తెలంగాణలో ఏడు చోట్ల మెట్ల బావుల పునరుద్ధరణ పనులు

తెలంగాణలో ఏడు చోట్ల మెట్ల బావుల పునరుద్ధరణ పనులు
  • బన్సీలాల్ పేట బావిని పునరుద్ధరించిన సంస్థకే పనుల అప్పగింత
  • గద్వాల, కామారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో మొదలైన పనులు
  • ఉస్మానియా యూనివర్శిటీలోనూ ఒక మెట్ల బావి

ఖమ్మం, వెలుగు : సికింద్రాబాద్ లో చెత్త, పూడికతో నిండిపోయిన బన్సీలాల్ పేట మెట్ల బావిని పునరుద్ధరించి టూరిస్ట్ స్పాట్ గా తీర్చిదిద్దడంతో  రాష్ట్రంలో ఉన్న మిగిలిన మెట్ల బావులను కూడా బాగు చేసేందుకు ప్లాన్​చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో మూడు, కామారెడ్డి జిల్లాలో రెండు, ఖమ్మం జిల్లాలో ఒకటి, హైదరాబాద్​ఉస్మానియా యూనివర్శిటీలోని మెట్ల బావులకు ఎన్జీవోల సహకారంతో పూర్వవైభవం తేనున్నారు. మెట్ల బావులన్నీ చెత్త, పూడికతో నిండి పనికి రాకుండాపోయాయి. ముందుగా పూడిక తొలగించి కొత్త రూపునిస్తారు. తర్వాత లైటింగ్ ఏర్పాటు చేసి టూరిస్ట్ స్పాట్ గా తీర్చిదిద్దనున్నారు. బన్సీలాల్​పేట బావిని పునరుద్ధరించినది రెయిన్​వాటర్​ ప్రాజెక్ట్స్ అనే సంస్థనే ఏడు చోట్ల రినోవేషన్​బాధ్యతలు తీసుకుంది. ఖమ్మంలోని జాఫర్​బావి పూడికతీత  పనులు ఏప్రిల్ లోనే మొదలయ్యాయి.

రూ.12.50 లక్షలతో పనులు

కాకతీయుల పాలనలో ఖమ్మం ఖిల్లాను ఆనుకొని ఉన్న జాఫర్​ బావిని మంచినీటి కోసం ఉపయోగించేవారు. ఆ తర్వాత వరద నీటితో వచ్చిన చెత్తతో నిండిపోవడం, స్థానికులు కూడా బావిని డంప్​యార్డుగా వాడుకోవడంతో మొత్తం పూడికతో నిండిపోయింది. 60 అడుగుల లోతు, 30 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ మెట్ల బావి చుట్టూ బ్రిడ్జి కూడా నిర్మించారు. అప్పట్లో మనుషులు, గుర్రాలు తిరిగేందుకు దీన్ని నిర్మించి ఉంటారని భావిస్తున్నారు. ఈ బావి పునరుద్ధరణ కోసం ఖమ్మం కార్పొరేషన్​రూ.12.50 లక్షలు కేటాయించింది. ఈ ఫండ్స్​తో పూడిక తీస్తున్నారు. క్రేన్లు, మనుషుల ద్వారానే పూడికను తీయాల్సిరావడం,  రాళ్ల మధ్యలో నుంచి నీళ్ల ఊట వస్తుండడంతో పనులు ఆలస్యం అవుతున్నాయి. వర్షాల వల్ల అడ్డంకులు లేకపోతే మరో నెల రోజుల్లో పూడికతీత పూర్తవుతుందని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. ఖమ్మం నగరం నడిబొడ్డున సుమారు 4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఖిల్లా ఉంది. ఈ బావి పునరుద్ధరణ తర్వాత ఖిల్లా టూరిస్ట్ అట్రాక్షన్​గా మారుతుందని ఆఫీసర్లు భావిస్తున్నారు. 

గద్వాల జిల్లాలో మూడింటికి అగ్రిమెంట్

గద్వాల జిల్లాలోని మూడు మెట్ల బావుల పునరుద్ధరణ కోసం ఈ నెల 9న రెయిన్​వాటర్​ ప్రాజెక్ట్స్​సంస్థ, కలెక్టర్​క్రాంతి సమక్షంలో అగ్రిమెంట్ కుదిరింది.   బెంగళూరుకు చెందిన ఒక ఎన్జీవో ఆర్థిక సహకారం ఇస్తోందని అధికారులు చెబుతున్నారు. కామారెడ్డి జిల్లాలో లింగంపేట,  భిక్నూరులోని రెండు మెట్ల బావులకు కొత్త రూపు తీసుకురానున్నారు. లింగంపేటలోని నాగన్నబావి రెనొవేషన్​కోసం ఇన్ఫోసిస్​సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్​ఆర్​) ఫండ్స్​ను కేటాయించినట్టు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. భిక్నూరు మెట్ల బావి రెనొవేషన్​కోసం హైదరాబాద్ కు చెందిన ప్రమతి టెక్నాలజీస్ తో పాటు మరికొందరు ముందుకు వచ్చారని చెప్పారు. ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ లోని బావి పనులు కూడా పురోగతిలో ఉన్నాయి.

నెల రోజుల్లో పూడికతీత పూర్తి కావచ్చు

కాకతీయులు ఖమ్మం ఖిల్లా నిర్మించినప్పుడే మెట్లబావిని తవ్వించారు. అసఫ్ జాహీల పాలనలో జాఫర్ ఉద్దౌలా అనే తాలుకాదార్ ఈ బావిని పునర్నిర్మించారు. స్థానికులు దీన్ని జాఫర్ బావిగా పిలుస్తున్నారు. ఖిల్లా పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్నా బడ్జెట్ లేకపోవడం వల్ల మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. మరో 15 నుంచి 20 అడుగుల మేర పూడిక ఉంటుందని భావిస్తున్నాం. వర్షాలు పడకపోతే నెల రోజుల్లోపు పూడికతీత పనులు పూర్తవుతాయి. 
– మల్లు నాయక్​, పురావస్తు శాఖ అడిషనల్​ డైరెక్టర్, వరంగల్