ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల. సమస్యలు పరిష్కరించాలి: ఎంపీ వంశీకృష్ణ

ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల. సమస్యలు పరిష్కరించాలి: ఎంపీ వంశీకృష్ణ
  • బకాయిలు చెల్లించి, 25 వేల మంది స్టూడెంట్ల భవిష్యత్తును కాపాడండి: పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ
  • డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి అడ్లూరికి లేఖ

పెద్దపల్లి, వెలుగు: ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు వెంటనే పరిష్కరించడంతో పాటు విద్యాపరమైన సంక్షోభంపై రాష్ట్ర సర్కార్ దృష్టి సారించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఈ విషయంపై ఎంపీ వంశీకృష్ణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు లేఖ రాశారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ కింద చదువుతున్న దాదాపు 25,000 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రభుత్వ చెల్లింపులు ఆలస్యం కావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

ప్రభుత్వం నుంచి సుమారు రూ.200 కోట్ల బకాయిలు ప్రైవేట్ పాఠశాలలకు చెల్లించాల్సి ఉందని, నిధుల చెల్లింపుల్లో ఆలస్యం వల్ల విద్యార్థులను ఆయా స్కూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరగతులకు అనుమతించకపోవడం, హెచ్చరికలు జారీ చేయడం, సదుపాయాలను నిలిపివేయడం వంటి చర్యలు తీసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పేద, వెనుకబడిన కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని, తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారన్నారు. ప్రైవేట్ స్కూళ్లకు పెండింగ్ రీయింబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లను వెంటనే విడుదల చేయాలని, విద్యార్థుల చదువుకు అంతరాయం కలగకుండా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. భవిష్యత్తులో నిధుల విడుదలకు పారదర్శకమైన విధానం రూపొందించాలని కోరారు.