నీరు లేదు.. రోడ్డు లేదు.. బిందెలతో కిలోమీటర్ల నడక

నీరు లేదు.. రోడ్డు లేదు.. బిందెలతో కిలోమీటర్ల నడక

మనిషి నిత్యావసరాలలో నీరు ఒకటి. నీరు లేకపోతే సకల జీవరాశుల మనుగడ కష్టం. మనిషి ఆహారం లేకపోయినా కొన్ని రోజుల పాటు ఉండగలడు, కానీ నీరు లేకపోతే మాత్రం ఉండలేడు. అటువంటి నీరు దొరకక.. ఓ గ్రామం మొత్తం అల్లాడుతోంది. బోరుబావులు కాదు కదా.. కనీసం చేతిపంపులు కూడా లేకపోవడంతో గుంతలలో ఊరుతున్న కలుషిత నీటిని తాగి బతుకెళ్లదీస్తున్నారు. 

ఛత్తీస్‌గఢ్ లోని బలరాంపూర్ జిల్లా, సన్మంద్ర గ్రామంలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. గ్రామంలో నీటి వసతి లేక గుంతలలో ఉబికివస్తున్న నీటిని చిన్న పాత్రలతో తోడుకొని తాగుతున్నారు. ఈ నీటి కోసం కూడా ఊరికి దూరంగా ఉన్న కొండలలో తిరగాల్సి వస్తోంది. చిన్నచిన్న పిల్లలను వీపున కట్టుకొని.. బిందెలతో ఆ ఊరి మహిళలు రాళ్లు, చెట్లు దాటుకుంటూ వెళ్తుంటే.. ఇంతకన్నా దారుణ బతుకులు ఉండవేమో అనిపించక మానదు. వీరి గ్రామానికి కనీసం సరైన మట్టి రోడ్డు కూడా లేకపోవడంతో.. వారి రోజువారీ అవసరాల కోసం రాళ్ల మార్గంలో పడుతూ.. లేస్తూ నడుస్తున్నారు.

గ్రామానికి చెందిన కొంతమంది మాట్లాడుతూ.. ‘మా గ్రామంలో మంచినీటి వసతి లేదు. మేం కలుషిత నీటిని తాగడంతో అనారోగ్యానికి గురవుతున్నాం. ఇక్కడ సరైన నీటి వసతి లేదు, రహదారి కూడా లేదు. గ్రామంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే వారిని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ఆటోలో 5 కి.మీ. గతుకుల రోడ్డులో ప్రయాణించాల్సి వస్తోంది. ఇక విద్యార్థులనైతే పాఠశాలకు వెళ్లేందుకు భుజాలపై మోసుకెళ్తున్నాం’ అని వాపోయారు.

ఈ విషయంపై ఆ జిల్లా పరిషత్ సీఈవో రీటా యాదవ్ మాట్లాడుతూ.. గ్రామంలో అవసరమైన మంచినీటి బావులు వెంటనే తవ్విస్తామని చెప్పారు. MGNREGA కింద కమ్యూనిటీ ట్యూబ్‌వెల్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఇకపోతే గ్రామ రోడ్డు అటవీశాఖ పరిధిలోకి వస్తుందని.. డీఎఫ్‌వోతో మాట్లాడి రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

For More News..

ఇంత చదువు చదివి కూలిపనా చేసేది?

మాజీ ప్రధాని పీవీని ఓడించిన ఎంపీ జంగారెడ్డి మృతి