది. కానీ, మెడికల్ సీట్ల భర్తీలో మాత్రం మొదటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు మహిళా, వికలాంగులు, స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్ మెన్, ఎన్​సీసీ కోటాలను సమాంతరంగా అమలు చేస్తున్నాయి. వివిధ సంఘాల విజ్ఞప్తి, కోర్టు తీర్పులను పరిగణనలోనికి తీసుకొని తప్పుని గ్రహించి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర విభజన తర్వాత, 2016లో 40 జీవో, 2018లో 63 జీవోలు జారీ చేస్తూ మహిళా రిజర్వేషన్లను ఉద్యోగ నియామకాల్లో సమాంతరంగా అమలు చేయాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో విద్యా సంస్థల సీట్ల భర్తీలో ప్రత్యేకంగా మహిళలకు ఎలాంటి కోటా లేదు. అయినప్పటికీ సమాంతర కోటాకు సంబంధించిన స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ తదితర కోటాలను సమాంతరంగా అమలు చేస్తున్నారు.

సమాంతరంగా అమలు చేయాలె

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 503 గ్రూప్-1 ఉద్యోగాల కేటాయింపులను గమనిస్తే.. బీసీ‘-ఎ’ జనరల్15 (41%), బీసీ‘-ఎ’ మహిళ 22(59%), బీసీ‘-బి’ జనరల్ 15(46%), బీసీ‘-బి’ మహిళ17(54%), బీసీ‘డి’ జనరల్ 9(43%), బీసీ‘-డి’ మహిళ12(57%), బీసి‘-ఈ’ జనరల్ 4(29%), బీసీ-‘ఈ’ మహిళ10(71%), ఎస్సీ జనరల్ 43(54%), ఎస్సీ మహిళ 38(46%), ఎస్టీ జనరల్ 12(39%), ఎస్టీ మహిళలకు19(61%) పోస్టులను కేటాయించారు. వాస్తవానికి మహిళా రిజర్వేషన్లను 33.33 శాతం సమాంతరంగా అమలు చేయాల్సింది పోయి, ఇలా సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులకు విరుద్ధంగా అమలు చేయడం వల్ల న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నమవుతాయి. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాల్లో 1997 వరకు వేకెన్సీ బేస్డ్ రోస్టర్ విధానాన్ని అమలు చేసింది. కానీ, 1995లో సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం ఆర్.కే సబర్వాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు తీర్పులో వేకెన్సీ బేస్డ్ రోస్టర్ విధానం అశాస్త్రీయమైనదని కొట్టేసింది. ఆ తర్వాతే పోస్ట్ బేస్డ్ రోస్టర్ పద్ధతి వచ్చింది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో పోస్టుల సంఖ్యతో సంబంధం లేకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను పకడ్బందీగా అమలు చేస్తోంది. రాష్ట్రంలో మహిళా కోటాను నిలువుగా అమలు చేయడం వల్ల ఉద్యోగాలు రాలేదని పదుల సంఖ్యలో పురుష అభ్యర్థులు కేసులు వేశారు. ఇలాంటి న్యాయపరమైన అంశాలపై సకాలంలో ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోకపోవడంవల్ల ఉద్యోగ నియామకాల భర్తీలో సమయం వృథా అవుతోంది. 

మహిళా కోటా రిజర్వేషన్లు

రిజర్వేషన్లకు సంబంధించి మహిళ కోటాను సమాంతరంగా/ హారిజంటల్​గా అమలు చేయాలని హైకోర్టులో పలు కేసులు దాఖలయ్యాయి. అవి ఇంకా విచారణలో ఉండగానే ప్రభుత్వం పాత పద్ధతిలోనే ఉద్యోగ నియామక ప్రకటనలు జారీ చేస్తున్నది. ఫలితంగా న్యాయ సమస్యలు తలెత్తి ఉద్యోగ నియామకాల ప్రక్రియ ఆలస్యం అయ్యే ప్రమాదం ఉంది. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులకు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా మహిళా, స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్​మెన్ రిజర్వేషన్లను నిలువుగా/వర్టికల్​గా అమలు చేస్తూ.. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు చేపడుతున్నారు. దీంతోపాటు రాష్ట్రంలో అమలు చేస్తున్న 100 పాయింట్ల రోస్టర్ విధానం కూడా అశాస్త్రీయమైనదే. 1997 వరకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాల్లో అమలు చేసిన వేకెన్సీ బేస్డ్ రోస్టర్ విధానం అశాస్త్రీయమైనదని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో వెల్లడించింది. దీంతో పోస్ట్ బేస్డ్ రోస్టర్​ విధానం అమల్లోకి వచ్చింది. దేశంలో విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో కల్పిస్తున్న రిజర్వేషన్లను ప్రధానంగా రెండు రకాలుగా విభజించవచ్చు. అందులో మొదటిది నిలువు/సామాజిక రిజర్వేషన్లు, రెండవది సమాంతర/ప్రత్యేక రిజర్వేషన్లు. నిలువు రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు వస్తారు. సమాంతర రిజర్వేషన్లలో మహిళా, ఎన్ సీసీ,  స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ రిజర్వేషన్ల అభ్యర్థులు వస్తారు. సుప్రీం కోర్టు 2013లో యూనియన్ ఆఫ్ ఇండియా వెర్సెస్ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ బ్లైండ్, 2020లో సిద్దరాజు వెర్సెస్ స్టేట్ ఆఫ్ కర్నాటక కేసుల తీర్పుల్లో వికలాంగుల రిజర్వేషన్లను కూడా నిలువుగా అమలు చేయాలని సూచన ప్రాయంగా తెలిపింది. కానీ, సమాంతర/ప్రత్యేక కోటా కింద కల్పించిన మహిళా రిజర్వేషన్లను తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ నియామకాల్లో నిలువుగా అమలు చేస్తోంది.
- కోడెపాక కుమార స్వామి రాష్ట్ర అధ్యక్షుడు, విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం