రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదు

V6 Velugu Posted on Jun 11, 2020

  • ఆర్టికల్​32 ప్రాథమిక హక్కులకు సంబంధించింది
  • దాని కింద రిజర్వేషన్ల అంశాన్ని విచారించలేం
  • తమిళనాడులో మెడికల్​ సీట్ల ఓబీసీ కోటా అంశంలో సుప్రీం

న్యూఢిల్లీ: రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదని, ప్రస్తుతం ఉన్న చట్టాలు అదే చెపుతున్నాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తమిళనాడు మెడికల్​కాలేజీల్లో ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ కామెంట్​ చేసింది. తమిళనాడులోని మెడికల్, డెంటల్​ కాలేజీల్లో ఆల్ ఇండియా కోటాలో ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడం లేదంటూ సీపీఐ, డీఎంకే సహా పలు పార్టీల నేతలు సుప్రీంకోర్టులో పలు పిటిషన్లను దాఖలు చేశారు. గురువారం ఈ పిటిషన్లను జస్టిస్​ ఎల్.నాగేశ్వరరావు ఆధ్వర్యంలోని బెంచ్​ విచారించింది.

ఆర్టికల్​ 32 వర్తించదు..

తమిళనాడులో ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలకు 69 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారని, ఇందులో ఓబీసీలకు 50 శాతం కేటాయించారని పిటిషనర్లు కోర్టుకు చెప్పారు. 2020–21 సంవత్సరానికిగానూ కేంద్ర ప్రభుత్వ ఇన్​స్టిట్యూట్లు మినహా మిగతా మెడికల్, డెంటల్​ కాలేజీల్లో పీజీ, డిగ్రీ కోర్సుల్లో ఆలిండియా కోటా కింద ఓబీసీలకు కచ్చితంగా 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఓబీసీ క్యాండిడేట్లకు అడ్మిషన్లు నిరాకరించడం వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని, అందువల్ల రిజర్వేషన్లు కల్పించే వరకూ నీట్​ కౌన్సెలింగ్​పై స్టే విధించాలని విజ్ఞప్తి చేశారు. పిటిషనర్ల వాదనతో బెంచ్​ సంతృప్తి చెందలేదు. ఆర్టికల్​32 అనేది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు సంబంధించినదని, దాని కింద రిజర్వేషన్ల పిటిషన్లను విచారించలేమని స్పష్టం చేసింది. రిజర్వేషన్లను ప్రాథమిక హక్కుగా ఎవరూ చెప్పలేరని, రిజర్వేషన్లు కల్పించకపోవడాన్ని రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన కింద పరిగణించలేమని బెంచ్​ స్పష్టం చేసింది. తమిళనాడు ప్రజల ప్రాథమిక హక్కుల విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ఒకే తాటిపైకి రావడం ఆహ్వానించదగినదని, అయితే రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదని, అందువల్ల ఈ పిటిషన్లను అనుమతించలేమని స్పష్టం చేసింది. పిటిషన్లను వెనక్కి తీసుకునేందుకు అనుమతిచ్చిన కోర్టు.. రిజర్వేషన్ల చట్టాల ఉల్లంఘనపై మద్రాస్​ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషన్లకు సూచించింది.

మహారాష్ట్ర సర్కారుకు సుప్రీం నోటీసులు

మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో సాధువుల హత్యపై సీబీఐ, ఎన్ఐఏతో వేర్వేరుగా దర్యాప్తు జరిపించాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణకు అనుమతించింది. ఈ పిటిషన్లపై స్పందన తెలియజేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్​ అశోక్​ భూషణ్ ఆధ్వర్యంలోని బెంచ్.. మహారాష్ట్ర సర్కారు, ఆ రాష్ట్ర డీజీపీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జులై రెండో వారానికి వాయిదా వేసింది. ఏప్రిల్​లో పాల్ఘర్​ ప్రాంతంలో ఇద్దరు సాధువులతో పాటు వారి డ్రైవర్‌ను దుండగులు హత్య చేశారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. ఈ కేసుకు సంబంధించి వంద మందికిపైగా పోలీసులు అరెస్ట్​ చేశారు

Reservation not fundamental right: Supreme Court on Tamil Nadu medical colleges

Tagged supreme court, Tamil Nadu, reservation, medical colleges, fundamental right

Latest Videos

Subscribe Now

More News