- నిరాశలో పలువురు మాజీ కార్పొరేటర్లకు, లీడర్లు
- సొంత డివిజన్లలో కలిసిరాక పొరుగు డివిజన్లపై మరికొందరి దృష్టి
- భర్తకు అనుకూలించని చోట భార్య, తల్లిని నిలబెట్టే యోచన
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డివిజన్లలో మారిన రిజర్వేషన్లు కొందరు మాజీ కార్పొరేటర్లు, కొందరు లీడర్లకు షాక్ ఇచ్చాయి. కార్పొరేటర్లుగా పోటీ చేయాలనుకుని ఎదురుచూస్తున్న సెకండ్ క్యాడర్ లీడర్ల ఆశలపై నీళ్లు చల్లాయి. సొంత డివిజన్లలో రిజర్వేషన్ కలిసిరాకపోవడంతో పొరుగు డివిజన్లపై దృష్టి పెడుతున్నారు.
ఎన్నికల్లో గెలిస్తే మేయర్ అయ్యే చాన్స్ ఉన్న బీసీ లీడర్లు.. ఇతర డివిజన్ల నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. జనరల్ కేటగిరీ కాకుండా మహిళకు కేటాయించిన డివిజన్లలో లీడర్లు తమ భార్య లేదా తల్లిని పోటీ చేయించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు కరీంనగర్ మేయర్ పీఠం ఈసారి జనరల్ లేదా జనరల్ మహిళ అవుతుందని, తాము మేయర్ అవ్వొచ్చని కలలు కన్నవారికి కల్లలయ్యాయి.
ఆశావహులకు అడ్డొచ్చిన రిజర్వేషన్లు..
గతంలో కార్పొరేటర్‌గా ఎడ్ల సరిత, అశోక్(బీసీ) దంపతులు రెండుసార్లు చొప్పున నాలుగుసార్లు పనిచేశారు. ఈ డివిజన్ ఈసారి ఎస్సీ అవడంతో ఆ డివిజన్‌లో పోటీ చేసే పరిస్థితి లేదు. వాల రమణారావు(ఓసీ) కార్పొరేటర్‌గా ఉన్న డివిజన్ బీసీ వచ్చింది. అలాగే దిండిగాల మహేశ్(బీసీ) డివిజన్ మహిళకు రిజర్వ్ కావడంతో అతని భార్య(ప్రభుత్వ ఉద్యోగి)ను కూడా పోటీ చేయించే పరిస్థితి లేదు. 56వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్‌గా అనూప్ కొనసాగగా.. ఈ సారి ఆ డివిజన్ జనరల్ మహిళ అయింది. దీంతో అనూప్ భార్యను కావ్యను పోటీలో నిలిపేందుకు యత్నిస్తున్నారు.
ఇదే డివిజన్ నుంచి గతంలో కార్పొరేటర్‌గా పనిచేసిన తాటి ప్రభావతి మరోసారి పోటీలో ఉండబోతున్నట్లు తెలిసింది. అలాగే సీపీఐ అభ్యర్థిగా 57వ డివిజన్ నుంచి కసిరెడ్డి మణికంఠరెడ్డి గతంలో పోటీ చేశారు. ఈసారి జనరల్ మహిళ కావడంతో తన తల్లి లతశ్రీని పోటీ చేయించబోతున్నారు. 9వ డివిజన్ నుంచి మాజీ కార్పొరేటర్ పడిశెట్టి భూమయ్య పోటీ చేయాలని భావించినప్పటికీ.. ఆ డివిజన్ జనరల్ మహిళకు కేటాయించడంతో తన భార్య వసంతలక్ష్మీని పోటీ చేయించేందుకు రెడీ అయ్యారు.
టికెట్ల కోసం దరఖాస్తులు..
కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతోపాటు కొన్ని డివిజన్లలో ఎంఐఎం టికెట్లకు ప్రధానంగా పోటీ నెలకొంది. గతంలో ఏడుగురు కార్పొరేటర్లను కలిగి ఉన్న ఎంఐఎం టికెట్ కోసం 140 మంది వరకు దరఖాస్తు చేస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ కార్పొరేటర్ టికెట్ల కోసం డీసీసీ ఆఫీసులో నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 66 మంది బీఆర్ఎస్ అభ్యర్థులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గుర్తించి టికెట్లు ఇవ్వనున్నారు. బీజేపీ టికెట్లు కేటాయింపు కోసం ఆ పార్టీ ఇప్పటికే రెండుసార్లు సర్వే చేయించినట్లు సమాచారం. బీజేపీ టికెట్ల కేటాయింపులో కేంద్ర మంత్రి బండి సంజయ్‌దే తుది నిర్ణయంగా తెలుస్తోంది.
