- రోడ్డుపై బైఠాయించిన పేరెంట్స్
లింగాల, వెలుగు: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల అడ్మిషన్ టెస్ట్‌లో ఎగ్జామ్ పేపర్ మారడంతో గందరగోళం నెలకొంది. నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ బాయ్స్ స్కూల్లో సోమవారం ఏడవ తరగతి ప్రవేశ పరీక్ష నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు పరీక్ష కేంద్రానికి వచ్చారు.
ఉదయం 11 గంటలకు ఎగ్జామ్ స్టార్ట్ కావాల్సి ఉండగా, 510 విద్యార్థులకు గాను 252 ప్రశ్నాపత్రాలు మాత్రమే ఉంగడా, మిగిలినవి ఎనిమిదో తరగతివి ఉన్నట్లు నిర్వాహకులు గుర్తించారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.
అప్రమత్తమైన ఆఫీసర్లు మరో సెంటర్ నుంచి ప్రశ్నాపత్రాలను తెప్పించి పరీక్షను యథావిధిగా రాయించారు. 11 గంటల నుంచి ఒంటి గంట వరకు ఎగ్జామ్ జరగాల్సి ఉండగా, పిల్లలు ఎంతకు బయటకు రాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఎగ్జామ్ సెంటర్లో ఏం జరుగుతుందో తెలియక పేరెంట్స్ స్కూల్ గేట్ ముందు బైఠాయించారు. సెకండ్ మల్టీ జోన్ సెక్రటరీ నిర్మల ధర్నా చేస్తున్న వారికి నచ్చజెప్పి శాంతింపజేశారు. మధ్యాహ్నం1:30 నుంచి 3: 30 వరకు పరీక్ష ఉంటుందని ఆందోళనకు గురి కావద్దని సూచించారు. విద్యార్థులకు స్నాక్స్ ఇచ్చామని, పరీక్ష అనంతరం భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 510 మంది విద్యార్థులకు గాను 483 మంది హాజరైనట్లు ఆమె తెలిపారు.
గద్వాలలోనూ..
గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం ర్యాలంపాడు గురుకుల స్కూల్లో ఆదివారం జరిగిన ఆరవ తరగతి గురుకుల ఎంట్రన్స్ లోనూ పేపర్ తారుమారైంది. జిల్లాలోని 400 మంది స్టూడెంట్స్ దరఖాస్తు చేసుకోగా, ర్యాలంపాడు గురుకుల స్కూల్ ను ఎగ్జామ్ సెంటర్ గా వేశారు. ఉదయం11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎగ్జామ్ నిర్వహించాల్సి ఉంది.
పరీక్ష ప్రారంభమయ్యే సమయంలో ఆరవ తరగతి బదులుగా ఐదవ తరగతి పేపర్ వచ్చినట్లు గుర్తించారు. ఎగ్జామ్ టైం అయిపోయినా స్టూడెంట్స్ బయటకు రాకపోవడంతో పేరెంట్స్ ఆందోళనకు దిగారు. ఎగ్జామ్ పేపర్ తారుమారైందని అధికారులు తెలపడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. సీఐ శీను, ఎస్సైలు అక్కడికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. మధ్యాహ్నం 3:45 ప్రారంభమైన ఎగ్జామ్ 5:45కు ముగిసింది.
