అనగనగా ఒక ఊరు .. ఒకప్పుడు ఊరు..  ఇప్పుడు రిసార్ట్

 అనగనగా ఒక ఊరు .. ఒకప్పుడు ఊరు..  ఇప్పుడు రిసార్ట్

విశాలమైన పచ్చిక మైదానాలు.. చుట్టూ ద్రాక్ష తోటలు.. మధ్యలో ఓ చిన్న ఊరు. కాదు.. కాదు.. రిచెస్ట్​ రిసార్ట్​. దాని పేరు బోర్గో శాన్ ఫెలిస్. ఇటలీలలో ఉన్న ఈ రిసార్ట్​ ఎకో ఫ్రెండ్లీ ఫర్నిచర్​, హిస్టారికల్ లుక్స్​తో చాలా బాగుంటుంది. ఫుడ్, వైన్​ ఇక్కడి ప్రత్యేకతలైతే.. వాటికి మించిన ప్రశాంతత ఇక్కడ బోనస్​​. ఈ ప్రదేశం గురించి తెలిసినవాళ్లు అన్నీకలిసి వస్తే ఒక్కసారైనా వెళ్తారు. అంతేకాదు.. ఈ ఊరు పెండ్లిళ్లకు చాలా స్పెషల్​. అందుకే సినీ సెలబ్రిటీలు చాలామంది పెండ్లి చేసుకునేందుకు బోర్గోను వేదికగా చేసుకుంటున్నారు. అంతెందుకు లేటెస్ట్​గా మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిలు మ్యారేజ్​ జరిగింది కూడా ఇక్కడే. 

బోర్గో శాన్ ఫెలిస్.. ఇది మధ్యయుగం కాలం నాటి ఊరు. మరీ ముఖ్యంగా ఎనిమిదో శతాబ్దానికి చెందిన ఆనవాళ్లు ఎక్కువగా కనిపిస్తాయి. ఇరుకైన వీధులు, రోమన్ స్టయిల్​లో కట్టిన చర్చ్, వందకు పైగా హెక్టార్ల విస్తీర్ణంలో పెంచిన ద్రాక్ష తోటలతో అందంగా కనిపిస్తుంది ఈ ఊరు. ఇక్కడ తయారుచేసే వైన్​ని ‘చియాంటి క్లాసికో’ అంటారు. ఈ ఊరి స్పెషల్​ ఇది. బోర్గో టౌన్​ మధ్యలో పెద్ద ఓపెన్ ఏరియా ఉంటుంది. చిన్న చర్చి, కొంత ప్లేస్​లో గోడౌన్​లాంటి పెద్ద బిల్డింగ్​లు, వైన్ యార్డ్​లు, ఆలివ్​ చెట్లతో అందంగా కనిపిస్తుంది.

ఎటు చూసినా పచ్చిక బయళ్లు, పచ్చని చెట్లు కనిపించే ఈ ప్రదేశంలో ఉండేందుకు కొన్ని గదులు ఉంటాయి. అక్కడి నుంచి చూస్తే ప్రకృతి ఒడిలో ఒదిగిన పల్లెటూళ్లో ఉన్నామా? అనిపించడం ఖాయం. నిజానికి ఇప్పుడు దీన్ని ‘ఊరు’ అనకూడదు. ఎందుకంటే ఇప్పుటు ఇదొక పెద్ద ఫైవ్​ స్టార్ హోటల్. ఇటలీలోని క్యాజెల్​నొవొ బెరర్డెంగలో ఉంది. సియెన నుంచి ఇరవై నిమిషాల జర్నీ.  

ఖరీదుకు తగ్గ ప్రశాంతత

చెక్కతో ఏర్పాటు చేసిన బీమ్స్, తెల్లరాతి లేదా లైట్​ కలర్​ రాళ్లతో కట్టిన బిల్డింగ్స్​. ఓక్​ కలపతో వేసిన ఫ్లోరింగ్​, స్థానిక కళాకారులు వేసిన సెరామిక్ ఆర్ట్​ ప్రత్యేక ఆకర్షణలు. టుస్కన్​ స్టయిల్​లో కట్టిన ఈ రూమ్స్​ లగ్జరీగా ఉంటాయి. ఈ గదుల్లో చరిత్రను గుర్తు చేసేలాంటి డెకొరేషన్ ఉంటుంది.  బాగా ప్రైవసీ కావాలనుకునేవాళ్లకు, ఫ్యామిలీతో వచ్చేవాళ్లకు... విడిగా రెండు విల్లాలు ఉన్నాయి. వాటి పేర్లు ‘కస్సనొవ, కొలొనొవ’. ఊరు దాటగానే ఆ రెండు విల్లాలే కనిపిస్తాయి. రెండిటికీ ప్రైవేట్​ గార్డెన్స్​ ఉంటాయి. కిచెన్​తో పాటు పూల్​ వంటి లగ్జరీ సౌకర్యాలన్నీ ఉంటాయి. ఇక్కడ ఖరీదైన స్పా కూడా ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా యాంటీ ఏజింగ్​ కోసం అని ఇటలీ ప్రొడక్ట్​లు వాడతారు. అలాగే టెక్నోజిమ్ ఎక్విప్​మెంట్​తో  పెద్ద ఫిట్​నెస్​ ఏరియా కూడా ఉంది. 

వైల్డ్ ఫుడ్​

ప్రకృతి, అందాలు, ప్రశాంతతే కాదు ఇక్కడి ఫుడ్​ కూడా సూపర్​గా ఉంటుంది. పాస్తా, ట్రెడిషనల్ ఫ్లోరెంటైన్ స్టయిల్​లో చేసిన బ్రెడ్​తోపాటు నాన్ వెజ్​ వంటకాలు ఉంటాయి. వాటిని ‘వైల్డ్ గేమ్’ అని పిలుస్తారు. అడవిలో అడవి జింక, దుప్పి, కుందేలు, ఉడుత, రాకూన్స్ వంటి జంతువులతో పాటు  అడవి పక్షులైన డక్​, టర్కీ, కౌజు వంటివి రుచికరంగా వండి పెడతారు. ఫుడ్​తోపాటు ఇక్కడున్న వైన్​యార్డ్​లు గెస్ట్​లను అట్రాక్ట్ చేస్తాయి. ఇక్కడ తయారయ్యే వైన్​ ఇతర ప్రాంతాలకు ఎక్స్​పోర్ట్ అవుతుంది. 

హ్యాపీ గార్డెన్

ఇక్కడి ఎల్ ఓర్టో ఫెలిస్​ లేదా ది హ్యాపీ వెజిటబుల్ గార్డెన్​ కచ్చితంగా చూడాలి. అక్కడ చాలా పండ్లు, మొక్కలు, కూరగాయలు పండిస్తారు. ఈ గార్డెన్​లో వృద్ధులు, దివ్యాంగులైన పిల్లల కోసం కమ్యూనిటీ ప్రోగ్రామ్​ చేస్తారు. 

సీజన్​లో మాత్రమే ఓపెన్

ఇక్కడికి వెళ్లాక చుట్టుపక్కల తిరిగేందుకు కారు అద్దెకి తీసుకోవచ్చు. బోర్గోలో కారు తీసుకుని దగ్గర్లోని సియెనా టౌన్​కి వెళ్లొచ్చు. ఈ జర్నీ పావుగంట ఉంటుంది. బోర్గో వెళ్లడానికి బెస్ట్​ టైం జులై, ఆగస్ట్​ నెలలు. ఆ సీజన్​లో పాలియో డి సియెనా హార్స్ రేస్ జరుగుతుంది. అందులో పది గుర్రాలు, రైడర్స్ ఉంటారు. ఈ ట్రెడిషన్14వ శతాబ్దం నుంచి కొనసాగుతోంది. అప్పుడు ఇక్కడి స్థానికులు, విజిటర్స్​తో కళకళలాడుతుంది. దీనికి ఇక్కడ చాలా క్రేజ్​ ఉంటుంది. బోర్గో శాన్ ఫెలిస్​ సీజనల్​ హోటల్. అందుకని డిసెంబర్​ నుంచి మార్చి వరకు క్లోజ్​ చేసి ఉంచుతారు.