వేములవాడలో రోడ్డెక్కిన మిడ్ మానేరు నిర్వాసితులు

వేములవాడలో రోడ్డెక్కిన మిడ్ మానేరు నిర్వాసితులు

వేములవాడ, వెలుగు: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మిడ్ మానేరు నిర్వాసితులు రోడ్డెక్కారు. 2015 జూన్ 18న వేములవాడ రాజన్న సాక్షిగా నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం రూ.5 లక్షల 4 వేలు ఇస్తానన్న సీఎం కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు. ఈ హామీ నెరవేర్చాలని, సరైన పరిహారం చెల్లించాలని, ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం వేములవాడ నంది కమాన్ వద్ద మహాధర్నా చేపట్టారు. అయితే ధర్నాకు పర్మిషన్ లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. అక్కడికి వచ్చినోళ్లను వచ్చినట్టు అరెస్టు చేశారు. నిర్వాసితులను బలవంతంగా ఈడ్చుకెళ్లి వాహనాల్లో వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు 300 మందిని అదుపులోకి తీసుకున్నారు. నంది కమాన్ వద్ద అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీలు నాగేంద్రచారి, చంద్రశేఖర్, సీఐలు వెంకటేశ్, బన్సీలాల్ ఆధ్వర్యంలో దాదాపు 200 మంది పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. నంది కమాన్ తో పాటు నిర్వాసిత గ్రామాలైన బోయినిపల్లి మండలం కొదురుపాక, నాంపల్లి, తిప్పపూర్, సంకెపల్లి, అగ్రహారంలలో నిర్వాసితులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఆయా గ్రామాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిర్వాసితులను అదుపులోకి తీసుకున్నారు. నిర్వాసితులు ఒకేసారి రాకుండా, గుంపులు గుంపులుగా వచ్చారు. కొంతమంది పోలీసులను తప్పించుకొని నంది కమాన్ వద్దకు చేరుకోగా, పోలీసులు వెంటనే వారిని అరెస్టు చేశారు. కాగా, నిర్వాసితులు బోయినిపల్లి మండలం నీలోజిపల్లి గ్రామ పంచాయతీకి తాళం వేసి నిరసన తెలిపారు. 

బీజేపీ, కాంగ్రెస్ నేతల అరెస్టు.. 
ధర్నాకు సంఘీభావం ప్రకటించిన కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణను పోలీసులు ముందుగానే  హౌస్ అరెస్టు చేశారు. ధర్నాలో పాల్గొనేందుకు వస్తున్న మిడ్ మానేరు నిర్వాసితుల ఐక్య వేదిక అధ్యక్షుడు కూస రవీందర్ ను అనుపురం వద్ద, బీజేపీ నేత ఎర్రం మహేశ్ ను నంది కమాన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ నేతలు పొన్నం ప్రభాకర్, కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం తదితరులను వేములవాడ మూల వాగు బ్రిడ్జి వద్ద అరెస్టు చేశారు. ఈ టైమ్ లో కాంగ్రెస్ నేత నాగి శేఖర్ కు స్వల్ప గాయాలయ్యాయి. రాష్ట్రంలో రాచరిక పాలన కొనసాగుతోందని పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. సీఎం నిర్వాసితులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కొండపోచమ్మ, రంగనాయక సాగర్ నిర్వాసితులకు ఒక న్యాయం.. మిడ్ మానేరు నిర్వాసితులకు మరొక న్యాయమా? అని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. అనంతగిరి ప్రాజెక్టులో భాగంగా ఇచ్చిన విధంగా  రూ.5  లక్షల పరిహారంతో పాటు భూమి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులను ప్రభుత్వం చులకనగా చూస్తోందని ప్రతాప రామకృష్ణ ఫైర్ అయ్యారు. కాగా, అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్​ను అఖిలపక్ష నేతలు కలిశారు. సమస్యల పరిష్కారం కోసం మంత్రి కేటీఆర్ తో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. 

నిర్వాసితులకు అండగా ఉంటాం: రేవంత్ 
నిర్వాసితులపై పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ట్వీట్ చేశారు. కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని, ఆర్అండ్ ఆర్ ప్యాకేజీతో పాటు నిర్వాసితులందరికీ డబుల్​ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలన్నారు. నిర్వాసితులకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు.

నిర్వాసితుల అరెస్టు దుర్మార్గం: బండి సంజయ్ 
ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేసిన నిర్వాసితులను అరెస్టు చేయడం దుర్మార్గమని బీజేపీ స్టేట్ చీఫ్ సంజయ్ మండిపడ్డారు. నిర్వాసితులు, బీజేపీ నేతల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటనలో పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని ఫైర్ అయ్యారు. బాధితుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని, అరెస్టు చేసినోళ్లను విడుదల చేయాలని.. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.