
తమకు న్యాయం చేయాలని కోరుతూ కరీంనగర్ జిల్లా రామడుగు మండల తహశీల్దార్ ఆఫీస్ ముందు దేశ్ రాజ్ పల్లి నిర్వాసితులు ధర్నా చేశారు. అనంతరం ఎమ్మార్వోకు వినతి పత్రం అందజేశారు. రైల్వే లైన్ కింద ఇండ్లు కోల్పోయిన తమకు గ్రామంలో కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని తిరిగి ఇతరులకు కేటాయించే ప్రక్రియ ఆపాలని డిమాండ్ చేశారు. తమ తరపున మాట్లాడేందుకు వచ్చిన సర్పంచ్ రమేశ్ పై అక్రమ కేసులు పెట్టడాన్ని తప్పుబట్టారు. సర్పంచ్ పై నమోదైన కేసులు ఎత్తివేయాలని విన్నవించారు. ప్రభుత్వ స్థలంలో తమకు ఇండ్లు కట్టుకునే అవకాశం ఇవ్వాలని నిర్వాసితులు విజ్ఞప్తి చేశారు.
ఇండ్లు కట్టుకునేందుకు తమకు కేటాయించిన స్థలంలో వేరే వాళ్లకు కేటాయించడంపై రైల్వే బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆర్డీవోకు వినతిపత్రం అందజేశామని తెలిపారు. తమకు న్యాయం చేస్తారని ఆయన హామీ ఇచ్చారని చెప్పారు. ఇప్పుడు తమను కాదని..ఇతరులు వచ్చి ప్రభుత్వ స్థలంలో టెంట్లు వేసి భూమిని చదును చేయడంపై మండిపడ్డారు. ఈ విషయంపై ఎమ్మార్వో తగిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని నిర్వాసితులు కోరుతున్నారు.