
- ఇప్పటికే మైనార్టీ గురుకులాల్లో మొదలు
- టీచర్లకు, స్టూడెంట్లకు ప్రయోజనకరంగా మారనున్న కొత్త విధానం
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఇప్పటికే అమలవుతున్న కామన్ మెనూ మాదిరిగానే కామన్ టైంటేబుల్ తీసుకురావాలని సర్కార్ భావిస్తోంది. రాష్ట్రంలోని 205 మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీల్లో గత నెల 17 నుంచే ఈ విధానం అమలవుతోంది. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, మహాత్మా జ్యోతిబా పూలే (బీసీ), టీఎస్ఆర్ఎస్‌కు సంబంధించిన 822 గురుకులాల్లో కూడా ఇదే టైంటేబుల్‌ను అమలు చేసేందుకు సర్కార్ ఆలోచన చేస్తోంది.
ఈ విధానం అమలు చేసే విషయంపై ఆయా సొసైటీల సెక్రటరీలు త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, పాత, కొత్త టైంటేబుల్స్ మధ్య చాలా తేడాలు ఉన్నాయని, కొత్త విధానం అమల్లోకి వస్తే అటు స్టూడెంట్లు, ఇటు టీచర్లకు ప్రయోజనకరంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మారనున్న బ్రేక్ ఫాస్ట్ టైమింగ్
పాత టైం టేబుల్ ప్రకారం గురుకులాల్లో ఉదయం 7 గంటల నుంచి 7.45 మధ్య బ్రేక్ ఫాస్ట్ పెడుతున్నారు. అయితే అంత పొద్దునే టిఫిన్ రెడీ చేయించడం ప్రిన్సిపాల్స్, వార్డెన్లకు కష్టంగా ఉండేది. దీంతో ఒకటి, రెండు రకాలతోనే బ్రేక్‌ఫాస్ట్‌ను కానిచ్చేవాళ్లు. ఇప్పుడు కొత్త టైం టేబుల్ అమల్లోకి వస్తే ఉదయం 8.15 గంట నుంచి 9 గంటల వరకు బ్రేక్‌ఫాస్ట్, మిల్క్విత్ బూస్ట్ లేదా రాగి జావ అందించనున్నారు.
ఇదే సమయంలో లైఫ్ సేవింగ్ గ్రూప్ పేరుతో పావు గంట పాటు మీటింగ్ నిర్వహించనున్నారు. స్టాఫ్ నర్స్, పీఈటీ, రాత్రి డ్యూటీలో ఉండే స్టాఫ్, స్టూడెంట్ హెల్త్ లీడర్స్ ఆధ్వర్యంలో ఈ ప్రొగ్రామ్ జరుగనుంది.వీటిని ప్రీ క్లాస్ రూమ్ యాక్టివిటీస్‌గా పిలవనున్నారు. కొత్త టైంటేబుల్ అమల్లోకి వస్తే స్టూడెంట్లు కోరుకునే విధంగా, ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం టిఫిన్లు తయారు చేయించే అవకాశం కలుగుతుందని అంటున్నారు.
రెస్ట్ లేని క్లాసుల నుంచి విముక్తి
పాత టైం టేబుల్ ప్రకారం ఉదయం 8.15 నుంచి మధ్యాహ్నం 11.15 వరకు వరుసగా నాలుగు పీరియడ్లు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు పది నిమిషాలు కూడా రెస్ట్ తీసుకోకుండా ఏకబిగిన మూడు గంటల పాటు క్లాస్‌లు వినాల్సి వచ్చేది. 11.15 తర్వాత పది నిమిషాలు బ్రేక్ ఇచ్చి తర్వాత 40 నిమిషాల చొప్పున మరో గంటన్నర పాటు అంటే 12.45 వరకు మరో రెండు పీరియడ్లు తీసుకునేవాళ్లు. లంచ్‌లోపే ఆరు పీరియడ్ లు పూర్తి చేసేవారు. ఈ విధానం వల్ల స్టూడెంట్ల ఏకాగ్రత దెబ్బతింటోంది.
కొత్త టైంటేబుల్ ప్రకారం ఈ పద్ధతిని మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొత్త విధానంలో ఉదయం 9.15 నుంచి క్లాసులు స్టార్ట్ కానున్నాయి. 10 గంటల వరకు ఫస్ట్ పీరియడ్, 10 నుంచి 10.45 వరకు సెకండ్ పీరియడ్ నిర్వహించిన తర్వాత పావు గంట బ్రేక్ ఇస్తారు. మళ్లీ 11 గంటల నుంచి 11.45 గంటల వరకు థర్డ్, 11.45 నుంచి 12.30 వరకు ఫోర్త్ పీరియడ్
నిర్వహించనున్నారు.
విద్యార్థులందరికీ ఒకేసారి లంచ్
కొత్త టైం టేబుల్ ప్రకారం మధ్యాహ్నం12.30 నుంచి 1.30 వరకు గంట పాటు లంచ్ ఉంటుంది. పాత టైంటేబుల్ ప్రకారం... కొన్ని తరగతుల వారికి లంచ్ పెట్టే టైంలో మరికొన్ని తరగతుల వారికి క్లాస్‌లు చెప్పేవారు. పాత విధానంలో 5, 6, 7 తరగతి చదివే స్టూడెంట్లకు మధ్యాహ్నం 12.45 నుంచి 1.30 వరకు లంచ్ టైం ఉంటే, ఆ సమయంలో 8 నుంచి ఆ పైతరగతి వాళ్లకు క్లాస్‌లు చెప్పేవారు. వీరికి మధ్యాహ్నం 1.25 నుంచి 2.15 వరకు లంచ్ టైం ఉంటే, ఆ సమయంలో కింది తరగతుల స్టూడెంట్లకు క్లాసులు జరిగేవి.
ఇప్పుడు ఈ విధానం పూర్తిగా మారనుంది. కొత్త టైంటేబుల్ ప్రకారం.. అన్ని తరగతుల స్టూడెంట్లందరికీ ఒకేసారి మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 వరకు గంట పాటు లంచ్ ఉంటుంది. ఆ తర్వాత 1.30 నుంచి 2.15 వరకు ఐదో పీరియడ్, 2.15 గంటల నుంచి 3 గంటల వరకు ఆరో పీరియడ్, 3 నుంచి 3.45 గంటల వరకు ఏడో పీరియడ్ నిర్వహించనున్నారు. పాత విధానంలో మధ్యాహ్నం 2.15 నుంచి 4.30 వరకు వరకు స్టడీ అవర్ లేదా క్లబ్ యాక్టివిటీస్, ప్రాజెక్ట్ వర్క్, కోకరిక్యులర్ యాక్టివిటీస్ నిర్వహించి ఆ తర్వాత పావు గంట స్నాక్స్ కోసం కేటాయించేవారు.
కానీ కొత్త విధానంలో 3.45 నుంచి పోస్ట్ క్లాస్‌రూమ్ యాక్టివిటీస్ ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 4.30 వరకు స్టడీ అవర్ లేదా క్లబ్ యాక్టివిటీస్, ప్రాజెక్ట్ వర్క్, కోకరిక్యులర్ యాక్టివిటీస్ నిర్వహిస్తారు. పాత పద్ధతిలో సాయంత్రం 6.15 నుంచి రాత్రి 7 గంటల వరకు డిన్నర్ ఉంటే.. కొత్త టైం టేబుల్‌లో రాత్రి 7.30 నుంచి 8.30 వరకు డిన్నర్‌ను కంప్లీట్ చేయనున్నారు.