గౌరవెల్లి పనులను అడ్డుకున్న నిర్వాసితులు

గౌరవెల్లి పనులను అడ్డుకున్న నిర్వాసితులు

సిద్దిపేట/కొహెడ, వెలుగు: గౌరవెల్లి ప్రాజెక్టు పనులను భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. పెండింగ్‌లో ఉన్న ‌పరిహారాలు ఇవ్వకుండా పనులు ఎట్లా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజక్టు వద్ద బైఠాయించారు. శుక్రవారం ఉదయం మొదలైన ఆందోళన రాత్రి వరకు కొనసాగుతూనే వుంది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లి వద్ద పదినెలల తర్వాత పోలీసు పహారాలో శుక్రవారం గౌరవెల్లి ప్రాజెక్ట్ పనులను అధికారులు ప్రారంభించారు. గౌరవెల్లి- , కుందన్ వానిపల్లి, రామవరాలకు రోడ్డు మూసివేత పనులను చేపట్టారు. భూములు, వృత్తులు కోల్పోతున్న రెండు వందల మంది ప్రాజెక్టు వద్దకు చేరుకుని ధర్నాకు దిగారు. పరిహారం జాబితాలో 40 మంది పేర్లు గల్లంతయ్యాయని, అందరికి పునరావాస ప్యాకేజీ ఇచ్చిన తర్వాతే పనులు చేపట్టాలని అన్నారు. గండిపల్లి, తెలుగుపల్లి ,మద్దనపల్లి, సోమయాజి తండా,చింతల్ తండా, గౌరవెల్లి గ్రామాల్లో ఉన్న ఇళ్లకు స్ట్రక్చర్‌‌కాంపన్సేషన్ ఇవ్వలేదన్నారు. పోలీసులు వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా.. జిల్లా కలెక్టర్ వచ్చే వరకు తాము ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. పోలీసులు వారిని ప్రాజెక్టు దగ్గర నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించగా రైతులు, ప్రజలు వారితో వాగ్వాదానికి దిగారు. త్వరలోనే పరిహారం వచ్చేలా చూస్తానని హుస్నాబాద్‌‌ ఆర్డీవో జయచంద్రారెడ్డి హామీ ఇచ్చినా వారు వినలేదు.

పరిహారం ఇవ్వకుండా.. భూములెట్ల తీసుకుంటరు

వెల్గటూర్ , వెలుగు : వెల్గటూర్ మండల కేంద్రంలో నిర్మిస్తున్న పంప్ హౌస్ కింద భూములు కోల్పోతున్న రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. తమకు పరిహారం ఇవ్వకుండా భూములు ఎట్లా తీసుకుంటరని ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా వెల్గటూరులో కాళేశ్వరం లింక్-2 పంప్ హౌస్ నిర్మాణానికి సంబంధించి అడిషనల్ కలెక్టర్ రాజేశం, ఆర్డీవో మాధురి గ్రామసభ జరిగింది. పరిహారం ఎంత ఇస్తున్నారో చెప్పాలని రైతులు కోరగా, నష్ట పరిహారం ప్రభుత్వం నిర్ణయిస్తుందని అధికారులు తెలిపారు. వానాకాలం పంటలు ఎవ్వరూ వేయొద్దని ఆదేశాలిచ్చారు. ఎంత నష్టపరిహారం ఇస్తారో చెప్పకుండా పంటలు వేయొద్దని ఎట్లా చెప్తారని వాగ్వాదానికి దిగారు. దీంతో అధికారులు మీటింగ్ ముగిసిందంటూ వెళ్లిపోయారు. పరిహారం విషయం చెప్పకుండా మీటింగ్ కు ఎందుకు పిలిచారని తహశీల్దార్ ను రైతులు నిలదీశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం