అయ్యప్ప భక్తులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. భక్తులు ఇరుముడితో విమానం ఎక్కేందుకు అనుమతించింది. శబరిమల అయ్యప్ప యాత్రలో భాగంగా టెంకాయతో సహా ఇరుముడిని క్యాబిన్ లోకి తీసుకెళ్లేందుకు వెసులు బాటు కల్పించింది. ఈ నిర్ణయం ఇవాళ్టి (నవంబర్ 28) నుంచే అమలులోకి వస్తున్నట్లు కేంద్ర విమానయాన శాఖ ప్రకటించింది.
భద్రతా కారణాలతో అయ్యప్ప భక్తుల టెంకాయతో సహా ఇరుముడిని ఇప్పటి వరకు చెకిన్ లగేజీ గా పంపుతున్నారు విమానయాన శాఖ అధికారులు. దీంతో అయ్యప్ప స్వాములకు అసౌకర్యంగా ఉన్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. దీంతో అయ్యప్ప స్వాముల ఇరుముడి విషయంలో భద్రతా అధికారులు సహకరించాలని కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదేశించారు.
అయ్యప్ప భక్తులకు ఇరుముడి విషయంలో వెసులు బాటు కల్పించేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మండల పూజల కాలం నుంచి మకర విలక్కు వరకు టెంకాయతో పాటు ఇరుముడిని విమాన ప్రయాణంలో క్యాబిన్ లోకి అనుమతించనున్నారు.
శబరిమల పవిత్ర యాత్రలో పాల్గొనే అయ్యప్ప భక్తుల సౌలభ్యం కోసం, ఇరుముడికి ఉన్న పవిత్రత, భావోద్వేగాల్ని గౌరవిస్తూ, భక్తులు ఇరుముడి ని తమతో పాటు నేరుగా విమాన ప్రయాణంలో తీసుకెళ్లేందుకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతి ఇస్తున్నట్లు మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.
అవసరమైన అన్ని భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేస్తూనే భక్తుల సాంప్రదాయలు, ఆచారాలకు ఎటువంటి భంగం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు పౌర విమాన అధికారులు.
